నిప్పులకొలిమిలా రాష్ట్రం
ABN , Publish Date - Apr 21 , 2026 | 04:11 AM
వాయవ్య దిశ నుంచి వీచిన పొడిగాలులతో సోమవారం రాష్ట్రం నిప్పులకొలిమిలా మారింది. కోస్తా, రాయలసీమల్లోని పలు ప్రాంతాల్లో వడగాడ్పులు వీచాయి.
అమరావతి, విశాఖపట్నం, ఏప్రిల్ 20(ఆంధ్రజ్యోతి): వాయవ్య దిశ నుంచి వీచిన పొడిగాలులతో సోమవారం రాష్ట్రం నిప్పులకొలిమిలా మారింది. కోస్తా, రాయలసీమల్లోని పలు ప్రాంతాల్లో వడగాడ్పులు వీచాయి. సోమవారం 289 మండలాల్లో 40 డిగ్రీలు, అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పార్వతీపురం మన్యం జిల్లా మక్కువలో 44.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. మంగళవారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, అనకాపల్లి జిల్లాల్లోని 46 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, శ్రీకాకుళం నుంచి ఏలూరు వరకు మరో 29 మండలాల్లో వడగాడ్పుల ప్రభావం ఉంటుందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మరోవైపు ద్రోణి ప్రభావంతో అల్లూరి, పోలవరం జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు, శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఇదిలావుండగా నెలాఖరు వరకు ఎండ తీవ్రత కొనసాగుతుందని వాతావరణ నిపుణుడొకరు తెలిపారు.