Share News

సిట్‌ కస్టడీకి ఇన్‌స్పెక్టర్‌ నాగరాజు

ABN , Publish Date - Jul 03 , 2026 | 06:22 AM

విజయవాడలోని కృష్ణలంక రాజీవ్‌నగర్‌కు చెందిన రౌడీషీటర్‌ గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌ఎస్‌వీవీ నాగరాజును శుక్రవారం నుంచి పదో తేదీ వరకు సిట్‌ కస్టడీకి ఇచ్చారు.

సిట్‌ కస్టడీకి ఇన్‌స్పెక్టర్‌ నాగరాజు

  • నేటి నుంచి 8 రోజుల పాటు విచారణ

  • విజయవాడ కోర్టు అనుమతి..

  • రాజమహేంద్రవరం జైలులో విచారణ

విజయవాడ, జూలై 2(ఆంధ్రజ్యోతి): విజయవాడలోని కృష్ణలంక రాజీవ్‌నగర్‌కు చెందిన రౌడీషీటర్‌ గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌ఎస్‌వీవీ నాగరాజును శుక్రవారం నుంచి పదో తేదీ వరకు సిట్‌ కస్టడీకి ఇచ్చారు. విజయవాడ రెండో అదనపు జ్యుడిషియల్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు న్యాయాధికారి ఎస్‌.శ్రీకాంత్‌ ఈ మేరకు అనుమతి ఇచ్చారు. ఈ కేసులో నాగరాజును 12 రోజుల కస్టడీకి ఇవ్వాలని సిట్‌ అధికారులు దాఖలు చేసిన పిటిషన్‌పై ఆయన గురువారం తీర్పును వెలువరించారు. ఎనిమిది రోజుల పాటు సిట్‌ కస్టడీకి ఇచ్చారు. నాగరాజును రాజమండ్రి కేంద్ర కారాగారంలోనే విచారించాలని స్పష్టం చేశారు. ఆయన తరఫున ఇద్దరు న్యాయవాదులకు అనుమతి ఇచ్చారు. విచారణ సమయంలో నిందితుడికి కనిపించేలా ఒక న్యాయవాది మాత్రమే ఉండాలని తీర్పులో పేర్కొన్నారు. విచారణ జరుగుతున్నప్పుడు న్యాయవాది ఎట్టి పరిస్థితుల్లో జోక్యం చేసుకోరాదన్నారు. విచారణను ఆడియో, వీడియో, సీసీ కెమెరాల రికార్డింగ్‌ చేసి కోర్టుకు సమర్పించాలి. దీన్ని జైలు అధికారులు కోర్టు తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు భద్రంగా ఉంచాలి. నాగరాజును ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రమే విచారణ చేయాలి. ఏరోజుకారోజు విచారణ పూర్తయిన తర్వాత నివేదికను జైలు సూపరింటెండెంట్‌ కోర్టుకు పంపాలి.

Updated Date - Jul 03 , 2026 | 06:22 AM