యూనిఫాం వదిలేస్తా!
ABN , Publish Date - Jun 26 , 2026 | 06:20 AM
విజయవాడలోని కృష్ణలంక పోలీస్ స్టేషన్ మాజీ ఇన్‌స్పెక్టర్ ఎస్‌ఎస్‌వీవీ నాగరాజు యూనిఫాం తీసేద్దామని నిర్ణయించుకున్నారా? పోలీసు ఉద్యోగంలో రోజురోజుకూ ఒత్తిడి పెరుగుతోందని భావించారా?
సన్నిహితుల వద్ద ఇన్‌స్పెక్టర్ నాగరాజు వ్యాఖ్యలు
ఒత్తిడితో కూడిన ఉద్యోగం అవసరమా అని ఆవేదన
(ఆంధ్రజ్యోతి-విజయవాడ)
విజయవాడలోని కృష్ణలంక పోలీస్ స్టేషన్ మాజీ ఇన్‌స్పెక్టర్ ఎస్‌ఎస్‌వీవీ నాగరాజు యూనిఫాం తీసేద్దామని నిర్ణయించుకున్నారా? పోలీసు ఉద్యోగంలో రోజురోజుకూ ఒత్తిడి పెరుగుతోందని భావించారా? అంటే.. పోలీసు వర్గాలు అవుననే అంటున్నాయి. నాగరాజు ఎన్నికలకు ముందు పోలీసు కమిషనరేట్‌కు వచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చాక కమిషనరేట్ పరిధిలోని ఇన్‌స్పెక్టర్లను మార్చారు. ఇందులో భాగంగా నాగరాజును కృష్ణలంక ఇన్‌స్పెక్టర్‌గా నియమించారు. పోలీసు కమిషనరేట్‌లో నాగరాజుకు కొంతమంది ఇన్‌స్పెక్టర్లు సన్నిహితంగా ఉండేవారు. కోనసీమ జిల్లాలో ఆయనతో పాటు చదువుకున్న కొంతమంది స్నేహితులు వివిధ రంగాల్లో విజయవాడలో స్థిరపడ్డారు. వారందరినీ నాగరాజు అప్పుడప్పుడు కలుస్తుండేవారు. యోగక్షేమాల గురించి మాట్లాడుకునే సందర్భంలో ఉద్యోగానికి రాజీనామా చేసే యోచనలో ఉన్నానని నాగరాజు వ్యాఖ్యానించినట్టు సన్నిహితులు చెబుతున్నారు. రౌడీషీటర్ గాదె సాయికృష్ణ ఘటనకు ముందే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.