Share News

High Court: హాస్టళ్లలో సోదాలు ఓ ప్రహసనం

ABN , Publish Date - Jan 02 , 2026 | 05:45 AM

ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో అధికారుల తనిఖీలు ప్రహసనంగా మారుతున్నాయని హైకోర్టు పేర్కొంది. సోదాలు చేసి నివేదికలు ఇవ్వడం వల్ల ఎలాంటి ప్రయోజనం...

High Court: హాస్టళ్లలో సోదాలు ఓ ప్రహసనం

  • తనిఖీలు చేసి నివేదికలు ఇస్తే ఏం లాభం?

  • లోపాలు సరిదిద్దినప్పుడే ఫలితాలు: హైకోర్టు

అమరావతి, జనవరి 1 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో అధికారుల తనిఖీలు ప్రహసనంగా మారుతున్నాయని హైకోర్టు పేర్కొంది. సోదాలు చేసి నివేదికలు ఇవ్వడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని, లోపాలను సరిదిద్ది సమస్యలను పరిష్కరించినప్పుడే ఫలితాలు వస్తాయని స్పష్టంచేసింది. రాష్ట్రవ్యాప్తంగా 3 వేలకు పైగా సంక్షేమ హాస్టళ్లు ఉన్నాయని, వాటన్నిటిలో ఉన్న సమస్యలను న్యాయస్థానం పరిష్కరించజాలదని.. వాటి పరిష్కారానికి తాలూకా, జిల్లా, రాష్ట్రస్థాయుల్లో యంత్రాంగం అవసరమని తెలిపింది. జీవో 46 ప్రకారం జిల్లా కలెక్టర్లు/జేసీలు పర్యవేక్షణ అధికారులు 2వారాలకోసారి హాస్టళ్లను సందర్శించి, రాత్రి వేళ్లలో అక్కడ బస చేయాల్సి ఉందని గుర్తుచేసింది. హాస్టళ్లల్లో మౌలిక వసతుల కల్పన పర్యవేక్షణకు సంబంధిత శాఖల అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో కమిటీ వేయాలని ఆదేశించింది. నెలకోసారి ఈ కమిటీ సమావేశమై జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ మార్గదర్శకాల ప్రకారం హాస్టళ్లలో సదుపాయాల కల్పనను పర్యవేక్షించాలని నిర్దేశించింది. హాస్టళ్లలో తాగునీరు, మరుగుదొడ్లు వంటి మౌలికసదుపాయాల కల్పనకు సంబంధించి నిర్దిష్ట గడువుతో సమగ్ర ప్రణాళిక రూపొందించి తమ ముందుంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను 21కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌, జస్టిస్‌ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం ఇటీవల ఉత్తర్వులిచ్చింది.


సంక్షేమ హాస్టళ్లలో మౌలిక వసతులు కల్పించకపోవడాన్ని సవాల్‌ చేస్తూ కాకినాడకు చెందిన కీతినీడి అఖిల్‌ శ్రీగురు తేజ దాఖలుచేసిన పిల్‌పై హైకోర్టు పలుమార్లు విచారణ జరిపింది. ఇటీవల విచారణ సందర్భంగా.. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం గురుకుల హాస్టల్లో 86మంది విద్యార్థులు కామెర్ల బారినపడడం, ఓ విద్యార్థి మరణించడం, 150మంది ఆస్పత్రిలో చేరడంపై దర్యాప్తునకు ఆదేశించింది. నివేదిక సమర్పించాలని విజయనగరం జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శిని ఆదేశించింది. దీంతో కార్యదర్శి నివేదిక సమర్పించారు. బోరుబావి నుంచి తీసుకున్న నీటిని ఓవర్‌హెడ్‌ ట్యాంక్‌లో నిల్వచేసి తాగునీరుగా వినియోగిస్తున్నట్లు తెలిపారు. ‘హాస్టల్లో 611 మంది విద్యార్థులు ఉన్నారు. అదనపు స్నానపు గదులు, మరుగుదొడ్లు అవసరం. పిల్లలెవరికీ మంచాలు ఇవ్వలేదు. తరగతి గదుల్లోనే నిద్రిస్తున్నారు. ప్రత్యేక డార్మిటరీ నిర్మించాలి’ అని సూచించారు. ఈ నివేదికను ధర్మాసనం ప్రస్తావించగా.. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎ్‌స.ప్రణతి స్పందించారు. కురుపాం గురుకులంలో ఆర్వోప్లాంట్‌ ద్వారానే తాగునీటిని అందిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని హాస్టళ్లలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ ద్వారా మరుగుదొడ్లు నిర్మిస్తున్నామని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 320 ప్లాంట్లు మంజూరయ్యాయని చెబుతున్నప్పటికీ ప్రస్తుత అవసరాలకు ఏమాత్రం సరిపోవని ధర్మాసనంపేర్కొంది.

Updated Date - Jan 02 , 2026 | 05:46 AM