Share News

పంటల బీమా నమోదు ప్రక్రియ పరిశీలన

ABN , Publish Date - Aug 02 , 2026 | 11:43 PM

మండలంలోని రావికమతం, దొండపూడి గ్రామాల్లో పంటల బీమా నమోదు ప్రక్రియను ఆదివారం జిల్లా వ్యవసాయ శాఖ అధికారిణి ఆశాదేవి పరిశీలించారు.

పంటల బీమా నమోదు ప్రక్రియ పరిశీలన
దొండపూడి మీసేవ సెంటర్‌లో పంటల బీమా ప్రక్రియను పరిశీలిస్తున్న జిల్లా వ్యవసాయాధికారిణి ఆశాదేవి

రైతులు ఏ సమయంలో వచ్చినా నమోదు చేయాలని సిబ్బందికి జిల్లా వ్యవసాయ శాఖ అధికారిణి ఆదేశం

రావికమతం, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): మండలంలోని రావికమతం, దొండపూడి గ్రామాల్లో పంటల బీమా నమోదు ప్రక్రియను ఆదివారం జిల్లా వ్యవసాయ శాఖ అధికారిణి ఆశాదేవి పరిశీలించారు. ఆ గ్రామాల్లోని సీఎస్‌సీ(కామన్‌ సర్వీస్‌ సెంటర్‌)లను సందర్శించి రైతులు ఏ సమయంలో వచ్చినా పంటల బీమా నమోదు చేయాలని సిబ్బందిని ఆమె ఆదేశించారు. సీఎస్‌సీల ద్వారా కేవలం 842 మంది రైతులు మాత్రమే 315 హెక్టార్లకు ప్రీమియం చెల్లించి బీమా చేయించుకున్నారన్నారు. ఈ మండలంలో 13 వేల మంది రైతులు పంటలను సాగు చేస్తుండగా, వీరిలో 10 వేల మంది వివిధ బ్యాంకుల ద్వారా రుణాలు పొంది బీమా కూడా తీసుకున్నారని తెలిపారు. మిగిలిన వారందరూ సీఎస్‌సీల్లో పంటల బీమా చేయించుకోవాలన్నారు. రైతులకు వ్యవసాయ శాఖ సిబ్బంది గ్రామ స్థాయిలో విరివిగా పంటల బీమాపై అవగాహన కల్పించాలని సూచించారు. ఈ ఏడాది ఖరీఫ్‌ సాగుకు ఎల్‌నినో ప్రభావం వలన వర్షాలు పడే అవకాశం తక్కువగా ఉందన్నారు. ఈ దృష్ట్యా రైతులు ఒక్క వరి సాగుపైనే ఆధార పడకుండా ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించేలా చర్యలు చేపట్టాలన్నారు. ఎల్‌నినో ప్రభావం వలన వర్షపాతం 40 శాతం కన్నా తక్కువగా నమోదయ్యే పరిస్ధితులు ఉంటాయని, దీని వలన ప్రతి వరి సాగు చేసే రైతు పంటల బీమా తప్పనిసరిగా చేయించుకోవాలని ఆమె కోరారు. ఎకరానికి రూ.84లు మాత్రమే ప్రీమియంగా చెల్లించాలన్నారు. ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా ఎకరానికి రూ.42,492లు పంటల బీమా నష్ట పరిహారంగా వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి రమేశ్‌బాబు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 02 , 2026 | 11:43 PM