‘ఐఎన్‌ఎస్ అరిధమన్’ సిద్ధం
ABN , Publish Date - Feb 22 , 2026 | 03:55 AM
స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన మూడో అణు జలాంతర్గామి ‘ఐఎన్‌ఎస్ అరిధమన్’ త్వరలోనే నౌకాదళం అమ్ములపొదిలో చేరనుంది.
సముద్ర పరీక్షలు పూర్తి చేసుకున్న మూడో అణు జలాంతర్గామి
త్వరలోనే నేవీ అమ్ములపొదిలోకి
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన మూడో అణు జలాంతర్గామి ‘ఐఎన్‌ఎస్ అరిధమన్’ త్వరలోనే నౌకాదళం అమ్ములపొదిలో చేరనుంది. మరో రెండు నెలల్లో దీనిని ప్రారంభించి జాతికి అంకితం చేస్తారని విశ్వసనీయంగా తెలిసింది. విశాఖపట్నంలోని నేవీ షిప్ బిల్డింగ్ సెంటర్‌లో అణు జలాంతర్గాముల నిర్మాణం కొనసాగుతోంది. ఏటీవీ(అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ వెజల్) ప్రాజెక్టు కింద వీటిని నిర్మిస్తున్నారు. మొదట రష్యా సహకారంతో ఐఎన్‌ఎస్ అరిహంత్‌ను నిర్మించి నేవీకి అందించారు. ఇది దశాబ్ద కాలం నుంచి సేవలందిస్తోంది. రెండోదైన ఐఎన్‌ఎస్ అరిఘాత్‌ను 2024 ఆగస్టులో ప్రారంభించారు. అదే సిరీ్‌సలో మూడోదైన ఐఎన్‌ఎస్ అరిధమన్ సముద్ర పరీక్షలన్నీ పూర్తి చేసుకొని సేవలకు సిద్ధమైంది. దీనిని ఇంకో రెండు నెలల్లో ప్రారంభించనున్నట్టు నేవీ వర్గాలు పేర్కొన్నాయి. వీటిని స్ట్రాటజిక్ స్ట్రయిక్ న్యూక్లియర్ సబ్‌మెరైన్లు (ఎస్‌ఎస్‌బీఎన్)గా వ్యవహరిస్తున్నారు.
ఇవీ ప్రత్యేకతలు..
ఐఎన్‌ఎస్ అరిధిమన్ పొడవు 130 మీటర్లు. బీమ్ వెడల్పు 11 మీటర్లు. డ్రాఫ్ట్ సుమారు 10 మీటర్లు. ఇది సముద్ర ఉపరితలంపై ఉన్నప్పుడు ఆరు వేల టన్నులు, లోపల ఉన్నప్పుడు ఏడు వేల టన్నుల బరువును తరలించగలుగుతుంది. అధికారులు, నావికులు కలిపి 95 నుంచి 100 మంది వరకు ఉంటారు. ఉపరితలంలో గంటకు 12 నుంచి 15 నాటికల్ మైళ్ల వేగంతోను, సముద్రం లోపల గంటకు 24 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణిస్తుంది. అవసరమైనంత ఇంధనం, సిబ్బందికి అవసరమైన ఆహారం సమకూరిస్తే ఎంత దూరమైనా ప్రయాణించే సామర్థ్యం దీనికి ఉంది. దీనికి 83 మెగావాట్ సామర్థ్యం కలిగి నీటి ఒత్తిడితో పనిచేసే సీఎల్‌డబ్ల్యూఆర్-బి1 రియాక్టర్‌ను అమర్చారు. ఇందులో బాలిస్టిక్ మిస్సైళ్లను నిట్టనిలువుగా ప్రయోగించే ఏర్పాట్లు ఉన్నాయి.