Share News

విశాఖలో ఇన్ఫోసిస్‌ శాశ్వత క్యాంపస్‌

ABN , Publish Date - Mar 02 , 2026 | 04:16 AM

ప్రముఖ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్‌ విశాఖ నగరంలోని ఎండాడ కొండపై శాశ్వత క్యాంపస్‌ ఏర్పాటు చేయనుంది.

విశాఖలో ఇన్ఫోసిస్‌ శాశ్వత క్యాంపస్‌

  • ఎండాడ కొండపై 20 ఎకరాలు గుర్తింపు

విశాఖపట్నం, మార్చి 1(ఆంధ్రజ్యోతి): ప్రముఖ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్‌ విశాఖ నగరంలోని ఎండాడ కొండపై శాశ్వత క్యాంపస్‌ ఏర్పాటు చేయనుంది. దీనికి సంబంధించి ఆ కంపెనీ ప్రతినిధులు, జిల్లా అధికారులు కలిసి కొండపై భూమిని పరిశీలించారు. జాతీయ రహదారికి ఆనుకుని ఎండాడ కొండవాలులో దిశా పోలీస్ స్టేషన్, వీఎంఆర్డీఏ కల్యాణ మండపాన్ని నిర్మించారు. ఇదే కొండపై పడమర భాగంలో కాపు కల్యాణ మండపం, ప్రైవేటు ఆస్పత్రికి కొంత స్థలం కేటాయించారు. ఈ కొండపైనే ఇన్ఫోసిస్‌ కోసం 20 ఎకరాలను జిల్లా అధికారులు గుర్తించారు. ఈ విషయాన్ని రెవెన్యూ అధికారులు ఇన్ఫోసిస్‌ ప్రతినిధులకు సూచనప్రాయంగా వెల్లడించారు. అయితే ఇన్ఫోసిస్‌కు భూమి కేటాయింపుపై ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది. ఇంకా మౌలిక సదుపాయాలు, రాయితీలపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయితే 20 ఎకరాలను నేరుగా కంపెనీకి బదలాయిస్తారా..? లేకపోతే ఏపీఐఐసీ కేటాయించి, మౌలిక వసతులు కల్పించిన తర్వాత బదలాయిస్తారా..? అన్నది ఖరారు కాలేదు. కాగా.. ప్రస్తుతం ఇన్ఫోసిస్‌ మధురవాడ ఐటీ హిల్స్‌లోని ప్రైవేటు భవనంలో కార్యకలాపాలు సాగిస్తోంది.

Updated Date - Mar 02 , 2026 | 04:16 AM