Share News

పారిశ్రామిక పరుగు!

ABN , Publish Date - Feb 19 , 2026 | 12:22 AM

మచిలీపట్నంలో మెగా పరిశ్రమల స్థాపనకు అవసరమైన భూముల సేకరణ ప్రక్రియ వేగంగా జరుగుతోంది. ఇప్పటికే 9,500 ఎకరాల భూమి కావాలని ఏపీ మారీటైమ్‌ బోర్డు ప్రతిపాదించింది. గత రెండు రోజులుగా రెవెన్యూ అధికారులు ఏయే గ్రామాల్లో ఎంత భూమి ఉందని సర్వే చేసి లెక్కలు తీస్తున్నారు. ఇదే సమయంలో వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు ఈ ప్రాంతంలో ఇబ్బడిముబ్బడిగా భూములు కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఒక్కసారిగా భూముల ధరలు పెరిగాయి. దీనివల్ల ప్రభుత్వం భూములు తీసుకునే సమయంలో ఇబ్బందులు ఎదురవుతాయని అధికారులు అంటున్నారు.

పారిశ్రామిక పరుగు!

- మచిలీపట్నంలో మెగా పరిశ్రమల స్థాపనకు భూసేకరణ

- 9,500 ఎకరాల భూమి కావాలని ఏపీ మారీటైమ్‌ బోర్డు ప్రతిపాదన

- గత రెండు, మూడు రోజులుగా సర్వే చేస్తున్న అధికారులు

- రోడ్‌ కం రైలు మార్గాల కోసం భూముల చివరి విడత సర్వే

- ఇబ్బడిముబ్బడిగా భూములు కొనుగోలు చేస్తున్న వ్యాపారులు

- భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవంటున్న అధికారులు

మచిలీపట్నంలో మెగా పరిశ్రమల స్థాపనకు అవసరమైన భూముల సేకరణ ప్రక్రియ వేగంగా జరుగుతోంది. ఇప్పటికే 9,500 ఎకరాల భూమి కావాలని ఏపీ మారీటైమ్‌ బోర్డు ప్రతిపాదించింది. గత రెండు రోజులుగా రెవెన్యూ అధికారులు ఏయే గ్రామాల్లో ఎంత భూమి ఉందని సర్వే చేసి లెక్కలు తీస్తున్నారు. ఇదే సమయంలో వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు ఈ ప్రాంతంలో ఇబ్బడిముబ్బడిగా భూములు కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఒక్కసారిగా భూముల ధరలు పెరిగాయి. దీనివల్ల ప్రభుత్వం భూములు తీసుకునే సమయంలో ఇబ్బందులు ఎదురవుతాయని అధికారులు అంటున్నారు.

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం :

జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో పరిశ్రమల ఏర్పాటు కోసం భూముల సర్వే గత రెండు, మూడు రోజులుగా జరుగుతోంది. రానున్న రోజుల్లో మచిలీపట్నం పోర్టు నుంచి కార్యకలాపాలు ప్రారంభమైతే, ఈ ప్రాంతంలో పోర్టుకు అనుబంధంగా పరిశ్రమల ఏర్పాటుకు అవకాశం ఏర్పడనుంది. దీంతో ఇటీవల ఏపీ మారీటైమ్‌ బోర్డు అధికారులు పోర్టు అనుబంధ పరిశ్రమల ఏర్పాటు కోసం భూములు అవసరమని ప్రభుత్వానికి నివేదిక పంపారు. దీంతో మచిలీపట్నం నార్త్‌ మండలంలోని పోర్టు సమీపంలోని 10 గ్రామాల్లో సుమారుగా 9,500 ఎకరాల భూమిని రెవెన్యూ అధికారులు సర్వే చేస్తున్నారు. ఈ ప్రకియ్రతో రైతుల్లో కొంతమేర అలజడి నెలకొంది. మరోవైపు మచిలీపట్నంలో పరిశ్రమలు ఏర్పాటైతే ఈ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధికి నోచుకుంటుందనే వాదన వినపడుతోంది. పోర్టుకు అనుబంధంగా పరిశ్రమల ఏర్పాటుతో పాటు మచిలీపట్నం- విజయవాడ జాతీయ రహదారి-65, కత్తిపూడి-ఒంగోలు కోస్తా జాతీయ రహదారి-216 మచిలీపట్నం వద్ద కలిసే ప్రాంతం నుంచి పోర్టు వరకు నూతనంగా నిర్మాణం చేసే రహదారికి సంబంధించి భూసేకరణ కోసం తుది సర్వేను రెవెన్యూ అధికారులు చేస్తున్నారు.

ప్రత్యేక ప్రణాళిక

మచిలీపట్నం పోర్టు నుంచి ఎగుమతులు, దిగుమతులు ప్రారంభమైతే ఈ ప్రాంతంలో పోర్టుకు అనుబంధంగా ధర్మల్‌ పవర్‌ ప్రాజెక్టులు, ఆయిల్‌ రిఫైనరీ, ఎరువులు, ఫెస్టిసైడ్స్‌ తయారీ కంపెనీలు, టూరిజంతో పాటు, ప్యాకింగ్‌ పరిశ్రమలు ఇలా మొత్తంగా 29 రకాల పరిశ్రమలను పోర్టు సమీపంలో, జిల్లాలోని ఇతర ప్రాంతాల్లోనూ ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉంది. ఇందుకోసం ఏపీ మారీటైమ్‌ బోర్డు అధికారులు ఇటీవల కాలంలో ఈ ప్రాంతంలో పరిశ్రమల ఏర్పాటు కోసం ప్రత్యేక ప్రణాళికను రూపొందించారు. ఈ పరిశ్రమల ఏర్పాటు కోసం సుమారు 9,500 ఎకరాల భూమి అవసరం అవుతుందని సూచన ప్రాయంగా నిర్ధారించారు. ఈ భూమి అందుబాటులో ఉందా లేదా అనే అంశంపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వానికి ప్రతిపాదన చేశారు. ప్రభుత్వ ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాల మేరకు జిల్లా అధికారులు మచిలీపట్నం నార్త్‌ మండలంలో భూములకు సంబంధించిన సర్వేను గత సోమవారం నుంచి ప్రారంభించారు.

భూసేకరణ చేసే గ్రామాలు ఇవీ

మచిలీపట్నం పోర్టుకు సమీపంలో ఉన్న మంగినపూడి, తపసిపూడి, కరగ్రహారం గోపువానిపాలెం, కొత్తపూడి, పొట్లపాలెం, చిరివేళ్లపాలెం, గోకవరం, తాళ్లపాలెం, కానూరు గ్రామాల్లో ప్రభుత్వ, అసైన్డ్‌, బేఆఫ్‌ బెంగాల్‌ భూములతోపాటు పట్టా భూములకు సంబంధించి ఎంతమేర అందుబాటులో ఉన్నాయనే అంశంపై రెవెన్యూ సిబ్బంది సర్వే చేస్తున్నారు. ఇక్కడి భూములకు రిజిస్ర్టార్‌ కార్యాలయంలో ఎంతమేర ధర ఉంది, బహిరంగ మార్కెట్‌లో ఆయా గ్రామాల్లో ఎకరం భూమి ఎంత ధర పలుకుతుందనే అంశాలకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు.

ఇటీవల పెరిగిన భూముల కొనుగోళ్లు

మచిలీపట్నం పోర్టు నుంచి కార్యకలాపాలు ప్రారంభమైతే ఈ ప్రాంతంలో భూముల ధరలు మరింతగా పెరుగుతాయనే ముందుచూపుతో ఇటీవల కాలంలో వివిధ ప్రాంతాలకు చెందిన చిన్నపాటి పారిశ్రామికవేత్తలు మచిలీపట్నం నార్త్‌ మండలంలో భూములు కొనుగోలు చేయడం ప్రారంభించారు. సాఫ్ట్‌వేర్‌ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులు కూడా 25 సెంట్లు, అరెకరం, ఎకరం ఆపైన భూమిని కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఈ ప్రాంతంలో భూముల ధరలు అమాంతం పెరిగిపోయాయి. రహదారుల పక్కన ఉన్న భూమి ఎకరం రెండున్నర కోట్ల నుంచి మూడు కోట్ల రూపాయల వరకు క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. రెండు రోజుల క్రితం తపసిపూడి గ్రామంలో ఎకరం భూమిని ఒక పారిశ్రామికవేత్త రూ.4 కోట్లకు కొనుగోలు చేసినట్లు స్థానికులు చెప్పుకుంటున్నారు. పరిశ్రమల స్థాపన కోసం భూమిని ప్రభుత్వం తీసుకుంటే ప్రస్తుతం రిజిస్ర్టార్‌ కార్యాలయంలో నమోదై ఉన్న ఎకరం భూమి విలువను బట్టి రెండున్నర రెట్లు నగదును రైతులకు చెల్లించే వెసులుబాటు ఉంటుందని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. రైతుల నుంచి నేరుగా ప్రభుత్వం భూమిని తీసుకుంటే ప్రస్తుతం ఉన్న భూమి విలువకన్నా రెండున్నర రెట్లు అధికంగా నగదు ఇచ్చేందుకు అవకాశం ఉండటంతో రైతుల నుంచి పెద్దగా అభ్యంతరాలు రావని అధికారులు అంటున్నారు. కోట్లాది రూపాయలతో భూములను కొనుగోలు చేసిన వారికి మాత్రం నష్టమే జరుగుతుందని, ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయని, వాటిని పరిష్కరించడం కొంత ఆలస్యమవుతుందని రెవెన్యూ అధికారులు పేర్కొంటున్నారు. భూములు కొనుగోలు చేసే వారు ఆచితూచి వ్యవహరించి నిర్ణయం తీసుకుంటే మంచిదని రెవెన్యూ అధికారులు అంటున్నారు.

సర్వే చేస్తున్నాం

మచిలీపట్నం నార్త్‌ మండలంలో భూముల సర్వే జరుగుతోంది. అయితే ఈ భూములు ఎందుకు వినియోగిస్తారనే అంశంపై స్పష్టత లేదు. ఏ గ్రామంలో ఎంత భూమి ఉంది, వాటి సర్వే నెంబర్ల ఆధారంగా వివరాలు నమోదు చేస్తున్నాం. తదుపరి నిర్ణయం ప్రభుత్వమే తీసుకుంటుంది.

- నాగభూషణం, మచిలీపట్నం నార్త్‌మండల తహసీల్దార్‌

Updated Date - Feb 19 , 2026 | 12:22 AM