విశాఖ-ఢిల్లీ ఇండిగో విమానానికి తప్పిన ముప్పు
ABN , Publish Date - Mar 29 , 2026 | 03:56 AM
విశాఖపట్నం నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. పైలట్ చాకచక్యంగా వ్యవహరించడం, ఢిల్లీ విమానాశ్రయం అధికారులు సహకరించడంతో విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది.
పైలట్ అప్రమత్తతతో స్పందించిన ఏటీసీ సిబ్బంది
రన్‌వేను కేటాయించి, ఎమర్జెన్సీ ప్రకటన
అగ్నిమాపక శకటాలు, అంబులెన్స్‌లతో అలర్ట్
ప్రయారిటీ ల్యాండింగ్‌తో అందరూ సురక్షితం
విశాఖపట్నం, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. పైలట్ చాకచక్యంగా వ్యవహరించడం, ఢిల్లీ విమానాశ్రయం అధికారులు సహకరించడంతో విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. అందులో ప్రయాణిస్తున్న 161 మంది క్షేమంగా బయటపడ్డారు. విశాఖపట్నం నుంచి ఇండిగో బోయింగ్ 739 (6ఈ-579) విమానం శనివారం ఉదయం 8.50 గంటలకు 161 మంది ప్రయాణికులతో ఢిల్లీకి బయలుదేరింది. సుమారు 10.39 గంటలకు ఒక ఇంజన్‌లో సాంకేతిక లోపాన్ని పైలట్ గుర్తించారు. వెంటనే విషయాన్ని ఢిల్లీ విమానాశ్రయం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులకు తెలియజేసి, ప్రయారిటీ ల్యాండింగ్‌కు అనుమతి కోరారు. స్పందించిన ఏటీసీ సిబ్బంది 28వ నంబర్ రన్‌వేను కేటాయించి, ఎమర్జెన్సీ ప్రకటించారు. అగ్నిమాపక శకటాలు, అంబులెన్స్‌లు సిద్ధంచేశారు. పైలట్ ప్రయారిటీ ల్యాండింగ్ విషయాన్ని ప్రయాణికులకు తెలియజేయడంతో, ఒక్కసారిగా వారంతా ఆందోళనకు గురయ్యారు. అయితే విమానం 10.59 గంటలకు సురక్షితంగా ల్యాండింగ్ కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.