Share News

ఫైటర్‌ జెట్‌.. మేడిన్‌ ఆంధ్రా..!

ABN , Publish Date - May 14 , 2026 | 05:43 AM

భవిష్యత్తులో భారత వైమానిక పోరాటానికి వెన్నెముకగా నిలిచే అధునాతన యుద్ధ విమానాల ఉత్పత్తి కేంద్రంగా శ్రీసత్యసాయి జిల్లా ఖ్యాతి గడించనుంది.

ఫైటర్‌ జెట్‌.. మేడిన్‌ ఆంధ్రా..!

  • శ్రీసత్యసాయి జిల్లాలో అతిపెద్ద ఏరోస్పేస్‌ సెంటర్‌

  • ఏఎంసీఏ ఉత్పత్తి కేంద్రానికి రేపు పుట్టపర్తిలో శంకుస్థాపన

  • హాజరుకానున్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌, చంద్రబాబు

పుట్టపర్తి, మే 13(ఆంధ్రజ్యోతి): భవిష్యత్తులో భారత వైమానిక పోరాటానికి వెన్నెముకగా నిలిచే అధునాతన యుద్ధ విమానాల ఉత్పత్తి కేంద్రంగా శ్రీసత్యసాయి జిల్లా ఖ్యాతి గడించనుంది. తొలిదశలో రూ.15 వేల కోట్లు పెట్టుబడితో పుట్టపర్తిలో అత్యాధునిక ఐదో తరం అడ్వాన్స్‌డ్‌ మీడియం కంబాట్‌ ఎయిర్‌క్రాఫ్ట్స్‌ (ఏఎంసీఏ) తయారీ కేంద్రం ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. డీఆర్‌డీవో ఆధ్వర్యంలో ఏరోనాటికల్‌ డెవల్‌పమెంట్‌ ఏజెన్సీ (ఏడీఏ) చేపడుతున్న ఈ భారీ ప్రాజెక్టుకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం శంకుస్థాపన చేయనున్నారు. దీనికోసం అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. పుట్టపర్తిలోని సత్యసాయి విమానాశ్రయం రన్‌ వేకి అనుసంఽధానంగా బ్రహ్మణపల్లికి వెళ్లే రహదారి నుంచి పుట్టపర్తి-కోడూరు జాతీయ రహదారి మీదుగా బీడుపలి వరకూ ఈ పరిశ్రమ కోసం భూములు కేటాయించారు. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలైన ఏరోనాటికల్‌ డెవల్‌పమెంట్‌ ఏజెన్సీ (ఏడీఏ), డీఆర్‌డీవో ఈ పరిశ్రమ ఏర్పాటు చేస్తున్నాయి. ఇక్కడ స్వదేశీయంగా అభివృద్ధి చేసిన ఐదోతరం అడ్వాన్స్‌డ్‌ మీడియం కాంబాట్‌ కంబాట్‌ ఎయిర్‌క్రా్‌ఫ్టలను ఉత్పత్తి చేస్తారు. భారత వైమానిక, నౌకాదళాం కోసం వీటిని తయారు చేస్తున్నారు. యుద్ధ విమానాల అసెంబ్లింగ్‌, ఆన్‌గ్రౌండ్‌ టెస్టింట్‌ను ఇక్కడే నిర్వహిస్తారు. 2029 నాటికి ప్రయోగ నమూనాలను అందుబాటులోకి తీసుకురావాలని రక్షణ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది.

Updated Date - May 14 , 2026 | 05:43 AM