Share News

కువైత్‌లో భారతీయులదే హవా..!

ABN , Publish Date - Jan 30 , 2026 | 04:44 AM

మెరుగైన ఉపాధి అవకాశాలు, అధిక వేతనాలు, ఉత్తమ జీవన ప్రమాణాల కోసం ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు చెందినవారు కువైత్‌కు వెళ్తుంటారు. అయితే కువైత్‌లో పనిచేస్తున్న విదేశీయులందరిలోనూ భారతీయులే ఎక్కువ మంది ఉన్నారు.

కువైత్‌లో భారతీయులదే హవా..!

  • దేశ జనాభాలో 20 శాతం మనోళ్లే.. వారిలోనూ సీమ వాసులు అధికం

(ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి)

మెరుగైన ఉపాధి అవకాశాలు, అధిక వేతనాలు, ఉత్తమ జీవన ప్రమాణాల కోసం ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు చెందినవారు కువైత్‌కు వెళ్తుంటారు. అయితే కువైత్‌లో పనిచేస్తున్న విదేశీయులందరిలోనూ భారతీయులే ఎక్కువ మంది ఉన్నారు. తాజా లెక్కల ప్రకారం 2025లో కువైత్‌లో 10.59 లక్షల మంది భారతీయులు ఉన్నారు. అంటే దేశ జనాభాలో 20శాతం ఉన్నట్లు తాజా అధికారిక జనాభా గణాంకాలు వెల్లడించాయి. భారతీయుల్లో అత్యధికులు ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ ప్రాంత వాసులే ఉన్నారు. వారిలోనూ ఉమ్మడి చిత్తూరు, కడప జిల్లాల నుంచి వచ్చిన వారు ఎక్కువగా ఉన్నారు. కాగా.. కువైత్‌లో స్థానికుల జనాభా బాగా తగ్గినట్టు అధికారిక గణాంకాల్లో స్పష్టమైంది. గతంలో కువైతీల జనాభా 16.80 లక్షలుగా ఉండేది. తాజాగా అది 15.63 లక్షలకు పడిపోయింది. ప్రస్తుత కువైత్‌ జనాభాలో స్థానిక పౌరులు 29.85 శాతమేనని ఈ గణాంకాలు వెల్లడించాయి. కాగా, కువైత్‌లోని భారతీయుల్లో అత్యధికంగా 8.23 లక్షల మంది స్థానికుల ఇళ్లల్లో పని చేసుకుంటూ ఉపాధి పొందుతున్నారని ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయి.

Updated Date - Jan 30 , 2026 | 04:44 AM