త్వరలో కార్గో విమానాశ్రయాలు
ABN , Publish Date - Jun 06 , 2026 | 05:35 AM
దేశంలో త్వరలో కార్గో విమానాశ్రయాలు ఏర్పాటు చేస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖా మంత్రి కే రామ్మోహన్‌నాయుడు తెలిపారు.
వన్ ఎయిర్‌పోర్టు.. వన్ ప్రొడక్ట్ విధానం
2047 నాటికి దేశంలో 350 విమానాశ్రయాలు
పౌర విమానయాన శాఖా మంత్రి రామ్మోహన్‌నాయుడు
విశాఖపట్నం, జూన్ 5(ఆంధ్రజ్యోతి): దేశంలో త్వరలో కార్గో విమానాశ్రయాలు ఏర్పాటు చేస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖా మంత్రి కే రామ్మోహన్‌నాయుడు తెలిపారు. విమానాల ద్వారా సరకు రవాణాకు అధిక ప్రాధాన్యమిస్తామని చెప్పారు. విశాఖపట్నంలో శుక్రవారం ప్రారంభమైన సముద్ర ఆహార ఉత్పత్తులు, ఎగుమతులపై రెండు రోజుల జాతీయ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కొత్తగా ఎయిర్ ఫ్రైట్ స్టేషన్లకు ఒక పాలసీని రూపొందిస్తున్నామని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ ‘ఒక జిల్లా.. ఒక ఉత్పత్తి’ నినాదంలాగే తాము కూడా ‘ఒక విమానాశ్రయం.. ఒక ఉత్పత్తి’ (వన్ ఎయిర్‌పోర్ట్.. వన్ ప్రొడక్ట్) విధానంతో ఆ ప్రాంతంలో ప్రత్యేకంగా లభించే వాటిని ఎగుమతి చేయడానికి ప్రోత్సహిస్తామన్నారు. పొటాటో చిప్స్ అయినా సెమీ కండక్టర్ చిప్స్ అయినా సరైన సమయంలో సరైన చోటుకు చేర్చడానికి విమాన రంగం ఉపయోగపడుతుందన్నారు. సముద్ర ఉత్పత్తుల ఎగుమతులకు విమానయాన శాఖ పూర్తి సహకారం అందిస్తుందన్నారు. మత్స్య సంపద ప్రాధాన్యాన్ని ముందే గుర్తించిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు భోగాపురంలో కొత్త విమానాశ్రయాన్ని కూడా ‘ఎగురుతున్న చేప’ ఆకారంలో నిర్మిస్తున్నారని వెల్లడించారు. దేశంలో 155 విమానాశ్రయాలున్నాయని.. 2047 నాటికి వాటి సంఖ్య 350కి పెంచుతామని చెప్పారు. పీఎం గతిశక్తి పథకం కింద భోగాపురం, నవీ ముంబై, నోయిడాలతో పాటు మరిన్ని విమానాశ్రయాల్లో కార్గో టెర్మినళ్లు నిర్మిస్తున్నామని చెప్పారు.
సీ ఫుడ్ ఎగుమతులు పెంపునకు రోడ్ మ్యాప్: కేంద్ర మంత్రులు
భారత్ నుంచి సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతులు పెంచడానికి రోడ్ మ్యాప్ తయారు చేస్తున్నామని కేంద్ర మంత్రులు స్పష్టం చేశారు. వాటాదారుల సలహాలు, సూచనలు కూడా తీసుకొని పాలసీలు రూపొందిస్తామని తెలిపారు. విశాఖలో మొదలైన రెండు రోజుల జాతీయ సదస్సుకు కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, రాజీవ్ రంజన్ సింగ్, చిరాగ్ పాశ్వాన్, కే రామ్మోహన్‌నాయుడు హాజరయ్యారు. వారి శాఖల ద్వారా చేపడుతున్న అభివృద్ధి పనులను వివరించారు. ఆక్వా ఎగుమతులు పెంచాలంటే నాలుగు శాఖల సహకారం అవసరమని, అందుకే ఈ సదస్సుకు తామంతా హాజరయ్యామని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఆక్వా రైతులు, ఎగుమతిదారులు, వ్యాపారులు అందరినీ పిలిచి.. వారి అభిప్రాయాలు తెలుసుకోవడానికి ఈ సదస్సు నిర్వహిస్తున్నామని చెప్పారు. సదస్సు అనంతరం విలేకరుల సమావేశంలో గోయల్ మాట్లాడుతూ... భారత్, అమెరికా మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందానికి సంబంధించి ఇంకా పెండింగ్‌లో ఉన్న అంశాలన్నింటినీ పరిష్కరించే దిశగా రెండు దేశాలు అడుగులు వేస్తున్నాయని చెప్పారు. ఈ ఒప్పందంలోని అత్యంత కీలకమైన మొదటి దశను వచ్చే నెల మధ్య నుంచి అమలుచేసే అవకాశం ఉందన్నారు. కాగా, ఆంధ్రప్రదేశ్ సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల్లో అగ్రగామిగా ఉందని, అందుకే సదస్సు విశాఖలో ఏర్పాటు చేశామని కేంద్ర మత్స్య శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ వెల్లడించారు. అంతర్గత రాష్ట్రాల నుంచి చేపల ఎగుమతులు పెంచడానికి విధానాలు అభివృద్ధి చేస్తున్నామన్నారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ భారత్ గత ఆర్థిక సంవత్సరం రూ.73 వేల కోట్ల విలువైన సముద్ర ఉత్పత్తులు ఎగుమతి చేసిందన్నారు. కాకినాడలో పాత ఫిషింగ్ హార్బర్‌ను స్మార్ట్ హార్బర్‌గా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. అది పూర్తయితే అక్కడ 423 బోట్లు ఆపరేట్ చేసుకోవచ్చని, దాని ద్వారా 12,345 మందికి ఉపాధి దొరుకుతుందని అన్నారు. ఏటా 74,448 టన్నుల మత్స్య ఉత్పత్తులు వస్తాయన్నారు. కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి చిరాగ్ పాశ్వాన్ మాట్లాడుతూ.. వాటాదారులు ‘వాల్యూమ్ నుంచి వేల్యూకి, ప్రొడ్యూస్ నుంచి ప్రొడక్ట్’కి మారాలన్నారు. ప్రజలు రెడీ టు ఈట్, రెడీ టు కుక్ వంటి అంశాలకే ఎక్కువ మొగ్గుచూపుతున్నారని, తదనుగుణంగా విధానాలు మార్చుకోవాలని సూచించారు. ఈ సదస్సుకు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యాపారులు, రైతులు, ఎగుమతిదారులు వారి సమస్యలను వివరించారు.