వచ్చే పదేళ్లలో 100 విమానాశ్రయాలు నిర్మిస్తాం
ABN , Publish Date - Jul 17 , 2026 | 04:29 AM
దేశవ్యాప్తంగా రాబోయే పదేళ్లలో 100 విమానాశ్రయాలు, 200 హెలిపోర్టులు నిర్మించనున్నట్లు కేంద్ర పౌర విమానయాన మంత్రి కింజారపు రామ్మోహన్‌నాయుడు తెలిపారు.
నెలలో భోగాపురం ఎయిర్‌పోర్టు కార్యకలాపాలు: రామ్మోహన్
న్యూఢిల్లీ, జూలై 16(ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా రాబోయే పదేళ్లలో 100 విమానాశ్రయాలు, 200 హెలిపోర్టులు నిర్మించనున్నట్లు కేంద్ర పౌర విమానయాన మంత్రి కింజారపు రామ్మోహన్‌నాయుడు తెలిపారు. ఈ లక్ష్యాన్ని సరైన సమయంలో పూర్తి చేయడానికి రాష్ట్రాల సహకారం అవసరమన్నారు. గురువారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఉడాన్ 2.0పై నిర్వహించిన వర్క్‌షా్‌పనకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఉడాన్ పథకాన్ని మరో పదేళ్ల పాటు పొడిగించనున్నామని, దీనికోసం కేంద్రం రూ.29 వేల కోట్లు కేటాయించిందని తెలిపారు. కనెక్టివిటీని మెరుగుపరచడంలో భాగంగా ఉడాన్ 2.0లో కొన్ని మార్పులు చేశామని చెప్పారు. కాగా, భోగాపురం విమానాశ్రయ నిర్మాణం పూర్తయిందని, ఇటీవలే డీజీసీఏ నుంచి లైసెన్స్ లభించిందని కేంద్ర మంత్రి తెలిపారు. త్వరలోనే ప్రారంభోత్సవ తేదీ ఖరారవుతుందన్నారు. మరో నెల రోజుల్లో భోగాపురం విమానాశ్రయ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని రామ్మోహన్ స్పష్టం చేశారు.