Share News

పరస్పర సహకారంతోనే సముద్రాల రక్షణ!

ABN , Publish Date - Feb 21 , 2026 | 05:54 AM

తీర ప్రాంత దేశాలు అవసరమైన సమయాల్లో ఒకరికొకరు సహాయ సహకారాలు ఇచ్చిపుచ్చుకున్నపుడే సముద్రాలు సురక్షితంగా ఉంటాయని భారత నౌకాదళం చీఫ్‌ అడ్మిరల్‌ దినేశ్‌ త్రిపాఠి అన్నారు.

పరస్పర సహకారంతోనే సముద్రాల రక్షణ!

  • ఏ దేశానికి సాయం కావాలన్నా భారత్‌ సదా సిద్ధం

  • నౌకాదళం చీఫ్‌ అడ్మిరల్‌ దినేశ్‌ త్రిపాఠి వెల్లడి

  • విశాఖలో ఇండియన్‌ ఓషన్‌ నేవల్‌ సింపోజియం నిర్వహణ

  • 33 దేశాలనౌకాదళ ప్రతినిధులు హాజరు

  • థాయ్‌ నేవీ నుంచి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన భారత్‌

  • 16 సంవత్సరాల తర్వాత తిరిగి అధ్యక్ష స్థానంలోకి

విశాఖపట్నం, ఫిబ్రవరి 20(ఆంధ్రజ్యోతి): తీర ప్రాంత దేశాలు అవసరమైన సమయాల్లో ఒకరికొకరు సహాయ సహకారాలు ఇచ్చిపుచ్చుకున్నపుడే సముద్రాలు సురక్షితంగా ఉంటాయని భారత నౌకాదళం చీఫ్‌ అడ్మిరల్‌ దినేశ్‌ త్రిపాఠి అన్నారు. ఇంటర్నేషనల్‌ ఫ్లీట్‌ రివ్యూలో భాగంగా హిందూ మహా సముద్రాన్ని ఆనుకొని ఉన్న దేశాల నౌకాదళ ప్రతినిధులతో ‘ఇండియన్‌ ఓషన్‌ నేవల్‌ సింపోజియం(ఐఓఎన్‌ఎస్‌)’ తొమ్మిదో సదస్సును విశాఖలోని నోవాటెల్‌లో శుక్రవారం నిర్వహించారు. ఈ సదస్సులో నౌకాదళ చీఫ్‌ అడ్మిరల్‌ దినేశ్‌ త్రిపాఠి మాట్లాడుతూ ఐఓఎన్‌ఎ్‌సకు ఇప్పటివరకూ రాయల్‌ థాయ్‌ నేవీ అధ్యక్షత వహిస్తుండగా, ఇప్పుడు ఆ బాధ్యతను భారత నౌకాదళం స్వీకరించిందన్నారు. పరిశీలక దేశంగా ఫిలిప్పీన్స్‌ వ్యవహరించనుందని తెలిపారు. సహాయ కార్యక్రమాల బృందంలో కొత్తగా ఒమన్‌ చేరిందన్నారు. 2008 నుంచి 2010 వరకు భారత నౌకాదళం నాయకత్వం వహించిందని, తిరిగి పదహారేళ్ల తర్వాత అధ్యక్ష పదవి చేపట్టిందని తెలిపారు. ఇటీవల హిందూ మహాసముద్ర ప్రాంతంలో ప్రకృతి వైపరీత్యాలు, మానవ సంక్షోభాలు ఎక్కువగా సంభవిస్తున్నాయని, అలాంటి సందర్భాలలో పొరుగు దేశాలు తగిన సాయం చేయాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ విషయంలో భారతదేశం అన్ని రకాలుగా ఉన్నతస్థానంలో ఉందన్నారు. నేవీ నౌకలు పెద్ద మొత్తంలో ఆహారం, నీరు, మందులు, ఇంజనీరింగ్‌ పరికరాలు, వైద్య బృందాలను తీసుకెళ్లగలుగుతాయని, వాటికి హెలికాప్టర్లు కూడా అనుసంధానమై ఉన్నాయని తెలిపారు. గాలింపు, రక్షణ కార్యక్రమాలు కూడా చేపట్టగలుగుతామని, ఏ దేశానికి ఎలాంటి సాయం కావాలన్నా చేయడానికి భారత నౌకాదళం సదా సిద్ధంగా ఉంటుందన్నారు. ఇలాంటి వాటి కోసమే సాగర్‌, మిషన్‌ సాగర్‌-2లను 2020లోనే ప్రారంభించామని చెప్పారు.


కొవిడ్‌ సమయంలో భారత నౌకలు కేసరి, ఐరావత్‌ ఆహారం, మందులు, ఆక్సిజన్‌ తదితరాలను మాల్డీవులు, మారిషస్‌, సీషెల్స్‌, మడగాస్కర్‌, సూడాన్‌, మొజాంబిక్‌లకు అందించాయని తెలిపారు. ఆపరేషన్‌ సముద్ర సేతు కూడా నేవీ సామర్థ్యానికి ప్రతీకగా నిలుస్తోందన్నారు. 2024లో కెన్యాలో వరదలు వచ్చినప్పుడు ఐఎన్‌ఎస్‌ సుమేధ భారీగా సహాయ కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు. మయన్మార్‌ భూకంపం సమయం(2025)లో ఆపరేషన్‌ బ్రహ్మ, శ్రీలంక తుఫాన్‌ సమయంలో ఆపరేషన్‌ సాగర్‌ బంధు భారతదేశం నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తాయన్నారు. ఇవన్నీ ఒక్కరే చేస్తే సరిపోదని, అన్ని దేశాలూ వీలైనంతగా ఒకరికొకరు సహకరించుకోవాలని, అదే ఈ సదస్సు ఉద్దేశమని వివరించారు. సదస్సుకు 33 దేశాల నౌకాదళ ప్రతినిధులు హాజరయ్యారు. అప్‌గ్రేడ్‌ చేసిన ఐఓఎన్‌ఎస్‌ వెబ్‌సైట్‌ను ఈ సందర్భంగా ఆవిష్కరించారు.

Updated Date - Feb 21 , 2026 | 05:57 AM