ఆ సిద్ధాంతాలు మనకొద్దు
ABN , Publish Date - Jan 24 , 2026 | 06:10 AM
ప్రపంచంలో కొన్ని దేశాలు క్యాపిటలిజం వైపు, మరికొన్ని కమ్యూనిజం వైపు నడుస్తూ గొడవపడుతున్నాయి. ప్రపంచానికి తమ సిద్ధాంతాలే అవసరమని వారిద్దరూ పేర్కొంటున్నారు.
దేశానికి క్యాపిటలిజం, కమ్యూనిజం పనికిరావు
రక్షణ రంగంలో 4వ స్థానంలో భారత్: సతీశ్‌రెడ్డి
విజయవాడ, జనవరి 23(ఆంధ్రజ్యోతి): ‘ప్రపంచంలో కొన్ని దేశాలు క్యాపిటలిజం వైపు, మరికొన్ని కమ్యూనిజం వైపు నడుస్తూ గొడవపడుతున్నాయి. ప్రపంచానికి తమ సిద్ధాంతాలే అవసరమని వారిద్దరూ పేర్కొంటున్నారు. కమ్యూనిజం, క్యాపిటలిజం భావజాలాలు భారతదేశ ఆలోచనలు, సాంస్కృతిక, సాంప్రదాయాలకు ఏ మాత్రం సంబంధం లేనివి. ఈ విషయం ఏకాత్మతా మానవతా వాదం వచ్చాక తెలుసుకున్నాం’ అని మంత్రి జీ కిషన్‌రెడ్డి అన్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో శుక్రవారం జనసంఘ్ 12వ మహాసభ ఏకాత్మ మానవ దర్శన పునఃస్మరణలో ఆయన పాల్గొని మాట్లాడారు. ‘1965లో మొదటి సమావేశం జరిగిన ఈ ప్రాంతం పవిత్రమైనది. 60 ఏళ్ల క్రితం జనవరి 23న జరిగిన ఏకాత్మతా మనవతా వాద సిద్ధాంత ఆచరణ కోసం తీసుకువచ్చిన ఈ ప్రాంతంలో ఇప్పుడు అందరూ కలవడం పూర్వజన్మ సుకృతం. 12 ఏళ్లుగా ప్రధాని మోదీ ఏకాత్మతా మానవతా వాదాన్ని అనుసరిస్తూ దేశ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తున్నారు. క్యాపిటలిజం, కమ్యూనిజంలకు ప్రత్యామ్నాయంగా భారత ఆలోచనా విధానం, సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా దీన్ దయాళ్ ఏకాత్మతా మానవతావాదం అందించారు’ అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
రక్షణరంగ నిపుణుడు, ప్రభుత్వ సలహాదారుడు సతీశ్ రెడ్డి మాట్లాడుతూ, ‘భారతీయ ఏకాత్మతా మానవ దర్శనం ప్రవచించిన తర్వాత దేశంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ మార్పుల కారణంగా వికసిత్ భారత్ లక్ష్యం వైపు పరుగులు పెడుతున్నాం. ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయాలవల్ల క్షిపణులు, యుద్ధ ట్యాంకులు తయారుచేసే స్థాయికి చేరాం’ అని తెలిపారు. ఏపీ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ మాట్లాడుతూ, ప్రాంగణానికి శ్రీకృష్ణదేవరాయలు నగర్‌గా పేర్కొనడం వెనుక ఉన్న కారణాన్ని వివరించారు. అంతకుముందు పండిట్ దీనదయాళ్ విగ్రహాన్ని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆవిష్కరించారు. కార్యక్రమంలో కేంద్ర సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, బీజేపీ జాతీయ సంఘటనా ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతో్‌షజీ, మంత్రి సత్యకుమార్, ఎంపీలు దగ్గుబాటి పురందేశ్వరి, సీఎం రమేశ్, పాకా వెంకట సత్యనారాయణ, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యేలు విష్ణుకుమారరాజు, వై.సుజనా చౌదరి, ఆదినారాయణరెడ్డి, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.