మండుతున్న భారతం
ABN , Publish Date - Apr 23 , 2026 | 03:17 AM
ఎండ తీవ్రతకు దేశంలో అనేక ప్రాంతాలు మండిపోతున్నాయి. రోజుల తరబడి కొనసాగుతున్న వడగాడ్పులు, నిప్పుల కొలిమిలా మారిన వాతావరణంతో ప్రజలు ఠారెత్తుతున్నారు.
రోజుల తరబడి వేడి వాతావరణం
కడపలో 44.4 డిగ్రీలు నమోదు
విశాఖపట్నం, విజయనగరం, ఏప్రిల్ 22(ఆంధ్రజ్యోతి): ఎండ తీవ్రతకు దేశంలో అనేక ప్రాంతాలు మండిపోతున్నాయి. రోజుల తరబడి కొనసాగుతున్న వడగాడ్పులు, నిప్పుల కొలిమిలా మారిన వాతావరణంతో ప్రజలు ఠారెత్తుతున్నారు. వాయవ్యభారతం నుంచి వీస్తున్న పొడిగాలులు ఎక్కువగా ప్రభావం చూపుతున్నాయి. అనేకచోట్ల 40, అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాధారణం కంటే మూడు నుంచి ఆరు డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజల రోజువారీ జీవనంపై ప్రభావం పడుతోంది. బంగాళాఖాతం, అరేబియా సముద్రం నుంచి తేమ గాలులు భూ ఉపరితలంపైకి వీయడం లేదు. వెస్ట్రన్ డిస్ట్రబెన్స్‌లు మధ్యదరా సముద్రం నుంచి మధ్య ఆసియా దేశాల మీదుగా ఉత్తర భారతంపైకి, అటు నుంచి టిబెట్ మీదుగా వీస్తుంటాయి. అయితే గడచిన కొన్ని రోజులుగా వెస్ట్రన్ డిస్ట్రబెన్స్‌లు ప్రభావం చూపకపోవడంతో ఉత్తర, మధ్యభారతంలో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. దీంతో ఉత్తర, మధ్య, తూర్పుభారతంలో ఎండలు కొనసాగుతున్నాయి. ఆ ప్రభావంతో దక్షిణాదిలోనూ వడగాడ్పులు కొనసాగుతున్నాయని వాతావరణ నిపుణుడొకరు తెలిపారు. గడచిన వారం, పది రోజుల నుంచి ఉత్తరార్ధ గోళంలోని సముద్ర ఉపరితలం వేగంగా వేడెక్కుతోందన్నారు. భూమధ్యరేఖకు ఆనుకుని పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల జలాలు వేగంగా వేడెక్కడం అసాధారణమేనని విశ్లేషించారు. దీంతో భూమధ్యరేఖకు ఆనుకుని గాలులు దాదాపు నిలిచిపోయాయని, అందుకే భారత ఉపఖండంపైకి చల్లని గాలులు రావడం లేదన్నారు. దేశంపైకి సముద్రాల నుంచి తేమగాలుల రాక తగ్గినట్టు తెలిపారు. సాధారణంగా బంగాళాఖాతం, అరేబియా సముద్రం నుంచి వీచే తేమగాలులతో తీరప్రాంతాలు చల్లగా ఉంటాయని, కొండ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుంటాయని, అయితే ఈ ఏడాది అటువంటి వాతావరణం లేకపోవడంతో సుదీర్ఘంగా ఎండలు కొనసాగుతున్నాయన్నారు.
వచ్చే 5 రోజులు ఢిల్లీ భగభగ..
దేశ రాజధాని ఢిల్లీలో వచ్చే ఐదు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఢిల్లీలో వడగాడ్పులు వీస్తాయంటూ బుధవారం ఎల్లో అలర్ట్‌ను ఐఎండీ జారీ చేసింది.
వడగాడ్పులతో ఉక్కిరిబిక్కిరి
202 మండలాల్లో 41 డిగ్రీలపైనే
వేసవి ప్రభావం తీవ్రమైంది. ఓ వైపు అధిక ఉష్ణోగ్రతలు, మరో వైపు వడగాడ్పులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా 202 మండలాల్లో 41 డిగ్రీలపైన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా కడపలో 44.4 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. గురువారం రాష్ట్రవ్యాప్తంగా 101 మండలాల్లో వడగాడ్పులు వీస్తాయని, శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లోని 95 మండలాల్తో తీవ్ర వడగాడ్పులు ఉంటాయని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.