Share News

మండిన భారతం

ABN , Publish Date - Apr 26 , 2026 | 04:42 AM

భానుడి భగభగలతో దేశం మండిపోయింది. ఉత్తర, మధ్య భారతాలు తీవ్రమైన వడగాడ్పులతో ఉడికిపోయాయి. శనివారం ఉత్తరప్రదేశ్‌లోని బాందా నగరంలో అత్యధికంగా 47.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్టు..

మండిన భారతం

  • యూపీలోని బాందాలో 47.4 డిగ్రీల ఉష్ణోగ్రత

  • మన రాష్ట్రంలోని నగరడోనలో 44.8 డిగ్రీలు

  • సీమలో 4 రోజులు 42-44 డిగ్రీలు: ఐఎండీ

అమరావతి, విశాఖపట్నం, ఏప్రిల్‌ 25(ఆంధ్రజ్యోతి): భానుడి భగభగలతో దేశం మండిపోయింది. ఉత్తర, మధ్య భారతాలు తీవ్రమైన వడగాడ్పులతో ఉడికిపోయాయి. శనివారం ఉత్తరప్రదేశ్‌లోని బాందా నగరంలో అత్యధికంగా 47.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్టు భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. ఏప్రిల్‌ నెలలో 47 డిగ్రీలు దాటి నమోదవడం చాలా అరుదని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. కాగా, అలహాబాద్‌లో 46 డిగ్రీలు, మరో ఎనిమిదిచోట్ల 45 డిగ్రీలు, అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మన రాష్ట్రంలోనూ శనివారం 172 మండలాల్లో 41 డిగ్రీలు, అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కర్నూలు జిల్లా నగరడోనలో అత్యధికంగా 44.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. కడపలో 44.2, అనంతపురం జిల్లా రాయదుర్గం, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలలో 44, మార్కాపురం జిల్లా కంభం, శ్రీసత్యసాయి జిల్లా తలుపలలో 43, అన్నమయ్య జిల్లా నూలివీడు, పల్నాడు జిల్లా గురజాలలో 42.7, నెల్లూరు జిల్లా కొమ్మిపాడులో 42.6, తిరుపతి జిల్లా బేస్తపల్లిలో 42.5, అనకాపల్లి జిల్లా దేవరపల్లె, పోలవరం జిల్లా ఎర్రంపేటలో 42.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే వాతావరణ అనిశ్చితితో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో ఎండ తీవ్రత, వడగాడ్పులు కొనసాగుతాయని ఐఎండీ తెలిపింది. రాయలసీమలో మరో నాలుగు రోజులు ఉష్ణోగ్రతలు 42 నుంచి 44 డిగ్రీల మధ్య నమోదవుతాయని, కోస్తాలో అనేకచోట్ల వేడి వాతావరణం కొనసాగుతుందని పేర్కొంది.


ఈనెల 28 నుంచి రెండు, మూడు రోజులపాటు కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడ పిడుగులు, ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని వివరించింది. మహారాష్ట్ర పరిసరాల్లో కొనసాగుతున్న అధికపీడనం ప్రభావంతో మధ్య, పశ్చిమ భారతంలో నెలకొన్న వేడిగాలులు.. తెలంగాణ, కోస్తా, రాయలసీమపైకి వీస్తున్నాయని వాతావరణ నిపుణుడొకరు తెలిపారు. భూ ఉపరితలంలో తేమ తగ్గడం, సముద్రం నుంచి గాలులు తక్కువగా వీస్తుండడంతో వేడి వాతావరణం కొనసాగుతోందన్నారు. కాగా, ఆదివారం విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం జిల్లాల్లోని 23 మండలాల్లో వడగాడ్పులు ఉంటాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

Updated Date - Apr 26 , 2026 | 04:42 AM