బుల్లెట్ రైలు వచ్చేస్తోంది!
ABN , Publish Date - Jul 18 , 2026 | 04:55 AM
దేశంలో మొట్టమొదటి బుల్లెట్ రైలు పరుగులు పెట్టడానికి రంగం సిద్ధమవుతోంది. ముంబై- అహ్మదాబాద్ స్పీడ్ రైల్ కారిడార్‌లో భాగంగా తొలిదశను 2027 ఆగస్టులో ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురానున్నారు.
2027 ఆగస్టులో సూరత్- బిలిమోరా మధ్య సర్వీసులు
ముంబై, అహ్మదాబాద్ మధ్య శరవేగంగా సాగుతున్న పనులు
2030 నాటికి జపాన్ ఈ10 సిరీస్ షింకెన్‌సెన్ రైళ్లు భారత్‌కు
ఈలోపు దేశీయంగా తయారైన రైళ్లతోనే తొలి విడత ప్రాజెక్టు
న్యూఢిల్లీ, జూలై 17: దేశంలో మొట్టమొదటి బుల్లెట్ రైలు పరుగులు పెట్టడానికి రంగం సిద్ధమవుతోంది. ముంబై- అహ్మదాబాద్ స్పీడ్ రైల్ కారిడార్‌లో భాగంగా తొలిదశను 2027 ఆగస్టులో ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. దీనికి సంబంధించి భారత్, జపాన్ మధ్య చర్చలు విజయవంతంగా సాగుతున్నాయి. ఇరు దేశాల ఉన్నతాధికారుల మధ్య భేటీ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ ప్రాజెక్టు కోసం జపాన్‌కు చెందిన అత్యాధునిక, అత్యంత వేగవంతమైన ఈ10 షింకన్‌సెన్ రైళ్లను ఉపయోగించనున్నారు. గంటకు గరిష్ఠంగా 320 కి.మీ. వేగంతో ప్రయాణించే సామర్థ్యం కలిగిన ఈ రైళు 2030 నాటికి భారత్‌కు చేరుకోనున్నాయి. వీటి తయారీ ప్రక్రియ జపాన్‌లో ఇంకా కొనసాగుతోంది. మరోవైపు బుల్లెట్ రైలు కారిడార్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సేవలను వీలైనంత తర్వగా ప్రారంభించేందుకు వీలుగా ప్రాజెక్టు ప్రారంభ దశలో దేశీయంగా తయారైన బుల్లెట్ రైళ్లతోనే సర్వీసులు నడపాలని ఇరు దేశాలు నిర్ణయించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ10 రైళ్లు సిద్ధమయ్యే వరకూ వేచి చూడకుండా, ప్రాజెక్టును ప్రారంభించాలనే లక్ష్యానికి అనుగుణంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో అమలులోకి వస్తే ముంబై, అహ్మదాబాద్ మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుందని భావిస్తున్నారు. ఈ రెండు నగరాల మధ్య 508 కిలోమీటర్ల దూరాన్ని ఈ రైళ్లలో కేవలం 2 గంటల 7 నిమిషాల్లోనే చేరుకోవచ్చు.
ఇటీవల కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ, తొలిదశలో గుజరాత్‌లోని సూరత్, బిలిమోరా మధ్య బుల్లెట్ రైలును వచ్చే ఏడాది ప్రారంభించనున్నట్లు తెలిపారు. పనులు పూర్తయ్యే కొద్దీ దశల వారీగా సర్వీసులు అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. కాగా, భారతీయ రైల్వే వ్యవస్థలో ఒక నూతన అధ్యాయాన్ని ఆవిష్కరిస్తూ, దేశంలో మొదటి హైడ్రోజన్ రైలును ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించిన గంటల వ్యవధిలోనే బుల్లెట్ రైలుకు సంబంధించిన తాజా సమాచారం వెలుగులోకి వచ్చింది.
ప్రాజెక్టులో జాప్యానికి భారతే కారణం: జపాన్ మాజీ మంత్రి
ముంబై- అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టులో జాప్యం జరగడానికి భారత్‌కు చెందిన ఓ మంత్రి, అధికారులే కారణమని జపాన్ న్యాయశాఖ మాజీ మంత్రి హిడెకి మకిహరా తీవ్ర ఆరోపణలు చేశారు. షింకన్‌సెన్ ప్రాజెక్టుపై చర్చల సందర్భంగా అధికారులు పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించారని, తమ వాగ్దానాలను నిలబెట్టుకోవడంలో విఫలమయ్యారని మండిపడ్డారు. ఈ ప్రాజెక్టు పనుల్లో పురోగతి లేకపోవడానికి నూరు శాతం భాధ్యత భారత్‌దేనని శుక్రవారం ‘ఎక్స్’లో చేసిన పోస్టులో మకిహరా పేర్కొన్నారు. అయితే మకిహిరా ఆరోపణలను భారత విదేశాంగ శాఖ ఖండించింది. ఈ వ్యాఖ్యలు వాస్తవ విరుద్ధంగా ఉన్నాయని, అవి కేవలం వ్యక్తిగత అభిప్రాయాలేనని కొట్టిపారేసింది. భారత్, జపాన్ మధ్చ చర్చలు సజావుగా సాగుతున్నాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.