రేపే అండమాన్‌కు ‘నైరుతి’
ABN , Publish Date - May 15 , 2026 | 04:35 AM
నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం గురువారం ఈశాన్యంగా పయనించి కోస్తాంధ్ర, తమిళనాడు తీరాలకు దూరంగా వెళ్లింది.
ఈ ఏడాది ముందుగానే కేరళను తాకనున్న రుతుపవనాలు?
కోస్తాంధ్రకు దూరంగా తీవ్ర అల్పపీడనం
పెరగనున్న ఎండ తీవ్రత, ఉష్ణోగ్రతలు
విశాఖపట్నం, అమరావతి, మే 14(ఆంధ్రజ్యోతి): నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం గురువారం ఈశాన్యంగా పయనించి కోస్తాంధ్ర, తమిళనాడు తీరాలకు దూరంగా వెళ్లింది. ఇది వచ్చే 36 గంటల్లో ఈశాన్య, మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించే క్రమంలో వాయుగుండంగా మారి...ఆ తర్వాత మయన్మార్ తీరం దిశగా వెళ్లనుంది. తీవ్ర అల్పపీడనం ప్రభావంతో భూమధ్యరేఖ మీదుగా బలమైన తేమగాలులు హిందూ మహాసముద్రం దిశగా వీస్తున్నాయి. ఈ నేపథ్యంలో నైరుతి రుతుపవనాలు శనివారం నాటికి దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం, అండమాన్, నికోబార్ దీవుల్లోకి ప్రవేశించనున్నాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. సాధారణంగా మే 20 కల్లా అండమాన్ నికోబార్ దీవులు, పరిసరాల్లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాలి. బంగాళాఖాతంలో అనుకూల పరిస్థితులు నెలకొనడంతో ఈనెల 15 తేదీకే దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం, అండమాన్, నికోబార్ దీవుల్లోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయని ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్ తెలిపింది. వచ్చే రెండు, మూడు రోజుల్లో కేరళ, తమిళనాడు, కర్ణాటకల్లో రుతుపవన ముందస్తు వర్షాలు కురవనున్నాయని వాతావరణ నిపుణులు వెల్లడించారు. ఈ ఏడాది కేరళను ముందుగానే నైరుతి రుతుపవనాలు తాకే అవకాశం ఉందని అంచనా వేశారు. కాగా, రాష్ట్రంలో ఎక్కువచోట్ల గురువారం ఎండ తీవ్రత, ఉక్కపోత కొనసాగాయి. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు, మూడు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. అత్యధికంగా నంద్యాల జిల్లా సంజామలలో 43.3 డిగ్రీలు, కర్నూలు జిల్లా కౌతాళంలో 42.9, అనంతపురం జిల్లా తెరన్నపల్లిలో 42.8, చిత్తూరు జిల్లా రాయలపేట, కడప జిల్లా జమ్మలమడుగులో 42.2, ప్రకాశం జిల్లా కొప్పెరపాడులో 42 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 17 జిల్లాల్లోని 126 మండలాల్లో 40 డిగ్రీలపైన ఉష్ణోగ్రత నమోదైంది. అక్కడక్కడ వర్షాలు పడ్డాయి.
రానున్న రెండు, మూడు రోజుల్లో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని, ఎక్కువ ప్రాంతాల్లో ఎండలు పెరిగి, వడగాడ్పులు వీస్తాయని వాతావరణ నిపుణుడొకరు తెలిపారు. శుక్రవారం 43-44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అల్లూరి, పోలవరం, కోనసీమ, తూర్పుగోదావరి, ఎన్టీఆర్, అనంతపురం జిల్లాల్లోని 20 మండలాల్లో వడగాడ్పుల ప్రభావం ఉంటుందని పేర్కొంది. అల్లూరి, పోలవరం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.