ఏఐ సాయంతో వర్షసూచన!
ABN , Publish Date - May 15 , 2026 | 05:03 AM
కృత్రిమ మేధ(ఏఐ) సహాయంతో రైతులకు మరిన్ని సేవలు అందించేందుకు భారత వాతావరణ శాఖ(ఐఎండీ) రెండు టూల్స్‌ను అభివృద్ధి చేసింది.
యూపీలో ప్రయోగాత్మకంగా అమలు.. ప్రతి జిల్లాలో రుతుపవనాల ప్రవేశ సమాచారం
రెండు టూల్స్‌ను అభివృద్ధి చేసిన ఐఎండీ
విశాఖపట్నం, మే 14 (ఆంధ్రజ్యోతి): కృత్రిమ మేధ(ఏఐ) సహాయంతో రైతులకు మరిన్ని సేవలు అందించేందుకు భారత వాతావరణ శాఖ(ఐఎండీ) రెండు టూల్స్‌ను అభివృద్ధి చేసింది. వీటి ద్వారా ప్రతి కిలోమీటరు ప్రాంతంలో వర్షం ఎప్పుడు పడుతుందనేది పది రోజులు ముందుగానే ఏఐ సాయంతో తెలియనుంది. ఐఎండీలోని కీలక విభాగం ‘నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ ఫోర్‌కాస్టింగ్’ ఏఐ సాయంతో ఒక టూల్‌ను అభివృద్ధి చేసింది. దీనిద్వారా ప్రయోగాత్మకంగా మొదట ఉత్తరప్రదేశ్‌లో రైతులకు ఈనెల 12వ తేదీ నుంచి ఐఎండీ బులెటిన్లు విడుదల చేస్తోంది. ఇది ముఖ్యంగా రైతులకు ఎంతగానో ఉపయోగపడనుంది. ఎక్కువగా ఆటోమేటిక్ రెయిన్‌గేజ్‌లు, ఆటోమేటిక్ వెదర్ స్టేషన్లు ఉన్న యూపీ కోసం దీన్ని అభివృద్ధి చేశారు. ఒక ప్రాంతంలో వర్షపాతం వివరాలు, ఉపగ్రహాలు, డాప్లర్ వెదర్ రాడార్ల నుంచి సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించి పది రోజులు ముందుగా వర్షపాతం ఎంత పడుతుందనేది లెక్కకట్టి రైతులకు సమాచారం అందించవచ్చని భూ విజ్ఞాన మంత్రిత్వశాఖ కార్యదర్శి ఎం.రవిచంద్రన్ తెలిపారు. దీనివల్ల రైతులు ఏ పంట వేయాలి? ఏ విత్తనాలు చల్లాలి? నీటి పారుదల, పంట రక్షణ ప్రణాళిక, పంట కోత వంటి విషయాలపై నిర్ణయం తీసుకునే అవకాశం లభిస్తుందన్నారు. పెరుగుతున్న వాతావరణ వైపరీత్యాలు, తీవ్రమైన ఘటనల దృష్ట్యా భవిష్యత్తులో దేశంలోని ఇతర ప్రాంతాలకు ఈ సాంకేతికతను విస్తరిస్తామన్నారు. ఇదిలావుండగా ప్రతి జిల్లాలో నైరుతి రుతుపవనాలు ఎప్పుడు ప్రవేశిస్తాయనేది చెప్పే టూల్‌ను పుణేలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ట్రోఫికల్ మెట్రాలజీ సంస్థ అభివృద్ధి చేసింది. ఏఐ ఆధారిత సాంకేతికతతో దీనిని రూపొందించారు.
దీనితో దేశంలోని వివిధ ప్రాంతాలు, ప్రత్యేకించి ప్రతి జిల్లాలో రుతుపవనాల ప్రవేశం తదితర విషయాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా రుతుపవనాల ప్రవేశం, పురోగతి వివరాలు అందిస్తున్న ఐఎండీ.. ఇక నుంచి ప్రాంతాలు, జిల్లాల వారీగా రుతుపవనాల తీరుతెన్నులను వివరించనుంది. దీనివల్ల వర్షపాతం అంచనాల్లో కచ్చితత్వం వస్తుందని ఐఐటీఎం ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. 16 రాష్ట్రాలు, 3,196 బ్లాకుల్లో సూక్ష్మస్థాయి వర్షపాతం పర్యవేక్షణ అందుబాటులోకి వస్తుందన్నారు. కొత్తగా అభివృద్ధి చేసిన రెండు టూల్స్ వ్యవసాయం, నీటి వనరుల నిర్వహణ, విపత్తుల నిర్వహణకు ఎంతగానో ఉపయోగపడతాయని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు.