26న కేరళకు నైరుతి పవనాలు
ABN , Publish Date - May 16 , 2026 | 06:14 AM
వ్యవసాయ రంగానికి అత్యంత కీలకమైన నైరుతి రుతుపవనాలు ఈనెల 26వ (నాలుగు రోజులు అటుఇటుగా) తేదీన కేరళలో ప్రవేశించనున్నాయి.
వాతావరణ శాఖ వెల్లడి.. నేడు అండమాన్‌కు రాక
విశాఖపట్నం, మే 15(ఆంధ్రజ్యోతి): వ్యవసాయ రంగానికి అత్యంత కీలకమైన నైరుతి రుతుపవనాలు ఈనెల 26వ (నాలుగు రోజులు అటుఇటుగా) తేదీన కేరళలో ప్రవేశించనున్నాయి. ఇప్పటివరకూ ఉన్న వాతావరణ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని భారత వాతావరణ శాఖ శుక్రవారం ఈ విషయాన్ని ప్రకటించింది. సాధారణంగా జూన్ 1న రుతుపవనాలు కేరళను తాకాలి. ఒకవేళ 26నే వచ్చినట్టయితే వరుసగా మూడో ఏడాది మే నెలలో ప్రవేశించినట్టవుతుంది. తీవ్రమైన ఎండలు, గాడ్పులు, పొడి వాతావరణం నుంచి ప్రజలకు ఉపశమనం కల్పించేది, వ్యవసాయ పనులు ప్రారంభించేందుకు దోహదపడేదీ నైరుతి రుతుపవనాలే. దేశంలో ఏటా కురిసే వర్షపాతంలో 70 శాతం ఈ రుతుపవనాల సీజన్‌లోనే నమోదవుతుంది. గడచిన 21 సంవత్సరాల్లో 2015 తప్ప మిగిలిన 20 సంవత్సరాల్లో కేరళకు రుతుపవనాల రాకపై భారత వాతావరణ శాఖ ముందస్తు అంచనాలు నిజమయ్యాయి. ఇదిలావుండగా మధ్య, తూర్పు పసిఫిక్‌మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు పెరిగిన నేపథ్యంలో ఎల్‌నినో వచ్చినట్టు అంతర్జాతీయ వాతావరణ సంస్థలు ఇప్పటికే వెల్లడించాయి. ఎల్‌నినో ప్రభావంతో నైరుతి రుతుపవనాల సీజన్‌లో దీర్ఘకాలిక సగటులో 92 శాతం వర్షపాతం కురుస్తుందని భారత వాతావరణశాఖ ఇప్పటికే తెలిపింది.