విపత్తుల తీవ్రతకు సమన్వయంతో చెక్
ABN , Publish Date - Jun 03 , 2026 | 04:55 AM
ఈ ఏడాది రాష్ట్రంలో, ముఖ్యం గా మధ్య ఆంధ్రప్రదేశ్‌లో సాధారణం లేదా సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర తెలిపారు.
సవాళ్లను ఎదుర్కొనేలా ముందస్తు హెచ్చరికల వ్యవస్థ
ఐఎండీ డైరెక్టర్ జనరల్ మహాపాత్ర వెల్లడి
రుతుపవనాల సన్నద్ధతపై ఐఎండీ, ఎన్‌ఐడీఎం సదస్సు
అమరావతి, జూన్ 2(ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది రాష్ట్రంలో, ముఖ్యం గా మధ్య ఆంధ్రప్రదేశ్‌లో సాధారణం లేదా సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర తెలిపారు. జూన్‌లో వర్షా లు బాగుంటాయన్నారు. మంగళవారం కృష్ణా జిల్లా అడవినెక్కలంలోని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ దక్షిణ క్యాంప్‌సలో ‘నైరుతి రుతుపవనాలు-2026 అంచనాలు-ముందస్తు సన్నద్ధత, బహుళ విపత్తు వాతావరణ హెచ్చరిక సేవలు’ అనే అంశంపై సదస్సు జరిగింది. ఐఎండీ, ఎన్‌ఐడీఎం సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సుకు ఢిల్లీ నుంచి వర్చువల్‌గా పాల్గొన్న ఐఎండీ డీజీ మహాపాత్ర మాట్లాడుతూ.. నైరుతి రుతుపవనాల సీజన్ నేపథ్యంలో విపత్తు నిర్వహణ సంస్థలు, ప్రభుత్వ యంత్రాంగం ముందస్తు సమాచారాన్ని అందిపుచ్చుకుని, ప్రాణ, ఆస్తి నష్టాలను గణనీయంగా తగ్గించాలని పిలుపునిచ్చారు. విపత్తు తీవ్రతను తగ్గించడానికి అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు.
రైతుల కోసం ప్రత్యేక యాప్‌లు
ఈ రుతుపవనాల సీజన్‌లో బంగాళాఖాతంలో ఏర్పడే 13-14 అల్పపీడనాల్లో 90 శాతం పైగా ఉత్తర బంగాళాఖాతంలోనే ఏర్పడుతాయని, ఇవి రుతుపవన ద్రోణి వెంబడి పశ్చిమ దిశగా కదిలేటప్పుడు ఉత్తర ఏపీ, ఒడిశా ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ మీదుగా గుజరాత్ వరకు భారీ వర్షాలు కురుస్తాయని మహాపాత్ర పేర్కొన్నారు. ఏపీలో గోదావరి, కృష్ణా నది పరివాహక ప్రాంతాలు దీనివల్ల ఎక్కువగా ప్రభావితమవుతాయని చెప్పారు. అల్పపీడనాలు ఏర్పడిన సమయంలోనే సముద్రపు పోటు (హై టైడ్స్) తోడైతే, నదుల వరద నీరు సముద్రంలోకి వెళ్లక తీరప్రాంతాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందన్నారు. విపత్తులను ఎదుర్కొనేందుకు ఐఎండీ ’డిసిషన్ సపోర్ట్ సిస్టమ్’ను అభివృద్ధి చేస్తోందని, తద్వారా గత 7 రోజుల వాతావరణ అంచనాలు జిల్లాల వారీగా, మండలాల వారీగా ’ఇంపాక్ట్ బేస్ట్ ఫోర్‌కాస్ట్’ (ప్రభావ ఆధారిత అంచనాలు) తెలుసుకోవచ్చని చెప్పారు. సాధారణ ప్రజల కోసం మౌసమ్ యాప్, మౌసమ్ గ్రామ్ ద్వారా రాబోయే 10 రోజుల ముందస్తు సమాచారాన్ని అందిస్తున్నామని తెలిపారు. రైతుల కోసం ప్రత్యేకంగా కృషి నిధి/క్రాప్ వెదర్ యాప్‌లను అందుబాటులోకి తెచ్చామన్నారు. వరి, అరటి వంటి దాదాపు 25 రకాల పంటల సాగుదారులు తమ పంట రకం, దశను నమోదు చేస్తే.. దానికి తగినట్లుగా తెగుళ్ల నివారణ, ఉష్ణోగ్రత, వర్షపాతం, గాలుల సమాచారం అందుతుందన్నారు. కలెక్టర్లు, తహసీల్దార్లు, వ్యవసాయాధికారులు ముందస్తు సమాచారాన్ని ఉపయోగించుకుని, నష్టాలను నివారించాలని కోరారు. అందరం కలిసి పని చేసి, విపత్తుల నష్టాన్ని నివారిద్దామని మహపాత్ర పిలుపునిచ్చారు.
క్లైమేట్ స్మార్ట్ స్టేట్‌గా ఏపీ
సదస్సుకు ప్రత్యేక అతిథిగా హాజరైన ఐసీఏఆర్ క్రిడా వ్యవస్థాపకులు, విశ్రాంత ప్రొఫెసర్ బీవీ రమణరావు మాట్లాడుతూ.. తుఫాన్లు, వరదలు, కరువులు వంటి వాతావరణ విపత్తుల వల్ల దేశానికి భారీ ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లుతోందని చెప్పారు. విపత్తు నిర్వహణ కోసం ప్రభుత్వం ఏటా రూ.లక్ష కోట్లకు పైగా ఖర్చు చేయాల్సి వస్తోందన్నారు. ఈ నష్టాన్ని 10-15 శాతం తగ్గించగలిగితే.. ఆ నిధులను దేశ ప్రగతికి ఉపయోగించవచ్చని అభిప్రాయపడ్డారు. చెన్నై రీజనల్ మెట్రోలాజికల్ సెంటర్ హెడ్ డాక్టర్ శివానంద మాట్లాడుతూ.. ఏపీని క్లైమేట్ స్మార్ట్ స్టేట్‌గా మార్చడానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు.