బ్యూటీ పార్లర్‌లో ‘సౌందర్య చికిత్సలు’ నేరం
ABN , Publish Date - Mar 11 , 2026 | 05:41 AM
కాసేపు సేదదీరేందుకు వె ళ్లే స్పాల్లో, బ్యూటీ పార్లర్‌లలో చర్మ సౌందర్య చికిత్సలు చేసే వారిపై, ఎటువంటి వైద్యపరమైన అర్హత లేకుండా జుత్తు మొలిపించే సర్జరీలు.....
అర్హత లేకుండా చర్మ చికిత్సలు చేస్తే జైలుకే
ఐఏడీవీఎల్ నేషనల్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ డాక్టర్ సీతారామ్
గుంటూరు మెడికల్, మార్చి 10(ఆంధ్రజ్యోతి): కాసేపు సేదదీరేందుకు వె ళ్లే స్పాల్లో, బ్యూటీ పార్లర్‌లలో చర్మ సౌందర్య చికిత్సలు చేసే వారిపై, ఎటువంటి వైద్యపరమైన అర్హత లేకుండా జుత్తు మొలిపించే సర్జరీలు, ఇతర చర్మ సౌందర్య చికిత్సలు చేసే నకిలీ వైద్యులపై చట్టపరంగా తగిన చర్యలు చేపడుతున్నట్లు ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ డెర్మటాలజీ, వెనీరియాలజీ, లెప్రాలజీ (ఐఏడీవీఎల్) నేషనల్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ డాక్టర్ కేఏ సీతారామ్ వెల్లడించారు. మంగళవారం గుంటూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘చర్మవ్యాధుల వైద్య రంగంలో నకిలీ వైద్యుల దందా రోజు రోజుకు పెరుగుతోంది. నకిలీ వైద్యుల దగ్గర చికిత్సల కోసం వెళ్లిన వారిలో పలువురు తీవ్రమైన ఆరోగ్యపరమైన దుష్ప్రభావాలకు గురై మా దగ్గరకు వస్తున్నారు. సగటున మా దగ్గరకు వస్తున్న ఓపీల్లో 20 శాతం మంది ఇలాంటి బాధితులే కనిపిస్తున్నారు. దేశవ్యాప్తంగా 18 వేల మంది చర్మవ్యాధుల వైద్య నిపుణులు సభ్యులు ఉన్న ఐఏడీవీఎల్ ఈ విషయంలో మౌనంగా ఉంటే రోగులకు మరింత అన్యాయం జరుగుతుంది. కష్టపడి ఆయా వైద్యచికిత్సల్లో తగిన శిక్షణ పొందిన క్వాలిఫైడ్ డెర్మటాలజిస్టులు కూడా వృత్తిపరంగా తీవ్రంగా నష్టపోతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని నకిలీ వైద్యుల ఆట కట్టించేందుకు జాతీయ, రాష్ట్ర, జిల్లా స్ధాయిలో ఐఏ డీవీఎల్ తరఫున యాంటీ క్వాకరీ కమిటీలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే ఈ కమిటీలు రంగంలోకి దిగియి. ఈ తరహా వైద్యం చేస్తున్న వారిపై కోర్టుల ద్వారా చట్టపరమైన చర్యలు తీసుకొనేందుకు కృషి చేస్తున్నాయి’ అని డాక్టర్ సీతారామ్ తెలిపారు. ఐఏ డీవీఎల్ యాంటీ క్వాకరి కమిటీ జాతీయ సభ్యురాలు డాక్టర్ అత్తోట కవిత మాట్లాడుతూ... ‘కొంత మంది దంత వైద్యులు తమ ఆసుపత్రులు, క్లినిక్‌లకు ‘స్కిన్, హెయిర్, నెయిల్ క్లినిక్‌లుగా’ నామకరణం చేయడం తీవ్ర అభ్యంతరకరం. వెంటనే ఇలాంటి పేర్లు తొలగించడంతో పాటు వారు దంత వైద్యానికే పరిమితం కావాలి.’ అని పేర్కొన్నారు. సమావేశంలో ఐఏడీవీఎల్ గుంటూరు అధ్యక్షుడు డాక్టర్ రాకేశ్, కార్యదర్శి డాక్టర్ నాగేశ్వరరావు, డాక్టర్ సౌజన్య, డాక్టర్ శిరీష తదితరులు పాల్గొన్నారు. కాగా 2027 సంవత్సరంలో గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగే చర్మవ్యాధుల వైద్యనిపుణుల సంఘం జాతీయ సదస్సులో నేషనల్ ప్రెసిడెంట్‌గా డాక్టర్ సీతారామ్ బాధ్యతలు చేపడతారు.