కోనసీమలో కుమ్మేస్తున్నారు!
ABN , Publish Date - Mar 30 , 2026 | 04:58 AM
ప్రభుత్వం ప్రజల మేలుకోరి ఉచిత ఇసుకను అందిస్తోంది. వాణిజ్య అవసరాలకు మాత్రమే నిర్దిష్ట ధరకు ఇసుక సరఫరా చేస్తోంది. అయినా సరే ఉచిత ఇసుక సరఫరాపై ప్రజా సంతృప్త స్థాయి తక్కువగా ఉంటోంది.
అడ్డగోలుగా ఇసుక, మట్టి దోపిడీ.. వైసీపీ మాజీ ఎంపీ క నుసన్నల్లో దందా
గోదావరి నదీగర్భంలో రహదారులు.. దర్జాగా అక్రమ రీచ్‌ల నిర్వహణ
కీలక ఉన్నతాధికారి అండదండలు.. మరో ఇద్దరు ప్రజాప్రతినిధులకు వాటాలు
ఇసుక సరఫరాలో ప్రజా సంతృప్త స్థాయి తక్కువగా ఉండటానికి ఇదే కారణం
ప్రభుత్వానికి నివేదిక.. స్థానికుల నుంచీ ఫిర్యాదులు
వైసీపీ మాజీ ఎంపీ ఒకరు కోనసీమలో ఇసుక అక్రమ తవ్వకాల్లో కుమ్మేస్తున్నారు. జిల్లాలోని కీలక అధికారి అండదండలతో చెలరేగిపోతున్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన సదరు నేత.. గత వైసీపీ ప్రభుత్వంలో ఆ అధికారికి సొంత ప్రాంతంలో పోస్టింగ్ ఇప్పించారు. ఆ పరిచయంతో ఇప్పుడు పక్క ప్రాంతంలో దోపిడీ చేస్తున్నారు. ఇసుక దందాలో వచ్చిన సొమ్ములో ఆ అధికారికి 25-30 శాతం, పి.గన్నవరం, కొత్తపేటకు చెందిన ఇద్దరు నేతలకు 10 శాతం చొప్పున వాటాలు ఇస్తున్నట్టు తెలుస్తోంది.
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
ప్రభుత్వం ప్రజల మేలుకోరి ఉచిత ఇసుకను అందిస్తోంది. వాణిజ్య అవసరాలకు మాత్రమే నిర్దిష్ట ధరకు ఇసుక సరఫరా చేస్తోంది. అయినా సరే ఉచిత ఇసుక సరఫరాపై ప్రజా సంతృప్త స్థాయి తక్కువగా ఉంటోంది. ఇలాంటి జాబితాలో కోనసీమ జిల్లా తొలి వ రుసలో ఉంది. గోదావరి నది ప్రవహించే ఈ జిల్లాలో ఇసుక పుష్కలంగా లభిస్తున్నా ప్రజాసంతృప్త స్థాయి ఎందుకు తగ్గుతోంది? ఉచిత ఇసుక ఎటుపోతోంది? ప్రజలు ఎందుకు అసంతృప్తిగా ఉంటున్నారు? ఈ ప్రశ్నలకు సర్కారు సమాధానాలను అన్వేషించగా అసలు విషయం బయటపడింది. ఇందుకు కారణమేంటంటే.. ఇసుక అక్రమ తవ్వకాలు. ప్రజలకు, ప్రభుత్వ అవసరాలకు దక్కాల్సిన ఇసుక పక్కదారి పట్టడమే. దర్జాగా రాత్రి, పగలు తేడా లేకుండా ఇసుక దోపిడీ జరుగుతోంది. దీనికి నేతృత్వం వహిస్తోంది కూటమి నేతలో, ప్రజాప్రతినిధులో కాదు. వైసీపీలో కీలక నే తగా ఉన్న ఓ మాజీ ఎంపీ.. ఆయన మరో ఇద్దరు అనుచరులు. నదీ గర్భాల్లోని విలువైన ఇసుకను తోడేస్తున్నారు.
ఈ దోపిడీకి జిల్లాలోని ఓ కీలక ఉన్నతాధికారి ఆశీస్సులు, అండదండలున్నాయి. పార్టీలు, హోదాలకు అతీతంగా వైసీపీ నేతతో అధికారులు అంటకాగుతూ వాటాలు దండుకుంటున్నారు. ఫలితంగా కోనసీమలో గోదావరి గుల్ల అవుతోందంటూ ప్రభుత్వానికి నివేదికలు అందాయి. ఇటు గనుల శాఖకు, అటు ప్రభుత్వానికి ఇసుక, ఎర్రమట్టి దోపిడీపై నివేదికలు చేరాయి. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకూ స్థానికుల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. ఆయా ప్రాంతాల్లో ఇసుక అక్రమ తవ్వకాలు, అమ్మకాలు జరుగుతున్నాయని తెలిపారు.
ఎవరి వాటా వారిదే
కోనసీమ జిల్లాలోని ఓ కీలక ఉన్నతాధికారికి 25-30 శాతం వాటా ఇస్తున్నారని తెలిసింది. ఇసుక అక్రమ తవ్వకాలు, అమ్మకాల ద్వారా వచ్చే అడ్డగోలు ఆదాయంలో ఆ అధికారికి నెలనెలా వాటా పంపిస్తున్నారని సమాచారం. ఇక కొత్తపేట, పి.గన్నవరంలోని ఇద్దరు నేతలకు పదిశాతం చొప్పున వాటా ఇస్తున్నారని, అందుకే వారు అక్రమ తవ్వకాల పట్ల మౌనంగా ఉంటన్నారని తెలిసింది. అక్రమ తవ్వకాలు, తరలింపు వల్ల గనుల శాఖకు సీనరేజీ ఫీజులు రావడం లేదు. నేతల దందా వల్ల ప్రజలకు ఉచిత ఇసుక సకాలంలో అందడం లేదు. అధికారిక రీచ్‌లున్న చోట తీస్తున్న ఇసుకకు సంబంధించిన సీనరేజీ ఫీజు కూడా గనుల శాఖ ఖాతాకు చేరడం లేదని, ఓ ఉన్నతాధికారి అకౌంట్‌కు ఆ నిధులు మళ్లించారని గుర్తించారు.
18 అనధికార రీచ్‌లు
ఉచిత ఇసుక పంపిణీ ప్రారంభం అయినప్పటి నుంచి కోనసీమ జిల్లా ప్రజాసంతృప్త స్థాయిలో అడుగున ఉంటోంది. దీంతో జిల్లాలో ఏం జరుగుతోంది? ఇసుక తవ్వకాలు, పంపిణీ, రవాణా ఎలా ఉంది? ప్రజలెదుర్కొంటున్న సమస్యలు, క్షేత్రస్థాయిలో సవాళ్లు ఏమిటా అని ప్రభుత్వం ఆరాతీసింది. అందిన రెండు నివేదికల్లో విస్తుపోయే అంశాలున్నాయి. విశ్వసనీయ సమాచారం మేరకు.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వైసీపీ మాజీ ఎంపీ కోనసీమలో ఇసుక, ఎర్రమట్టి, ఇతర వ్యాపారాలను గుప్పిటపట్టారు. గోదావరి నది సొంతం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో కూడా అధికారులను నియంత్రిస్తున్నారు. జిల్లాకు చెందిన ఓ కీలక ఉన్నతాధికారితో లోపాయకారీ ఒప్పందం చేసుకున్నారు. ఆ అధికారికి వైసీపీ ప్రభుత్వంలో ఆ నేతే పోస్టింగ్ ఇప్పించారు. నాటి పరిచయాన్ని ఇప్పుడు వాడుకుంటున్నారు. ఇసుక అక్రమ తవ్వకాలకు ఆ అధికారి రాచబాటలు వేశారు. దీంతో కేవలం రెండు నియోజకవర్గాల పరిధిలోనే 18 అనధికారిక రీచ్‌లను నడుపుతున్నారని గుర్తించారు.
ఇవిగో అక్రమ తవ్వకాలు
మందపల్లి పరిధిలో అనధికారిక ఇసుక రీచ్‌ను ఏర్పాటు చేశారు. నదిలోనే రహదారిని ఏర్పాటు చేశారు. రాత్రి, పగలు తేడాలేకుండా 24 గంటలూ ఇసుక తవ్వకాలు, రవాణా జరుగుతున్నాయి. ఇక్కడి నుంచి వందలాది లారీలు నిత్యం ఇసుకను తీసుకెళ్తున్నాయి.
ఊబలంక పరిధిలో అధికారిక రీచ్ ఉంది. కానీ అక్కడ ఇసుక తవ్వడం లేదు. ప్రభుత్వం ఇచ్చిన జియో కోఆర్డినేట్స్‌కు సుదూరంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. ఊబలంక నుంచి జొన్నాడ పాత బ్రిడ్జి వరకు నదిలో రహదారిని ఏర్పాటు చేశారు.
ఆత్రేయపురం గ్రామ పరిధిలో అధికారిక రీచ్‌లు లేవు. ఇసుక తవ్వకాలకు అనుమతులు లేవు. అయినా ఇక్కడా ఓ అనధికారిక రీచ్‌లో నిరంతరం తవ్వకాలు చేపట్టి సరఫరా చేస్తున్నారు. వందల లారీల రాకపోకలతో ఆ ప్రాంతం శబ్ద్దకాలుష్యానికి గురవుతోంది. ప్రజల నుంచి అభ్యంత రాలు రాకుండా చూసుకోవడం, అధికారులను సమన్వయం చేసుకోవడం కోసం ఆ వైసీపీ నేత ఇక్కడ ఓ అనధికారిక ఆఫీసునే నడుపుతున్నారు.
గోపాలపురం పరిధిలోనూ అక్రమ తవ్వకాలు సాగుతున్నాయి. ఇక్కడ ఎర్రమట్టిని కూడా అక్రమంగా తరలిస్తున్నారు.
వద్దిపర్రులో 2 అనధికారిక రీచ్‌లు నిర్వహిస్తున్నారు. సదరు వైసీపీ నేత మనుషులు ఇక్కడే ప్రత్యేక క్యాంప్ ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
జొన్నాడ పరిధిలో కిలోమీటరున్నర పరిధిలో అక్రమ రీచ్‌ను నిర్వహిస్తున్నారు. వైసీపీ నేత అనుచరులు ఇద్దరు ఇక్కడ ఇసుక తవ్వకాలను పర్యవేక్షిస్తున్నారు.
పి. గన్నవరం నియోజకవర్గం పరిధిలో ఉడుమూడి, పందాలపాలెం, వైవిపాలం, వైనతేయ సమీపంలో అనధికారిక రీచ్‌లున్నాయి. రాత్రి, పగలు తేడాలేకుండా తవ్వుతూ ఇసుకను తరలిస్తున్నారు.
జొన్నాడ, ఉముమూడి ప్రాంతాల నుంచి మట్టి తవ్వి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం ఇచ్చిన 60 రోజుల గడువు ముగిసిపోయింది. అయినా యఽథేచ్ఛగా తీసుకెళ్లిపోతున్నారు. నిజానికి ఇక్కడి మట్టిని జాతీయ రహదారి నిర్మాణం కోసం వాడాలి. కానీ ఆ పేరు చెప్పి బయటి మార్కెట్‌కు తరలిస్తున్నారు.