Share News

అక్రమ బాణసంచాపై 11 ఏళ్లలో 3,219 కేసులు

ABN , Publish Date - Mar 06 , 2026 | 03:48 AM

గత 11 ఏళ్లలో రాష్ట్రంలో అక్రమ బాణసంచాపై 3,219 కేసులు నమోదు చేశామని, రూ.26.66 కోట్ల విలువైన బాణసంచాను స్వాధీనం చేసుకుని నిర్వీర్యం చేశామని హోంమంత్రి అనిత వెల్లడించారు.

అక్రమ బాణసంచాపై 11 ఏళ్లలో 3,219 కేసులు

  • 26.66 కోట్ల విలువైన బాణసంచా స్వాధీనం: మంత్రి అనిత

  • పోలీసులు అక్రమాలకు పాల్పడుతున్నారు: ఎమ్మెల్యే కూన

అమరావతి, మార్చి 5(ఆంధ్రజ్యోతి): గత 11 ఏళ్లలో రాష్ట్రంలో అక్రమ బాణసంచాపై 3,219 కేసులు నమోదు చేశామని, రూ.26.66 కోట్ల విలువైన బాణసంచాను స్వాధీనం చేసుకుని నిర్వీర్యం చేశామని హోంమంత్రి అనిత వెల్లడించారు. గురువారం అసెంబ్లీలో ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్‌ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ.. రాష్ట్రవ్యాప్తంగా అనుమతిలేకుండా బాణసంచా తయారీ, విక్రయాలు చేపడితే పోలీసులు ఎప్పటికప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని చెప్పారు. స్వాధీనం చేసుకున్న బాణసంచా వేలం ద్వారా రూ.50.58 లక్షలు ఖజానాకు జమ చేసినట్లు పేర్కొన్నారు. రూ.26 కోట్లకు పైగా స్వాధీనం చేసుకుంటే వేలం ద్వారా రూ.50 లక్షలు మాత్రమే ఖజానాకు చేరడం ఏమిటని రవికుమార్‌ నిలదీశారు. పోలీసులు అధికారికంగా రూ.26 కోట్లు చూపిస్తే అనధికారికంగా రూ.100 కోట్ల బాణసంచా స్వాధీనం చేసుకొని ఉంటారని, ఇదంతా పెద్ద స్కామ్‌ అని ఆరోపించారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన అనిత.. బాణసంచా స్వాధీనం చేసుకున్న తర్వాత పోలీసులు కేసులు నమోదు చేసి కోర్టుకు వివరాలు అందజేస్తారని, కోర్టు ఆదేశాల మేరకే నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.


అంగన్‌వాడీ భవనాలకు 4 కోట్లు: సంధ్యారాణి

నిధుల కొరత కారణంగా అంగన్‌వాడీ భవనాల నిర్మాణం అసంపూర్తిగా ఉందని, వాటిని పూర్తి చేయడానికి రూ.4 కోట్లు మంజూరు చేశామని మహిళా శిశు సంక్షేమ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. మనబడి, మన భవిష్యత్తు ద్వారా అన్ని ప్రాథమిక పాఠశాలల్లో మౌలిక సదుపాయాల పనులు పూర్తి చేసేందుకు నిధులు కేటాయిస్తామని మంత్రి లోకేశ్‌ తెలిపారు. సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహాల్లో విద్యార్థుల భద్రత కోసం అధికారుల తనిఖీ, రాత్రి సమయాల్లో పోలీసు గస్తీ, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు మంత్రి స్వామి తెలిపారు.

Updated Date - Mar 06 , 2026 | 03:48 AM