భద్రాద్రి రామయ్య భూముల్లో అక్రమ నిర్మాణాలు
ABN , Publish Date - Apr 06 , 2026 | 05:01 AM
తెలంగాణ-ఏపీ సరిహద్దుల్లోని భద్రాద్రి రామయ్య భూముల్లో ఇష్టారాజ్యంగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి. నాలుగు నెలలుగా ఏపీలోని పోలవరం జిల్లా యటపాక మండలం పురుషోత్తపట్నం గ్రామంలోని...
పురుషోత్తమపట్నంలో వివిధ దశల్లో 30 ఇళ్లు
అధికారులు అడ్డుకునే ప్రయత్నం.. లెక్కచేయని నిర్మాణదారులు.. అధికారులపై పరుష పదజాలం
68 సార్లు ఫిర్యాదు.. పట్టని రెవెన్యూ. పోలీసు అధికారులు
తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు చొరవ చూపాలని సీతారామచంద్రస్వామి భక్తుల వినతి
భద్రాచలం, ఏప్రిల్ 5 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ-ఏపీ సరిహద్దుల్లోని భద్రాద్రి రామయ్య భూముల్లో ఇష్టారాజ్యంగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి. నాలుగు నెలలుగా ఏపీలోని పోలవరం జిల్లా యటపాక మండలం పురుషోత్తపట్నం గ్రామంలోని సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం భూముల్లో 30 పక్కా భవనాలు, రేకుల ఇళ్ల నిర్మాణాలు చేపట్టినట్లు దేవస్థానం వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయమ్మీద 68సార్లు పోలీసు, రెవెన్యూ శాఖల అధికారులకు పూర్తి ఆధారాలతో లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు, అయినా వారి నుంచి ఏమాత్రం స్పందన లేనట్లు భద్రాద్రి దేవస్థానం సిబ్బంది వర్గాలు పేర్కొన్నాయి. అక్కడ దేవస్థానం భూముల్లో పక్కా భవన, రేకుల షెడ్ల నిర్మాణాలు జరుగుతున్నాయన్న విషయం తెలిసి, దేవస్థానం సిబ్బంది అడ్డుకునేందుకు వెళ్లినా వారి మాటలను నిర్మాణదారులు లెక్క చేయడం లేదని తెలుస్తోంది. పైగా మీరేం చేసుకుంటారో చేసుకోండి అంటూ తమను ఉద్దేశించి నిర్మాణదారులు పరుష వ్యాఖ్యలు చేస్తున్నట్లు దేవస్థానం సిబ్బంది వర్గాలు వాపోతున్నాయి. పురుషోత్తమపట్నంలోని స్వామివారి ఆలయ భూముల్లో పునాది, పిల్లర్లు, శ్లాబ్‌లు, గోడల దశల్లో వివిధ నిర్మాణాలు ఉన్నాయి. అక్రమ నిర్మాణాలపై గతంలో ఏపీ హైకోర్టు భద్రాచలం దేవస్థానానికి అనుకూలంగా తీర్పు వెలువరించినా అప్పటి ఏపీ ప్రభుత్వం చొరవ తీసుకోకపోవడంతో ఆ సమస్యకు పరిష్కారం లభించలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాలైనా ఈ విషయంలో చొరవ చూపాలని రామ భక్తులు కోరుతున్నారు.
నిర్మాణాలను అడ్డుకునే ప్రయత్నం చేస్తే..
పురుషోత్తపట్నంలోని భద్రాద్రి రామయ్య భూముల్లో అక్రమ నిర్మాణాలు జరుగుతున్న విషయాన్ని తెలుసుకుని దేవస్థానం సూపరింటెండెంట్ అరుణ్‌కుమార్, సిబ్బంది శ్రీకాంత్ శనివారం అక్కడికి వెళ్లి ఆ పనులను అడ్డుకున్నారు. ఈ క్రమంలో నిర్మాణదారులకు వారికి మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. ఇదే సమయంలో అక్కడి పరిస్థితులను చిత్రీకరిస్తుంటే వీడియో ఎందుకు తీస్తున్నారంటూ సిబ్బందిని ఉద్దేశించి నిర్మాణదారులు పరుషంగా మాట్లాడారు.