Share News

అనుమతి లేని చర్చిల వల్లే ఈ అనర్థాలు

ABN , Publish Date - May 12 , 2026 | 05:17 AM

అనుమతులు లేకుండా జనావాసాల్లో నిర్మించిన అనధికార చర్చిల వల్లే రాష్ట్రంలో అనర్థాలు సంభవిస్తున్నాయని ఏపీ డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు తెలిపారు.

అనుమతి లేని చర్చిల వల్లే ఈ అనర్థాలు

  • శబ్ధ కాలుష్యాన్ని ఉపేక్షించబోం: రఘురామకృష్ణరాజు

కాళ్ల, మే 11(ఆంధ్రజ్యోతి): అనుమతులు లేకుండా జనావాసాల్లో నిర్మించిన అనధికార చర్చిల వల్లే రాష్ట్రంలో అనర్థాలు సంభవిస్తున్నాయని ఏపీ డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు తెలిపారు. కాళ్ల మండలం పెద అమిరంలోని తన క్యాంపు కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ‘సీఎం చంద్రబాబు ఆదేశాల ప్రకారం నిర్వహిస్తున్న ప్రజాదర్బార్‌లో చర్చిలు, కొన్ని దేవాలయాల మైకుల వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయని ప్రజల నుంచి ఫిర్యాదులు అందాయి. ఎక్కువమంది అదే సమస్యను తీసుకురావడంతో విస్తృత సమస్యగా పరిగణించి వాటిపై చర్యలకు ఉపక్రమించాలని రాష్ట్ర డీఐజీ, పొల్యూషన్‌ కంట్రోల్‌ చైర్మన్‌కు ఫిర్యాదు లేఖ అందించాం. చట్టప్రకారం ఏడాదికి 15 రోజులు మాత్రమే పోలీసుల అనుమతితో మైకులు నిర్దిష్ట డెసిబుల్స్‌లో వినియోగించాలి. చట్టాన్ని అతిక్రమించి ఇళ్ల మధ్యలో ఉన్న చర్చిలపై ప్రజలే నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేయాలి. నూతనంగా చర్చిలు, దేవాలయాలు నిర్మించాలంటే సొంత స్థలాల్లో పంచాయతీ తీర్మానం ఉండాలి, కలెక్టర్‌ అనుమతి పొందిన తర్వాత మాత్రమే నిర్మాణాలు చేపట్టాలి’ అని స్పష్టం చేశారు. కాగా.. పాస్టర్‌ రాంబాబు వంటి వారు అనుమతులు లేకుండా ఇళ్ల మధ్యలో చర్చిలు ఏర్పాటు చేయడం వల్ల మైనర్లపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని రఘురామకృష్ణరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ బాలిక జీవితానికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. రాంబాబుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం వల్లే ఇలాంటివి జరిగాయని మండిపడ్డారు.

Updated Date - May 12 , 2026 | 05:17 AM