‘వదిలేసే కళ’ను అలవాటు చేసుకోండి
ABN , Publish Date - Aug 23 , 2026 | 04:56 AM
కష్టమైన, అసౌకర్యంగా ఉన్న పరిస్థితిలో కూడా ప్రశాంతంగా ఉండటాన్ని విద్యార్థులు అలవాటు చేసుకోవాలని భారతీయ వాయుసేన (ఐఏఎఫ్) గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా పేర్కొన్నారు.
ఐఐటీ స్నాతకోత్సవంలో గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా
తిరుపతి(టీటీడీ), ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): కష్టమైన, అసౌకర్యంగా ఉన్న పరిస్థితిలో కూడా ప్రశాంతంగా ఉండటాన్ని విద్యార్థులు అలవాటు చేసుకోవాలని భారతీయ వాయుసేన (ఐఏఎఫ్) గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా పేర్కొన్నారు. ప్రస్తుత కాలంలో ఏది వదిలేయాలో తెలుసుకునే కళను అలవాటు చేసుకోవాలని సూచించారు. రాబోయే కాలంలో ఎక్కువ పనులు చేసిన వారు కాకుండా, అనవసరమైన వాటిని వదిలేసి అత్యంత ముఖ్యమైన దానిపై దృష్టి పెట్టిన వారే విజయం సాధిస్తారని స్పష్టం చేశారు. తిరుపతి ఐఐటీ 8వ స్నాతకోత్సవంలో ఆయన మాట్లాడుతూ.. జీవితంలో గొప్ప పనులన్నీ చాలా కాలం ఓపిగ్గా, నిశ్శబ్దంగా అసౌకర్యాలను భరించిన వారి వల్లే సాధ్యమయ్యాయన్నారు.
రాబోయే పదేళ్లు కీలకం: సజ్జన్ జిందాల్
రాబోయే పదేళ్లు ఎంతో కీలకమని ఐఐటీ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ చైర్మన్ సజ్జన్ జిందాల్ అన్నారు. విద్యార్థులు తమ నైపుణ్యాలతో ఉద్యోగ, పరిశోధన, వ్యాపార రంగాల్లో రాణించి, దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. విద్యార్థులకు తన ఆన్‌లైన్ సందేశాన్ని అందజేశారు. ఇంజనీరింగ్ రంగంలో సాధించిన అద్భుతాల వల్లే జర్మనీ, చైనా వంటి దేశాలు ప్రపంచంలోనే పెద్ద పారిశ్రామికశక్తులుగా ఎదిగాయనే విషయాన్ని గుర్తెరగాలని సూచించారు. కార్యక్రమంలో ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ కె.ఎన్.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేశారు.