Share News

ఏక్యూసీసీలో వైబ్రేషన్‌ తనిఖీలు

ABN , Publish Date - Apr 13 , 2026 | 07:05 AM

అమరావతిలో నిర్మిస్తున్న ఏక్యూసీసీ (అమరావతి క్యాంటమ్‌ కంప్యూటింగ్‌ సెంటర్‌) భవనంలో మద్రాస్‌ ఐఐటీ నిపుణుల ఆధ్వర్యంలో ఆదివారం వైబ్రేషన్‌ పరీక్షలను నిర్వహించారు.

ఏక్యూసీసీలో వైబ్రేషన్‌ తనిఖీలు

  • రెండో దశ పరీక్షలు చేపట్టిన ఐఐటీ మద్రాస్‌ నిపుణులు

మంగళగిరి, ఏఫ్రిల్‌ 12 (ఆంధ్రజ్యోతి): అమరావతిలో నిర్మిస్తున్న ఏక్యూసీసీ (అమరావతి క్యాంటమ్‌ కంప్యూటింగ్‌ సెంటర్‌) భవనంలో మద్రాస్‌ ఐఐటీ నిపుణుల ఆధ్వర్యంలో ఆదివారం వైబ్రేషన్‌ పరీక్షలను నిర్వహించారు. రాజధాని అమరావతిలో క్వాంటమ్‌ వ్యాలీకి రాష్ట్రప్రభుత్వం కేటాయించిన 50 ఎకరాల్లో ప్రస్తుతం అమరావతి క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ సెంటర్‌ భవనాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. జీ+1 భవన సముదాయంగా నిర్మిస్తున్న ఈ భవనంలోని గ్రౌండు ఫ్లోర్‌లోనే ప్రధానమైన క్వాంటమ్‌ కంఫ్యూటర్‌ను ఏర్పాటు చేస్తారు. ఈ కంఫ్యూటర్‌ సక్రమంగా పనిచేయాలంటే అది -273 డిగ్రీల ఉష్ణోగ్రతల మధ్య ఉండడంతోపాటు ప్రకంపనాలేవీ దాని దరిజేరకూడదు. ఇందుకు తగినట్టు కంఫ్యూటర్‌ను ఏర్పాటు చేయబోయే గది నిర్మాణాన్ని చేపట్టాలి. దీనిని ఐసోలేషన్‌ రూమ్‌గా వ్యవహరిస్తారు. ఈ రూమ్‌ నిర్మాణంలో తీసుకోవల్సిన జాగ్రత్తలు ఏయే ప్రమాణాల్లో ఉండాలో తెలుసుకునేందుకు ప్రభుత్వం మద్రాస్‌ ఐఐటీ నిపుణుల చేత వైబ్రేషన్‌ పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షలను భవన నిర్మాణ సమయంలో మూడు వేర్వేరు దశల్లో చేపట్టి ఆ నివేదికల ఆధారంగా కంఫ్యూటర్‌ను ఏర్పాటు చేసే ఐసోలేషన్‌ రూమ్‌ను నిర్మిస్తారు. ఇందులో భాగంగా మొదటి దశ వైబ్రేషన్‌ పరీక్షను గతనెల 3న చేపట్టగా.. ఆదివారం రెండోసారి పరీక్షలు నిర్వహించారు. మూడో దశ పరీక్షలను మధ్యలో ఉన్న తొమ్మిది పైల్స్‌పైన ఫైల్‌క్యాప్‌ వేశాక నిర్వహిస్తారు. ఈ మూడు దశల్లో లభించిన నివేదికల ఆధారంగా ఐసోలేషన్‌ నిర్మాణంలో చేపట్టాల్సిన ప్రమాణాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను నిర్ధారిస్తారు. ఈ తనిఖీల్లో మద్రాస్‌ ఐఐటీ నిఫుణులు ప్రొఫెసర్‌ పద్మనాభన్‌, తరంగ వైబ్రోసిక్‌ టెక్నాలజీస్‌ సీఈవో డాక్టర్‌ చింతపల్లి సూర్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 13 , 2026 | 07:06 AM