Share News

నేతన్నల ‘సాంకేతిక’ శక్తి!

ABN , Publish Date - Jun 08 , 2026 | 04:48 AM

జౌళి పరిశ్రమకు అవసరమయ్యే సాంకేతిక నిపుణులను అందించే లక్ష్యంతో తిరుపతి జిల్లా వెంకటగిరిలో శ్రీ ప్రగడ కోటయ్య స్మారక భారత సాంకేతిక చేనేత శిక్షణా సంస్థ(ఐఐహెచ్‌టీ) సేవలందిస్తోంది.

నేతన్నల ‘సాంకేతిక’ శక్తి!

  • వెంకటగిరిలో ఐఐహెచ్‌టీ

  • చేనేత రంగంలో కీలక శిక్షణ

  • 1992లో తిరుపతిలో ఏర్పాటు

  • 10వ తరగతి ఉత్తీర్ణతతో ప్రవేశం

  • అభ్యర్థులకు రిజర్వేషన్‌ వర్తింపు

  • డిప్లొమాలో చేరితే ఉద్యోగం పక్కా

  • 15 వరకు దరఖాస్తులకు చాన్స్‌

(వెంకటగిరి-ఆంధ్రజ్యోతి)

జౌళి పరిశ్రమకు అవసరమయ్యే సాంకేతిక నిపుణులను అందించే లక్ష్యంతో తిరుపతి జిల్లా వెంకటగిరిలో శ్రీ ప్రగడ కోటయ్య స్మారక భారత సాంకేతిక చేనేత శిక్షణా సంస్థ(ఐఐహెచ్‌టీ) సేవలందిస్తోంది. 1992లో 25 ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఈ సంస్థను ఏర్పాటు చేశారు. 10వ తరగతి లేదా తత్సమానమైన పరీక్షల్లో ఉతీర్ణులైన వారు.. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యాండ్లూమ్స్‌ టెక్నాలజీలో(ఐఐహెచ్‌టీ) చేరడానికి అర్హులు. రిజర్వేషన్‌ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంది. బీసీ, జనరల్‌ కేటగిరీ అభ్యర్థులు 15-23 ఏళ్ల మధ్య ఉండాలి. షెడ్యూల్డ్‌ కులాలు, తెగ ల అభ్యర్థులకు గరిష్ఠ వయోపరిమితిలో రెండేళ్ల సడలింపు ఉంటుంది. ఈ సంస్థలో డిప్లొమా ఇన్‌ హ్యాండ్లూమ్స్‌ అండ్‌ టెక్స్‌టైల్స్‌ టెక్నాలజీ, అపెరల్స్‌ అండ్‌ గార్మెంట్స్‌ తయారీలో శిక్షణ ఇస్తారు. 3 సంవత్సరాల కాలపరిమితి గల ఈ కోర్సును 6 సెమిస్టర్లు గా విభజించారు.


ఉపకార వేతనం

శిక్షణ సమయంలో నెలకు రూ.2,500 చొప్పున ఉపకార వేతనం ఇస్తారు. బాలురకు సంస్థ ప్రాంగణంలోనే హాస్టల్‌ వసతి ఉంది. కాగా, వెంకటగిరిలో నెలకొల్పిన ఐఐహెచ్‌టీ దేశంలో నాల్గవది. అయితే, ఆంద్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు మాత్రం ఏకైక సంస్థ. గత ఏడాది హైదరాబాద్‌లో ఐఐహెచ్‌టీని ఏర్పాటు చేసినా.. ఇంకా కార్యకలాపాలు ప్రారంభంకాలేదు. దేశవ్యాప్తంగా ఈ తరహా సంస్థలు 11 మా త్రమే ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని వారాణసీ, తమిళనాడులోని సేలం, అసోంలోని గౌహతి, ఒడిశాలోని భార్గర్‌, రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌, ఏపీలోని వెంకటగిరి, కర్ణాటకలోని గదగ్‌, ఛత్తీస్‌గఢ్ లోని చంపా, కేరళలోని కన్నూరు, వెస్ట్‌ బెంగాల్‌లోని పులియాలో ఈ సంస్థలు నెలకొల్పారు. మొత్తం సంస్థల నిర్వహణ కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో జరుగుతుంది.


సీట్ల కేటాయింపు ఇలా

వెంకటగిరి ఐఐహెచ్‌టీలో 66 సీట్లు ఉన్నాయి. వీటిలో ఏపీ విద్యార్థులకు 53 సీట్లు కేటాయించారు. తమిళనాడుకు నాలుగు, కేరళకు మూడు, కర్ణాటకకు మూడు, మహారాష్ట్రకు రెండు, పుదుచ్చేరికి ఒక సీటు చొప్పున కేటాయించారు. దేశంలో 11 సంస్థలు ఉండ గా ఒక్క వెంకటగిరి సంస్థలో మాత్రమే అప్పెరల్‌ గార్మెంట్స్‌ తయారీ సాంకేతికత కోర్సు అందుబాటు లో ఉంది. దీనిలోనూ అభ్యర్థులకు మూడేళ్లపాటు శిక్షణ ఇస్తున్నారు. 3 సంవత్సరాల డీహెచ్‌టీటీ కోర్సులో ఇంటర్‌(ఎంపీసీ), ఇంటర్‌ ఒకేషనల్‌(టెక్స్‌టైల్స్‌), ఐటీఐ(2 సంవత్సరాలు) కోర్సులలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు నేరుగా రెండో సంవత్సరంలో చేరడానికి అవకాశం ఉంది. ఈ సంస్థలో మూడేళ్లపాటు శిక్షణ పూర్తి చేసి డిప్లొమా సర్టిఫికెట్‌ అందుకున్న అభ్యర్థులకు వంద శాతం ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. చేనేత, జౌళిశాఖ అనుబంధ సంస్థ ఆప్కో, లాయల్‌ టెక్స్‌టైల్స్‌, బీజే టెక్స్‌టైల్స్‌, వైజాగ్‌లో బ్రాండింగ్‌, గుంటూరులో ఎస్‌ఎస్ఎల్‌ టెక్స్‌టైల్స్‌, హిందూపురం వద్ద శ్రీకాటన్‌ మిల్స్‌లో ఉద్యోగ అవకాశాలతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు పొందే అవకాశాలు ఉన్నాయి.


15 వరకు దరఖాస్తులకు..

ఈ ఏడాది దరఖాస్తులను ఈ నెల 15వ తేదీ వరకు స్వీకరిస్తారు. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ ఐఐహెచ్‌టీవీజీఆర్‌.కామ్‌, ఫోన్‌ నెంబర్లు 93999 36872, 98661 69908, 90102 43054లో సంప్రదించవచ్చు.

20 వేల ప్రారంభ వేతనం

‘‘వెంకటగిరిలోని ఐఐహెచ్‌టీలో డిప్లొమా పూర్తిచేసిన ప్రతి ఒక్కరికీ వెంటనే ఉద్యోగం లభిస్తుంది. ఇప్పటి వరకు మా సంస్థలో 33 బ్యాచ్‌లలో 1,170 మంది అభ్యర్థులు డిప్లొమా పూర్తి చేశారు. ప్రస్తుతం వివిధ స్థాయిలలో ఉద్యోగాలు చేస్తున్నారు. కోర్సు పూర్తిచేశాక అప్రెంటీ్‌సషిప్‌ స్థాయిలో సుమారు రూ.20 వేలు, ఆ తర్వాత రూ.30 వేల నుంచి రూ.50 వేలకుపైగా వేతనం పొందే అవకాశాలు ఉన్నా యి.’’

- శ్రీకాంత్‌ ప్రభాకర్‌, ప్రిన్సిపాల్‌

Updated Date - Jun 08 , 2026 | 04:50 AM