Share News

‘వన్‌’వేలో వస్తే వాహనం సీజ్‌!

ABN , Publish Date - May 11 , 2026 | 01:13 AM

- బెంజి సర్కిల్‌ కూడలి వద్ద స్క్యూబ్రిడ్జి వైపు వెళ్లే వాహనాలకు గ్రీన్‌సిగ్నల్‌ పడింది. దీంతో వాహనాలన్నీ ఒక్కసారిగా ముందుకు కదిలాయి. ఇక్కడ ఆంజనేయస్వామి ఆలయం దాటగానే వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. దీనికి ప్రధాన కారణం పటమటలంకలో ఉన్న అండర్‌ పాస్‌ మార్గం నుంచి ద్విచక్రవాహనదారులు వన్‌వే వ్యతిరేక మార్గంలో రావడమే. వీటిపై పోలీస్‌ అధికారులు దృష్టి సారించారు. వన్‌వే ఉల్లంఘనలపై కఠిన చర్యలు ఆరంభించారు.

‘వన్‌’వేలో వస్తే వాహనం సీజ్‌!

పోలీసుల కొత్త నిర్ణయం

నగరంలో పెరుగుతున్న వన్‌వే ఉల్లంఘనలు

రోజుకు 100కి పైగా జరిమానాలు

- బెంజి సర్కిల్‌ కూడలి వద్ద స్క్యూబ్రిడ్జి వైపు వెళ్లే వాహనాలకు గ్రీన్‌సిగ్నల్‌ పడింది. దీంతో వాహనాలన్నీ ఒక్కసారిగా ముందుకు కదిలాయి. ఇక్కడ ఆంజనేయస్వామి ఆలయం దాటగానే వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. దీనికి ప్రధాన కారణం పటమటలంకలో ఉన్న అండర్‌ పాస్‌ మార్గం నుంచి ద్విచక్రవాహనదారులు వన్‌వే వ్యతిరేక మార్గంలో రావడమే. వీటిపై పోలీస్‌ అధికారులు దృష్టి సారించారు. వన్‌వే ఉల్లంఘనలపై కఠిన చర్యలు ఆరంభించారు.

(ఆంధ్రజ్యోతి - విజయవాడ):

కనకదుర్గ వారధి మూడు జాతీయ రహదారుల కూడలి. పీఎన్‌బీఎస్‌ నుంచి బెంజిసర్కిల్‌ వచ్చే మార్గంలో వారధి వద్ద ఉన్న ఐలాండ్‌ దాటిన తర్వాత మసీదు దగ్గర గుండెలు గుప్పెట్లో పెట్టుకోవాల్సి వస్తోంది. పశువుల ఆసుపత్రి నుంచి నేతాజీ వంతెన మీదుగా కృష్ణలంక వెళ్లాల్సిన వాహనదారులు ఎడమ వైపునకు తిరిగి బాలాజీ నగర్‌ వద్ద యూ టర్న్‌ తీసుకోవాలి. వంతెన దాటగానే వాహనదారులు కుడివైపునకు తిరిగి వన్‌వేకు వ్యతిరేక మార్గంలో వారధి కింద ఉన్న ఐలాండ్‌ వద్ద మలుపులు తీసుకుంటున్నారు. మసీదు రోడ్డు ఇరుకుగా ఉండడంతో వ్యతిరేక మార్గంలో వచ్చే వాహనాలతో బెంజ్‌సర్కిల్‌ వైపు వచ్చే వాహనదారులు భయపడాల్సి వస్తోంది. విజయవాడ నగరంలో జరుగుతున్న వన్‌వే ఉల్లంఘనలకు ఈ రెండు ఉదాహరణలు. ఈ రెండే కాకుండా వన్‌వే ఉన్న అన్ని మార్గాల్లోను వాహనదారులు ఆ నిబంధనను ఉల్లంఘిస్తున్నారు. ఇక నుంచి వన్‌వే నిబంధనను ఉల్లంఘించిన వాహనాలను సీజ్‌ చేయాలని పోలీస్‌ అధికారులు నిర్ణయించారు. మొదటిసారి ఉల్లంఘనకు జరిమానా విధిస్తారు. రెండోసారి మళ్లీ అదేవిధంగా చేస్తే మాత్రం వాహనాన్ని ట్రాఫిక్‌ పోలీసులు స్వాధీనం చేసుకుంటారు. నగరంలో వన్‌వే నిబంధనల ఉల్లంఘన వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుండడంతో పోలీసులు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. నగరంలో వ్యతిరేక దిశలో వేగంగా ప్రయాణిస్తూ ఇతర వాహనదారులను, పాదచారులను అపాయంలో పడేస్తున్నారు. తప్పు చేసినా ప్రమాదాలు జరిగిన తర్వాత ఎదుటవారిపై తిరగబడి యుద్ధం చేస్తున్నారు.

నిత్యం ఎన్‌ఫోర్స్‌మెంట్‌

విజయవాడలో మొత్తం ఆరు ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్లు ఉన్నాయి. ఆయా స్టేషన్ల పరిధిలో ఇన్‌స్పెక్టర్లు, ఆర్‌ఎస్‌ఐలు, ఇతర సిబ్బంది నిత్యం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ నిర్వహిస్తున్నారు. ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధిస్తున్నారు. వన్‌వే నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి నిత్యం 100 జరిమానాలు విధిస్తున్నారు. ఈ నిబంధన ఉల్లంఘనకు రూ.1000 జరిమానా వేస్తున్నారు. ఎక్కువగా ద్విచక్ర వాహనదారులు ఈ నిబంధనను ఉల్లంఘిస్తున్నారు. తర్వాతి స్థానంలో ఆటోలు, కారులు ఉన్నాయి. ఈ వాహనదాలు వన్‌వేకు వ్యతిరేక మార్గంలో ప్రయాణించడం వల్ల ఎదురుగా వేగంగా వస్తున్న వాహనదారులు నియంత్రణ కోల్పోతున్నారు. ఫలితంగా ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఒక్కోసారి పాదచారులు ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో పోలీస్‌ అధికారులు ఈ విషయంలో కాస్త కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. వన్‌వే ట్రాఫిక్‌ను మొదటిసారి ఉల్లంఘిస్తే జరిమానా విధించి, రెండోసారి అదే తప్పు చేస్తే వాహనాన్ని సీజ్‌ చేయాలని నిర్ణయించారు.

ఉల్లంఘనలు విద్యుత షాక్‌తో సమానం

నగరంలో ట్రాఫిక్‌ ఉల్లంఘనలను వాహనదారులు నేరంగా భావించడం లేదు. జరిమానా చెల్లించేసి చేతులు దులిపేసుకుంటున్నాం అనుకుంటున్నారు. ట్రాఫిక్‌ ఉల్లంఘనలు విద్యుత షాక్‌ లాంటివి. విద్యుత షాక్‌ ఎప్పుడు ప్రాణం తీస్తుందో తెలియదు. అదేవిధంగా వాహనదారులు చేస్తున్న ఉల్లంఘనలు ఎదుటి వారి ప్రాణాలను అపాయంలో పడేస్తాయి. ఈ విషయాన్ని వాహనదారులంతా దృష్టిలో పెట్టుకోవాలి. ట్రాఫిక్‌ నిబంధనలపై ప్రతి వాహనదారుడు అవగాహన పెంచుకోవాలి.

- రామచంద్రరావు, ట్రాఫిక్‌ ఏసీపీ

Updated Date - May 11 , 2026 | 01:13 AM