కృష్ణానదిపై ఐకానిక్ వంతెన
ABN , Publish Date - Mar 06 , 2026 | 11:12 PM
ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దుల్లోని కృష్ణానదిపై నిర్మించనున్న ఐకానిక్ సస్పెన్షనబుల్ కేబుల్ బ్రిడ్జి నిర్మాణానికి కీలకమైన అడుగు పడింది.
అటవీ భూమి మళ్లింపునకు కేంద్రం అనుమతి
త్వరలోనే ప్రారంభం కానున్న పనులు
తిరుపతి - హైదరాబాద్ తగ్గనున్న ప్రయాణ భారం
ఆత్మకూరు, మార్చి 6(ఆంధ్రజ్యోతి): ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దుల్లోని కృష్ణానదిపై నిర్మించనున్న ఐకానిక్ సస్పెన్షనబుల్ కేబుల్ బ్రిడ్జి నిర్మాణానికి కీలకమైన అడుగు పడింది. తిరుపతి - హైదరాబాద్ మధ్య ప్రయాణ దూరాన్ని తగ్గించాలన్న ఉద్దేశంతో 2020లో కల్వకుర్తి నుంచి జమ్ములమడుగు వరకు ఎనహెచ-167కే జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందుకోసం రూ.800కోట్ల నిధులను సైతం విడుదల చేసి రహదారి విస్తరణ పనులను వేగవంతం చేసింది. ఈక్రమంలోనే ఎనహెచ- 167కే రహదారికి అనుసంధానంగా ఆంధ్రలోని సంగమేశ్వరం, తెలం గాణలోని సోమేశ్వరం కలుపుతూ కృష్ణానదిపై ప్రపంచంలోనే రెండవ, దేశంలోనే తొలి ఐకానిక్ సస్పెన్షనల్ కేబుల్ బ్రిడ్జి నిర్మించా లని నిర్ణయించింది. ఇందుకు రూ.1082.56కోట్లతో ప్రతిపాదనలను తయారు చేసి తొలివిడతగా రూ.436కోట్లను జాతీయ రహదారుల, రోడ్డు రవాణాశాఖ విడుదల చేసింది.
ఎట్టకేలకు అటవీ భూమిని..
ఈ వంతెన నిర్మాణం 30నెలల్లోనే జరగాల్సి ఉండగా తెలంగాణ రాష్ట్రంలోని నాగర్‌కర్నూలు జిల్లా అటవీశాఖకు చెందిన 24.66 (60ఎకరాల) భూమి సేకరణ అవసరం కానుండటంతో అక్కడ జాతీ య రహదారి విస్తరణ పనులకు అంతరాయం ఏర్పడింది. ఎట్టకేలకు అటవీ భూమిని మళ్లించేందుకు కేంద్ర పర్యావరణ, అటవీ, వాతా వరణ మార్పు మంత్రిత్వశాఖ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. ఫిబ్రవరి ఆఖరి వారంలో చెన్నైలోని కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ ప్రాంతీయ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో స్టేజ్-1 స్థాయిలో అటవీ అనుమతులు లభించాయి.
పడవ ప్రయాణాలను నివారించొచ్చు
ప్రస్తుతం కొత్తపల్లి మండలంలోని సంగమేశ్వరం నుంచి ఆత్మకూ రు మీదుగా నంద్యాల వరకు ఎనహెచ-167కే విస్తరణ పనులు జరు గుతున్నాయి. తెలంగాణ పరిధిలోని అటవీ భూముల మళ్లింపునకు అనుమతులు రావడంతో ఐకానిక్ వంతెన నిర్మాణ పనులు కూడా త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇది పూర్తయితే తిరుపతి - హైదరాబాద్ నగరాల నడుమ ప్రయాణ భారం సుమారు 80 కిమీల తగ్గుతుంది. తెలుగు రాష్ట్రాల మధ్య ప్రమాదకర పడవ ప్రయాణాలను నివారించొచ్చు. కల్వకుర్తి-జమ్ములమడుగు హైవే నిర్మాణంతో కొత్తపల్లి మండలంలోని పలు ప్రాంతాలు ఆర్థికంగా, పర్యాటకంగా అభివృద్ధి చెందే అవకాశాలున్నాయి.