విశాఖకు మళ్లీ ఐబీఎం
ABN , Publish Date - Feb 12 , 2026 | 02:14 AM
ఐటీ దిగ్గజ కంపెనీ ఐబీఎం మళ్లీ విశాఖపట్నంలో కార్యకలాపాలు నిర్వహించాలని నిర్ణయించింది. అందుకు అవసరమైన భూమి కోసం అన్వేషిస్తోంది....
భూమి కోసం అన్వేషణ
తాత్కాలిక కార్యకలాపాల కోసం ఐస్ర్పౌట్‌లో కో వర్కింగ్ స్పేస్ తీసుకునే అవకాశం..!
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
ఐటీ దిగ్గజ కంపెనీ ఐబీఎం మళ్లీ విశాఖపట్నంలో కార్యకలాపాలు నిర్వహించాలని నిర్ణయించింది. అందుకు అవసరమైన భూమి కోసం అన్వేషిస్తోంది. రాజధాని అమరావతిలో ఏర్పాటు చేస్తున్న క్వాంటమ్ వ్యాలీలోనూ ఐబీఎం కీలకంగా వ్యవహరిస్తోంది. ఐటీ మంత్రి లోకేశ్‌తో చర్చల సమయంలో విశాఖలో కూడా ఓ కార్యాలయం ఏర్పాటు చేయాలని ఆయన కోరడంతో సూత్రప్రాయంగా అంగీకరించింది. దానికోసం భూమిని కేటాయించాలని కోరింది. ఈ నేపథ్యంలో విశాఖలో అనువైన ప్రదేశాన్ని చూసుకోవడానికి ఐబీఎం ప్రతినిధులు కూడా నగరానికి వచ్చి వెళ్లారు. సుమారు 20 ఎకరాలు కోరుతున్నట్టు జిల్లా అధికారుల సమాచారం.
విశాఖకు పాత చుట్టమే
ఐబీఎం 2011లోనే విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్ ఏర్పాటు చేసింది. రుషికొండ ఐటీ హిల్ నంబర్ 3పై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కెనెక్సా ఐటీ కంపెనీకి 25 ఎకరాలు కేటాయించారు. ఆ సంస్థ కొన్నాళ్లు నడిపి ఆ తర్వాత దాన్ని ఐబీఎంకు విక్రయించింది. అయితే.. ఎకరాకు 100 మంది చొప్పున 25 ఎకరాలకు 2,500 మందికి ఉద్యోగాలు ఇవ్వాలనే నిబంధన ఉంది. దాని గురించి ఏపీఐఐసీ అధికారులు ప్రశ్నించగా.. తమకు 25 ఎకరాలు అవసరం లేదని, అంతమందికి ఉద్యోగాలు ఇవ్వలేమని పేర్కొంటూ అందులో 21.8 ఎకరాలను వెనక్కి ఇచ్చేసింది. ఆ తర్వాత హుద్‌హుద్ తుఫాన్ సమయంలో ఐబీఎం కంపెనీ భవనం బాగా దెబ్బతింది. దాంతో చేతిలో ఉన్న 3.2 ఎకరాలను కూడా ఇన్ఫినిటీ సంస్థకు విక్రయించి విశాఖలో సెంటర్ మూసేసింది. ఇది జరిగి చాలాకాలమైంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం విశాఖలో ఓ కార్యాలయం ఏర్పాటు చేయాలని కోరడంతో తిరిగి ఇక్కడకు రావడానికి ప్రయత్నిస్తోంది. హిల్ నంబరు 3పై ఐబీఎం వెనక్కి ఇచ్చిన 21.8 ఎకరాలను ఇటీవల ప్రభుత్వం టీసీఎస్‌కు కేటాయించింది.
ఐస్ర్పౌట్ భవనంలో తాత్కాలిక కార్యాలయం..?
ఐస్ర్పౌట్ అనే సంస్థ విశాఖలో తన బ్రాంచి ఏర్పాటు చేయడానికి గతేడాది నవంబరులో జరిగిన పెట్టుబడిదారుల సదస్సులో ఒప్పందం చేసుకుంది. రుషికొండ ఐటీ పార్కులో వారికి ఆరు ఎకరాలు కేటాయిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. తాత్కాలిక కార్యాలయం కోసం విశాఖలోని ఇసుకతోట జంక్షన్‌లో ఉన్న లాన్సమ్ భవనంలో కొంత ఏరియాను అద్దెకు తీసుకున్నట్టు తెలిసింది. ఈ సంస్థ ఇతర కంపెనీలకు కో-వర్కింగ్ స్పేస్‌ను సమకూరుస్తుంది. అలాగే ఐబీఎంకు కూడా కో వర్కింగ్ స్పేస్ ఇవ్వడానికి చర్చలు జరుగుతున్నాయని సమాచారం.