Share News

ఆరోగ్య శాఖలో ఐఏఎస్‌ల కొరత

ABN , Publish Date - Mar 31 , 2026 | 04:59 AM

ఆరోగ్య శాఖను ఐఏఎస్‌ల కొరత వేధిస్తోంది. గతంలో ఎనిమిది ఐఏఎస్‌లతోపాటు ఒక ఐపీఎస్‌ అధికారి ఈ శాఖలో విధులు నిర్వహించేవారు. ఇప్పుడు ముగ్గురు ఐఏఎస్‌లు మాత్రమే ఉన్నారు.

ఆరోగ్య శాఖలో ఐఏఎస్‌ల కొరత

  • 8 మంది ఉండాల్సినచోట ముగ్గురే

  • ఒక్కొక్కరికి 2-3 విభాగాల బాధ్యతలు

  • పాలనా విభాగం అస్తవ్యస్తం

  • సెక్రటరీనే ఏపీఎంఎస్ఐడీసీ ఎండీ

  • బీఎ్‌ఫసీ చైర్మన్‌ కూడా ఆయనేశ్రీ

  • నిర్ణయం.. ఆమోదం.. అన్నీ ఆయనవే!

ఆరోగ్య శాఖ సెక్రటరీగా సౌరబ్‌ గౌర్‌ ఉన్నారు. ఏపీఎంఎస్‌ఐడీసీ ఎండీ కూడా ఆయనే. ఏపీఎంఎస్‌ఐడీసీ పిలిచే టెండర్లకు ఆమోదం తెలపడంతోపాటు మందుల కొనుగోలు, ఇతర వ్యవహారాలపై సమీక్షించేందుకు బిడ్‌ ఫైనలైజేషన్‌ కమిటీ (బీఎఫ్‌సీ) ఉంటుంది. ఆరోగ్య శాఖ సెక్రటరీ హోదాలో ఉన్న సౌరబ్‌ గౌరే ఈ కమిటీ చైర్మన్‌. అంటే ఏపీఎంఎస్‌ఐడీసీ ఎండీగా తాను తీసుకున్న నిర్ణయాలపై... బీఎఫ్‌సీ చైర్మన్‌గా ఆయనే ఆమోద ముద్ర వేసుకుంటారు. ఇక ఈ శాఖ నిర్ణయాల్లో పారదర్శకతను ఆశించవచ్చా? ఆరోగ్య శాఖలో పాలనా విభాగానికి పెద్ద జబ్బు చేసిందనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి?

(అమరావతి- ఆంధ్రజ్యోతి)

ఆరోగ్య శాఖను ఐఏఎస్‌ల కొరత వేధిస్తోంది. గతంలో ఎనిమిది ఐఏఎస్‌లతోపాటు ఒక ఐపీఎస్‌ అధికారి ఈ శాఖలో విధులు నిర్వహించేవారు. ఇప్పుడు ముగ్గురు ఐఏఎస్‌లు మాత్రమే ఉన్నారు. ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, సర్వీసెస్‌ కార్యదర్శి, ఆరోగ్య శాఖ కమిషనర్‌, ఏపీఎంఎస్ఐడీసీ ఎండీ, ఎన్టీఆర్‌ వైద్య సేవ ట్రస్ట్‌ సీఈవో, సెకండరీ హెల్త్‌ డైరెక్టర్‌, ఆయుష్‌ కమిషనర్‌, ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీ ఎండీ, ఐపీఎం డైరెక్టర్‌ పోస్టుల్లో ఐఏఎస్‌లు ఉండాలి. ఔషధ నియంత్రణ మండలి (డ్రగ్‌)కి ఒక ఐపీఎస్‌ అధికారి డీజీగా ఉండాలి. అయితే ప్రస్తుతం ఈ శాఖలో ఆరోగ్యశాఖ సెక్రటరీ సౌరబ్‌ గౌర్‌, కమిషనర్‌ వీరపాండియన్‌, సెకండరీ హెల్త్‌ డైరెక్టర్‌ చక్రధరబాబు మాత్రమే మిగిలారు. వీరు కాకుండా సచివాలయంలో జాయింట్‌ సెక్రటరీ స్థానంలో జూనియర్‌ ఐఏఎస్‌ అధికారి రోణంకి గోపాలకృష్ణ విధులు నిర్వహిస్తున్నారు. ప్రజారోగ్య శాఖలో ఉన్న తొమ్మిది పోస్టులను ఈ నలుగురు ఐఏఎస్‌లకు విభజించారు. ఆరోగ్యశాఖ సెక్రటరీగా ఉన్న సౌరబ్‌ గౌర్‌ డ్రగ్స్‌ డీజీగా, ఏపీఎంఎస్ఐడీసీఎండీగా అదనపు బాధ్యతలు చూస్తున్నారు. ఆరోగ్యశాఖ కమిషనర్‌గా ఉన్న వీరపాండియన్‌కు ఐపీఎం (ఫుడ్‌ సెఫ్టీ) డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. సెకండరీ హెల్త్‌ డైరెక్టర్‌ చక్రధర్‌బాబుకు ఎన్టీఆర్‌ వైద్య సేవ ట్రస్ట్‌ సీఈవోగా అదనపు బాధ్యతలు అప్పగించారు. జాయింట్‌ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్న రోణంకి గోపాలకృష్ణకు ఆయుష్‌ కమిషనర్‌తోపాటు ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీ ఎండీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఐఏఎస్‌ల కొరత కారణంగా ప్రజారోగ్య వ్యవస్థ పాలన పూర్తిగా గాడితప్పుతోంది. పాలనా విభాగం అస్తవ్యస్తంగా మారింది.


సీఎం హెచ్చరిస్తున్నా..!

ఒకవైపు సంజీవని, యూనివర్సల్‌ హెల్త్‌ స్కీమ్‌, హెల్త్‌ స్ర్కీనింగ్‌.. ఇలా ప్రభుత్వ ప్రాధాన్య పథకాలు కీలక దశలో ఉన్నాయి. సీఎం చంద్రబాబు సంజీవని, హెల్త్‌ ఇన్సూరెన్స్‌ విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులను హెచ్చరిస్తున్నారు. కానీ ఉన్నతాధికారుల కొరత వల్ల క్షేత్రస్థాయిలో ఫలితాలు ఆశించినవిధంగా లేవు. ఎన్టీఆర్‌ బేబీ కిట్స్‌ పథకాన్ని వెంటనే ప్రారంభించాలని సీఎం చంద్రబాబు ఆరు నెలల నుంచి చెబుతూనే ఉన్నా.. ఇప్పటి వరకూ ఆ పథకాన్ని ప్రారంభించలేదు. ప్రతి సమావేశంలో ఈ పథకం గురించి సీఎం ప్రశ్నిస్తూనే ఉన్నా అధికారుల నుంచి స్పందన లేదు.

అన్ని బాధ్యతలు ఆయనకే!

ఆరోగ్య శాఖలో కీలక విభాగాలు సెక్రటరీ సౌరబ్‌ గౌర్‌ వద్దనే ఉన్నాయి. తాజాగా మరికొన్ని విభాగాలకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ... ఆయనే ఉత్తర్వులు జారీ చేశారు. కీలకమైన ఏపీఎంఎస్ఐడీసీ విభాగాన్ని తన వద్దే ఉంచుకోవడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీఎంఎస్ఐడీసీ పిలిచే టెండర్లకు ఆమోదం తెలపడంతోపాటు మందుల కొనుగోలు, ఇతర వ్యవహారాలపై సమీక్షించేందుకు బీఎఫ్‌సీ ఉంటుంది. ఈ కమిటీకి చైర్మన్‌గా ఆరోగ్య శాఖ సెక్రటరీ హోదాలో సౌరబ్‌ గౌర్‌ ఉంటారు. బీఎ్‌ఫసీ చైర్మన్‌గా... ఏపీఎంఎస్ఐడీసీ తీసుకున్న నిర్ణయాలపై సమీక్షించాల్సిన ఆయనే దానికి ఎండీగా ఉంటే.. ఇక పారదర్శకత ఏముంటుందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Updated Date - Mar 31 , 2026 | 05:01 AM