Share News

వద్దన్నా వినలేదు...

ABN , Publish Date - Feb 22 , 2026 | 01:00 AM

డిజిటల్‌ అరెస్టు కాల్‌ వచ్చిన ఓ సీనియర్‌ సిటిజన్‌కు బ్యాంకర్లు, పోలీసులు పదేపదే అవగాహన కల్పించారు.. నేరం ఎలా జరుగుతుందో వివరించారు.. అయినా ఆయన సైబర్‌ నేరగాళ్లు ఇచ్చిన ఖాతాకు రూ.49 లక్షలు డబ్బులు జమ చేశాడు. ఇందుకోసం ఏకంగా మరో బ్యాంకులో కొత్త ఖాతాను కూడా తెరిచాడు. అంతా అయిపోయిన తర్వాత తాను మోసపోయానని సైబర్‌ పోలీసులను ఆశ్రయించాడు.

వద్దన్నా వినలేదు...

సైబర్‌ నేరగాళ్ల వలలో చిక్కి రూ.49 లక్షలు పోగొట్టుకున్న స్టీల్‌ ప్లాంట్‌ మాజీ ఉద్యోగి

బ్యాంకర్లు, పోలీసులు డిజిటల్‌ అరెస్టు లేదని చెప్పినా వినని వృద్ధుడు

మరో బ్యాంకులో ఖాతా తెరచి మరీ డబ్బులు జమ

ఆ తర్వాత మోసపోయానంటూ పోలీసులకు ఫిర్యాదు

డిజిటల్‌ అరెస్టు కాల్‌ వచ్చిన ఓ సీనియర్‌ సిటిజన్‌కు బ్యాంకర్లు, పోలీసులు పదేపదే అవగాహన కల్పించారు.. నేరం ఎలా జరుగుతుందో వివరించారు.. అయినా ఆయన సైబర్‌ నేరగాళ్లు ఇచ్చిన ఖాతాకు రూ.49 లక్షలు డబ్బులు జమ చేశాడు. ఇందుకోసం ఏకంగా మరో బ్యాంకులో కొత్త ఖాతాను కూడా తెరిచాడు. అంతా అయిపోయిన తర్వాత తాను మోసపోయానని సైబర్‌ పోలీసులను ఆశ్రయించాడు.

(ఆంధ్రజ్యోతి - విజయవాడ):

వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో కెమికల్‌ ఇంజనీర్‌గా పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన ఓ సీనియర్‌ సిటిజన్‌ విజయవాడ రామచంద్రనగర్‌లో స్థిరపడ్డాడు. ఆయన కొన్నేళ్ల క్రితం ఎస్‌బీఐలో రూ.75 లక్షలను ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేశాడు.

ఉగ్ర మూలాలు ఉన్నాయని బెదిరింపు కాల్‌

గత నెల 22న సైబర్‌ నేరగాళ్లు సీనియర్‌ సిటిజన్‌కు వీడియోకాల్‌ చేశారు. తాము టెలికం శాఖ నుంచి ఫోన్‌ చేస్తున్నామని, మీరు ఉపయోగిస్తున్న ఫోన్‌ నంబరు ఉగ్రవాదుల జాబితాలో ఉందని చెప్పారు. పోలీసులను లైన్‌లోకి తీసుకుంటామని చెప్పిన తర్వాత మరో వ్యక్తి కాల్‌లోకి వచ్చి అరెస్టు చేస్తామని బెదిరించారు. దీని నుంచి తప్పించుకోవాలంటే తాము చెప్పిన బ్యాంక్‌ ఖాతాలో డబ్బులు జమచేయాలని షరతు విధించారు. అదే రోజున బాధితుడు ఎస్‌బీఐకి వెళ్లి రూ.75లక్షల ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ను ఉపసంహరించుకుంటానని చెప్పాడు.

సైబర్‌క్రైం పోలీసులకు బ్యాంకు మేనేజర్‌ సమాచారం

ఒకేసారి మొత్తం డబ్బులు వితడ్రా చేస్తానని చెప్పడంతో బ్రాంచ్‌ మేనేజర్‌కు అనుమానం వచ్చింది. ఆయన వెంటనే సైబర్‌క్రైం పోలీసులకు సమాచారమిచ్చారు. ఎస్‌ఐ లోవరాజు బ్యాంక్‌కు వెళ్లి ఏం జరిగిందని తెలుసుకుని కౌన్సెలింగ్‌ ఇచ్చారు. ఎవరైనా డిజిటల్‌ అరెస్టు పేరుతో ఫోన్‌ చేశారా అని పలుమార్లు ప్రశ్నించి, అదంతా సైబర్‌ నేరమని వివరించారు. పోలీసులు, బ్యాంకర్లు ఎన్నిసార్లు అడిగినా అటువంటిదేమీ లేదని సీనియర్‌ సిటిజన్‌ సమాధానం ఇచ్చాడు. డబ్బులు పంపాలని బ్యాంక్‌లో సిబ్బందికి ఇచ్చిన ఖాతా నంబరును సాంకేతికంగా పరిశీలించగా అది కోల్‌కతాలో ఉన్నట్టు తేలింది.

కొత్త ఖాతా తెరచి మరీ..

ఈ నేరగాళ్లు అదే పనిగా ఫోన్లు చేస్తుండడంతో ఎఫ్‌డీని వితడ్రా చేయడానికి ఆయన పలుమార్లు బ్యాంక్‌కు వెళ్లాడు. బ్యాంక్‌ ఉద్యోగులు ఆర్థిక సంవత్సరం పూర్తయ్యే వరకు ఉంచమని విజ్ఞప్తి చేసేవారు. సైబర్‌ నేరగాళ్లు ఇచ్చిన ఖాతా నంబరును బ్యాంక్‌లో సిబ్బందికి ఇచ్చి ఆర్టీజీఎస్‌ ద్వారా నగదు బదిలీ చేయమని చెప్పినా చేసేవారు కాదు. ఇక ఈ బ్యాంక్‌లో పని కాదని భావించి కొత్తగా ఇండియన్‌ బ్యాంక్‌లో ఒక ఖాతాను తెరిచాడు. ఎస్‌బీఐలో ఉన్న ఎఫ్‌డీని దఫదఫాలుగా వితడ్రా చేశాడు. వితడ్రా ఎందుకు చేస్తున్నారని బ్యాంక్‌ సిబ్బంది అడిగితే బెంగళూరులో స్థలం కొనుగోలు చేస్తున్నానని చెప్పాడు. ఇలా రూ.49లక్షలను తీసి ఇండియన్‌ బ్యాంక్‌ ఖాతాలో జమ చేసుకున్నాడు. ఈ వితడ్రాల గురించి సైబర్‌ పోలీసులకు బ్యాంకర్లు సమాచారం ఇవ్వడంతో ఎస్‌ఐ లోవరాజు ఆయన ఇంటికి వెళ్లారు. డిజిటల్‌ అరెస్టు ఉందని ఫోన్లు చేసి ఎవరైనా బెదిరించారా అని ప్రశ్నిస్తే అటువంటి కాల్స్‌ను పట్టించుకోనని సమాధానం ఇచ్చాడు. ఈ నేరాలపై పూర్తి అవగాహన ఉందని ధైర్యంగా చెప్పాడు. ఆ కాల్స్‌ను వెంటనే బ్లాక్‌ చేస్తానని వివరించాడు. పెద్దమొత్తంలో డబ్బులు ఎందుకు వితడ్రా చేశారని ప్రశ్నిస్తే బ్యాంకర్లకు చెప్పిన కథే చెప్పాడు. బెంగళూరులో స్థలం కొనుగోలు చేస్తే ఖాతా నంబరు కోల్‌కతా లొకేషన్‌ ఎందుకు చూపిస్తుందని ఎస్‌ఐ అడిగితే సమాధానం దాటవేశాడు. సీనియర్‌ సిటిజన్‌ వాస్తవం చెప్పడం లేదని ఎస్‌ఐ గ్రహించి తిరిగి వచ్చేశారు. తర్వాత బాధితుడు తన ఫోన్‌ నుంచి 11న రూ.22 లక్షలు, 13న రూ.27లక్షలు ఆర్టీజీఎస్‌ ద్వారా ఈ నేరగాళ్ల ఖాతాలకు పంపాడు. ఆ తర్వాత మోసాన్ని గ్రహించిన బాధితుడు శుక్రవారం సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. డిజిటల్‌ అరెస్టుపై పదేపదే కౌన్సెలింగ్‌ చేసి, స్వయంగా ఇంటికి వెళ్లి అవగాహన కల్పించినా భారీ మొత్తంలో నగదును సైబర్‌ నేరగాళ్లకు సమర్పించడంపై పోలీసులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు బాధితుడ్ని ఎందుకిలా చేశారని ప్రశ్నిస్తే తన తలపై శని ఉందని సమాధానం చెప్పడం గమనార్హం.

Updated Date - Feb 22 , 2026 | 01:00 AM