Share News

YS Jagan: రాష్ట్రాభివృద్ధి నేనే చేశా!

ABN , Publish Date - Jan 09 , 2026 | 04:27 AM

రాష్ట్రంలో అభివృద్ధి అంతా తానే చేశానని మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ ప్రకటించుకున్నారు.

YS Jagan: రాష్ట్రాభివృద్ధి నేనే చేశా!

పరిశ్రమలు తెచ్చా.. అప్పులు చేసి సంక్షేమాన్ని అందించా: జగన్‌

అమరావతి, జనవరి 8(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అభివృద్ధి అంతా తానే చేశానని మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ ప్రకటించుకున్నారు. తన పాలనా కాలంలో భారీ పరిశ్రమలు తెచ్చానని.. అప్పులు చేసి సంక్షేమం అందించానన్నారు. భోగాపురం విమానాశ్రయమూ నిర్మించానని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాయలసీమకు ద్రోహిగా అభివర్ణించారు. సీమ మొత్తానికీ ప్రయోజనం కలిగించే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపేసిన రాక్షసుడని.. రాష్ట్రానికి విలన్‌ అని.. అసలు మనిషే కాదని విమర్శించారు. గురువారం తాడేపల్లి ప్యాలె్‌సకు తనకు అనుకూలంగా ఉండే మీడియా ప్రతినిధులను జగన్‌ పిలిపించుకున్నారు. సుదీర్ఘంగా మాట్లాడారు. చంద్రబాబుపై ఏకవచన ప్రయోగంతో చెలరేగిపోయారు. శ్రీశైలం జలాశయం నుంచి 800 అడుగుల నుంచే రోజుకు మూడు టీఎంసీల కృష్ణా జలాలను అందించే సీమ ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేశాడని.. క్లోజ్డ్‌ రూమ్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో ఆయన సమావేశమై ఈ పథకాన్ని ఆపేసేందుకు కుట్ర పన్నాడని ఆరోపించారు. ఈ ప్రాజెక్టు కోసం త్వరలోనే భారీ ఆందోళన చేపడతానన్నారు. ఈ స్కీం ద్వారా శ్రీశైలం జలాశయం నుంచి 800 అడుగుల నుంచే రోజుకు మూడు టీఎంసీల చొప్పున తీసుకోవచ్చన్నారు. కృష్ణా జలాల్లో 120 టీఎంసీలు వాడుకునే హక్కు ఏపీకి ఉందన్నారు.


తద్వారా రాష్ట్రానికి నీటి కేటాయింపులపై ఆయనకు ఏ మాత్రం అవగాహన లేదని తేలిపోయింది. నదీ జలాలను ప్రాజెక్టుల వారీగా కేటాయిస్తారన్న సత్యాన్ని చెప్పకుండా.. ఒక తూము తవ్వేసి కృష్ణా జలాలను తరలించుకుపోతామంటే కృష్ణా బోర్డు, ట్రైబ్యునళ్లు, న్యాయస్థానాలు అంగీకరిస్తాయా? సీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రకటించిన 15 రోజులకే దానిని నిలిపివేయడం ఆయనకు తెలియదా? ఆ స్టేను ఎత్తివేయించేందుకు సీఎంగా మూడున్నరేళ్లలో ఒక్క ప్రయత్నమూ చేయకపోవడం ఆయన చిత్తశుద్ధిని చాటుతోందని నిపుణులు అంటున్నారు. రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయి మరో సోమాలియా కానుందని జగన్‌ అన్నారు. తాను సంక్షేమ పథకాల అమలుకు క్యాలెండర్‌ విడుదల చేస్తే.. చంద్రబాబు అప్పులు తేవడానికి క్యాలెండర్‌ను విడుదల చేశారని ధ్వజమెత్తారు. ఒకట్రెండు పేరున్న కంపెనీలకు 99 పైసలకే ఎకరా కేటాయించి.. తెరవెనుక ఊరూపేరూలేని బినామీ కంపెనీలకు కూడా భూములు కట్టబెడుతున్నారని.. రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలకూ భూములు, రాయితీలిస్తున్నారని ఆరోపించారు. పీపీపీ విధానంలో ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల నిర్మాణానికి పిలిచిన టెండర్లలో ఎవరూ పాల్గొనకపోతే రాష్ట్రానికి మంచిదేనని చెప్పారు. పారిశ్రామికవేత్తల నుంచి చంద్రబాబు కమీషన్లు తీసుకుంటున్నారని ఆరోపించారు.

Updated Date - Jan 09 , 2026 | 04:27 AM