శిశువుల్లో హైడ్రోనెఫ్రోసిస్.. పూర్తిగా నయం
ABN , Publish Date - Jun 26 , 2026 | 05:38 AM
‘‘గర్భిణీ అల్ట్రాసౌండ్ స్కానింగ్ రిపోర్టులో.. గర్భస్థ శిశువుల్లో మూత్రపిండాల వాపు కనిపిస్తోంది. ఇది హైడ్రోనెఫ్రోసిస్ వ్యాధని వైద్యులు చెప్పగానే కాబోయే తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతుంటారు.
అధునాతన చికిత్సతో మెరుగైన ఫలితాలు
పీడియాట్రిక్ సర్జన్ డాక్టర్ యర్రా రాజేశ్ వెల్లడి
పారిస్ సదస్సులో ‘యర్రా’ పరిశోధన పత్రం
గుంటూరు మెడికల్, జూన్ 25 (ఆంధ్రజ్యోతి): ‘‘గర్భిణీ అల్ట్రాసౌండ్ స్కానింగ్ రిపోర్టులో.. గర్భస్థ శిశువుల్లో మూత్రపిండాల వాపు కనిపిస్తోంది. ఇది హైడ్రోనెఫ్రోసిస్ వ్యాధని వైద్యులు చెప్పగానే కాబోయే తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతుంటారు. అయితే.. అధునాతన వైద్య సాంకేతికతతో ఈ వ్యాధిని పూర్తిగా నయం చేసే శస్త్రచికిత్సలు, మందులతో తగ్గించే వైద్య ప్రక్రియలు అందుబాటులోకి వచ్చాయి’’ అని ప్రముఖ పీడియాట్రిక్ సర్జన్ డాక్టర్ యర్రా రాజేశ్ వెల్లడించారు. ముఖ్యంగా చిన్న గాటుతో చేసే శస్త్రచికిత్సతో నూరు శాతం చికిత్స విజయవంతం అవుతుందని చెప్పారు. ఈ మేరకు ఆయన సమర్పించిన వైద్య పరిశోధనకు అంతర్జాతీయ వైద్యవర్గాల నుంచి ప్రశంసలు దక్కాయి. ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో ఈ నెల 17 నుంచి 20వ తేదీ వరకు జరిగిన ‘యూరోపియన్ సొసైటీ ఫర్ పీడియాట్రిక్ యూరాలజీ కాంగ్రెస్ వైద్య సదస్సు’లో ఆయన పాల్గొన్నారు. ఈ అంతర్జాతీయ సదస్సు విశేషాలను గుంటూరులో ఆయన విలేకరులకు వివరించారు. ప్రపంచవ్యాప్తంగా 600 మంది పీడియాట్రిక్ యూరాలజిస్టులు పాల్గొన్న ఈ సదస్సులో వందల కొద్దీ వైద్య పరిశోధన పత్రాలు వచ్చాయి. వాటిలో పిల్లల్లో పుట్టుకతోనే వచ్చే మూత్రపిండాల వాపు (హైడ్రోనెఫ్రోసిస్) అనే అంశంపై రాజేశ్ సమర్పించిన వైద్య పరిశోధన పత్రం ఎంపికైంది. దీనిపై వైద్యనిపుణులు చర్చించారు. 2008 నుంచి 2025 నవంబరు వరకు గుంటూరులోని యర్రా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో సుమారు 1,100 మంది చిన్నారులకు అందించిన హైడ్రోనెఫ్రోసిస్ చికిత్సలు, వాటి ఫలితాలను ఆయన ఇందులో పొందుపర్చారు. హైడ్రోనెఫ్రోసి్‌సను సరైన సమయంలో గుర్తించి తగిన చికిత్స అందిస్తే పూర్తిగా తగ్గిపోతుందన్నారు. 20 శాతం మందికి మందులతో నయం అవుతుందని, మిగిలిన 80 శాతం మంది పిల్లలకు చిన్నగాటుతో శస్త్రచికిత్స చేసి పూర్తిగా నయం చేయవచ్చని తెలిపారు.