సొంతూరికి చలో చలో!
ABN , Publish Date - Oct 19 , 2026 | 04:05 AM
దసరా పండుగను సొంతూరిలో జరుపుకునేందుకు హైదరాబాద్ నుంచి భారీగా ప్రయాణికులు తరలివస్తున్నారు. దీంతో ప్రధాన రహదారులన్నీ రద్దీగా మారాయి. బస్సులు, రైళ్లు కిక్కిరిసిపోతున్నాయి.

దసరా పండుగకు హైదరాబాద్ నుంచి తరలిన జనం
జాతీయ రహదారులపై బారులు తీరిన వాహనాలు సొంతూరికి చలో చలో!
హైదరాబాద్‌లోని బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు కిటకిట
హైదరాబాద్, అక్టోబరు 18(ఆంధ్రజ్యోతి): దసరా పండుగను సొంతూరిలో జరుపుకునేందుకు హైదరాబాద్ నుంచి భారీగా ప్రయాణికులు తరలివస్తున్నారు. దీంతో ప్రధాన రహదారులన్నీ రద్దీగా మారాయి. బస్సులు, రైళ్లు కిక్కిరిసిపోతున్నాయి. ఆదివారం హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలు బారులు తీరాయి. సాధారణ రోజుల్లో చౌటుప్పల్ మండలంలోని పంతంగి టోల్‌గేట్ నుంచి దాదాపు 38 వేల వరకూ వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. అయితే ఆదివారం ఈ సంఖ్య 51 వేలు దాటింది. హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్, జూబ్లీ బస్టాండ్‌లు, రైల్వేస్టేషన్‌లు ప్రయాణికులతో కిక్కిరిశాయి. రద్దీకి తగినట్లు బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు గంటల తరబడి ఎదురు చూశారు. ఆదివారం రాత్రి 8 గంటల వరకు రెగ్యులర్ సర్వీసులతో పాటు వెయ్యికి పైగా ప్రత్యేక సర్వీసులను ఏపీ, తెలంగాణ జిల్లాలకు నడిపినట్లు ఆర్టీసీ ఉన్నతాధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా, దసరా పండుగకు సొంతూళ్లకు వచ్చే ప్రయాణికులను దృష్టిలో ఉంచుకొని దాదాపు 5వేల ప్రత్యేక బస్సు సర్వీసులు నడపనున్నట్లు ఏపీఎ్‌సఆర్టీసీ ఇప్పటికే ప్రకటించింది. ఈ ప్రత్యేక బస్సుల్లో అదనపు చార్జీలు కాకుండా, ఆయా మార్గాల్లో రెగ్యులర్ సర్వీసుల్లో ఉన్న చార్జీలే వసూలు చేస్తారు.