విద్యుదాఘాతంతో గుడిసె దగ్థం
ABN , Publish Date - May 08 , 2026 | 11:45 PM
పట్టణంలోని గొల్లవీధిలో ఉన్న ఓ రేకుల గుడిసెలో షార్టు సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి గ్యాస్ సిలిండర్ పేలింది.
మంటల్లో సిలిండర్ పేలి ఇద్దరికి గాయాలు
రూ. 4 లక్షలకు పైగా నష్టం
కోడుమూరు రూరల్ మే 8 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని గొల్లవీధిలో ఉన్న ఓ రేకుల గుడిసెలో షార్టు సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటన శుక్రవారం జరిగింది. ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలు కాగా దాదాపు రూ. 4 లక్షలకు పైగా నష్టం వాటిల్లింది. శివమ్మ అనే మహిళకు చెందిన రేకుల గుడిసెలో ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో కుటుంబసభ్యులు కూలి పనులకు వెళ్లారు. విద్యుత షార్టు సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగడంతో చుట్టుపక్కల వారు ఆర్పే ప్రయత్నం చేశారు. అయితే మంటల ధాటికి గుడిసెలో గ్యాస్ సిలిండర్ పెద్ద శబ్దంతో పేలింది. దీంతో స్థానికులు భయభ్రాంతులకు గురై పరుగులు తీశారు. రేకుల గుడిసె నేలమట్టమయ్యింది. ఇదే సమయంలో పక్కనున్న కొబ్బరి చెట్టు, గడ్డివాములపైకి మంటలు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను ఆర్పివేశారు. సిలిండర్ పేలిన సమయంలో అగ్నికీలలు తాకి రాముడు, చిట్టెమ్మ అనే ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం చిట్టెమ్మను 108 వాహనంలో కర్నూలు తరలించారు. స్థానికంగా ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాముడిని తహసీల్దార్ నాగరాజు, ఆర్‌ఐ అశోక్, వీఆర్వోలు ఎల్లప్ప, పరమేష్ పరామర్శించారు. అలాగే బాధిత కుటుంబాన్ని కలిసి ధైర్యం చెప్పారు. బియ్యం, బేడలు, ఆయిల్ సాయమందించారు. సర్వం కోల్పోయిన కుటుంబానికి ప్రభుత్వ సాయం అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.