శవాలపై కాసుల వేట
ABN , Publish Date - Apr 15 , 2026 | 01:13 AM
- నగరానికి చెందిన ఓ యువకుడు ద్విచక్ర వాహనంపై వెళ్తూ ప్రమాదానికి గురయ్యాడు. ఆస్పత్రికి తీసుకెళ్లేసరికే మృతి చెందాడు. అతని మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహిస్తే మద్యం తాగినట్టు నిర్ధారణ అయింది. మద్యం తాగి వాహనం నడిపినట్టు రిపోర్ట్ ఇస్తే తమకు ప్రభుత్వం, ఇన్సూరెన్స్ నుంచి రావాల్సిన డబ్బులు కూడా రావని కుటుంబ సభ్యులు అక్కడి సిబ్బంది, పోలీసులను వేడుకున్నారు. ఇదే అదనుగా భావించిన వారు మృతుని కుటుంబ సభ్యుల నుంచి రూ.50వేలు డిమాండ్ చేశారు. తాము అంత ఇచ్చుకోలేమని చెప్పగా.. మరో వ్యక్తి మధ్యవర్తిత్వం ద్వారా రూ.30 వేలకు ఒప్పందం కుదిరింది. దీంతో యువకుడు రోడ్డు ప్రమాదంలో మరణించినట్టు పోలీసులు పంచినామా రిపోర్టు ఇచ్చారు. ఇది పదిహేను రోజులు కిందట జరిగిన ఘటన.
- జీజీహెచ్ పోస్టుమార్టం సిబ్బంది, పోలీసుల బరి తెగింపు
- పోస్టుమార్టం చేసి, పంచనామా ఇవ్వడానికి అడిగినంత ఇవ్వాల్సిందే..
- మద్యం తాగి ప్రమాదాల్లో మరణించిన కేసుల్లో మరింత డిమాండ్
- పేదలను సైతం వదలడంలేదని పలువురి ఆరోపణలు
- మానవత్వం అనే మాట మరిచారని మండిపాటు
- నగరానికి చెందిన ఓ యువకుడు ద్విచక్ర వాహనంపై వెళ్తూ ప్రమాదానికి గురయ్యాడు. ఆస్పత్రికి తీసుకెళ్లేసరికే మృతి చెందాడు. అతని మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహిస్తే మద్యం తాగినట్టు నిర్ధారణ అయింది. మద్యం తాగి వాహనం నడిపినట్టు రిపోర్ట్ ఇస్తే తమకు ప్రభుత్వం, ఇన్సూరెన్స్ నుంచి రావాల్సిన డబ్బులు కూడా రావని కుటుంబ సభ్యులు అక్కడి సిబ్బంది, పోలీసులను వేడుకున్నారు. ఇదే అదనుగా భావించిన వారు మృతుని కుటుంబ సభ్యుల నుంచి రూ.50వేలు డిమాండ్ చేశారు. తాము అంత ఇచ్చుకోలేమని చెప్పగా.. మరో వ్యక్తి మధ్యవర్తిత్వం ద్వారా రూ.30 వేలకు ఒప్పందం కుదిరింది. దీంతో యువకుడు రోడ్డు ప్రమాదంలో మరణించినట్టు పోలీసులు పంచినామా రిపోర్టు ఇచ్చారు. ఇది పదిహేను రోజులు కిందట జరిగిన ఘటన.
- నగరానికి చెందిన మరో వ్యక్తి విధులు ముగించుకుని ఇంటికి వస్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదానికి గురై మరణించాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉన్న కుమారుడు చనిపోవడంతో గుండెలు పగిలేలా తల్లిదండ్రులు ఏడుస్తుంటే ఆస్పత్రి సిబ్బంది పోస్టుమార్టం చేయడానికి రూ.5 వేలు డిమాండ్ చేశారు. పంచనామా ఇవ్వడానికి పోలీసులు మరో రూ.5 వేలు అడిగారు. పుట్టెడు దుఃఖంలో ఉన్న కుటుంబ సభ్యులు అంత ఇవ్వలేమని, రూ.7 వేలు ఇచ్చి పోస్టుమార్టం ప్రక్రియ పూర్తి చేసుకుని మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లారు. ఇది పది రోజుల కిందట జరిగింది.
ఇలా ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించడానికి ఆ విభాగంలో పనిచేసే ఉద్యోగులు, పోలీసులు ఇష్టారాజ్యంగా డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు తీవ్రస్థాయిలో వినిపిస్తున్నాయి. కుటుంబ సభ్యుడిని కోల్పోయిన బాధలో ఉన్న వారిని మానవత్వం లేకుండా రాబందుల్లా పీక్కు తింటున్నారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
(ఆంధ్రజ్యోతి - విజయవాడ):
విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం రోజుకు పది వరకు మృతదేహాలు వస్తాయి. వీటిలో ప్రమాదాల్లో మరణించిన వారు, ఆత్మహత్య చేసుకున్న వారే ఎక్కువ. మద్యం తాగి వాహన ప్రమాదాల్లో మరణించిన వారు కూడా ఉంటారు. పోస్టుమార్టం విభాగంలో విధులు నిర్వహించే సిబ్బంది, పోలీసులకు మచ్చుకైన మానవత్వం ఉన్నట్టు కనిపించదు. కుటుంబ సభ్యుడిని కోల్పోయిన బాధలో వారుంటే పోస్టుమార్టం చేయడానికి, పంచనామా రాయడానికి మాకు ఇంత కావాలని డిమాండ్ చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. వారు అడిగిన డబ్బు ఇవ్వకపోతే పోస్టుమార్టం సరిగా చేయకపోవడం, పంచనామాకు తిప్పించుకోవడం వంటివి చేస్తారని భయపడి అడిగినంత ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు. మృతదేహాన్ని ఆలస్యంగా తీసుకువచ్చిన సందర్భాల్లో శవాన్ని నిల్వ చేయడానికి వారికి కావాల్సిన వస్తువులు సమకూర్చడానికి అంటూ రకరకాల కారణాలు చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. పోస్టుమార్టం అనంతరం పంచనామా పోలీసులే ఇవ్వాలి. బీమా, పాలసీలు చేసిన వారికి పంచనామా ప్రమాణికంగా నగదు వస్తుంది. ఇటువంటి సందర్భాల్లో పంచనామా ఇవ్వడానికి పోలీసులు అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. మద్యం తాగి రోడ్డు ప్రమాదాల్లో మరణించిన కేసుల్లో అయితే నగదు డిమాండ్ మరింత ఉంటుందని పలువురు విమర్శిస్తున్నారు. పోస్టుమార్టం విభాగం వద్ద డబ్బుల వసూలుపై ఆ విభాగం అధికారి డాక్టర్ మహేశ్‌ను వివరణ కోరగా, పోస్టుమార్టం చేయడానికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరంలేదన్నారు. డబ్బులు ఎవరూ ఇవ్వవద్దని బోర్డులు కూడా ఏర్పాటు చేశామని చెప్పారు. ఇప్పటి వరకు ఎవరి నుంచి ఫిర్యాదు రాలేదన్నారు. ఫిర్యాదు వస్తే వెంటనే పరిశీలించి సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని వివరించారు.
చనిపోయిన వారికంటే వీరి బాధ ఎక్కువైంది
స్నేహితుడు చనిపోయాడని ఉదయం నుంచి బాధపడుతుంటే.. పోస్టుమార్టం చేసి మృతదేహాన్ని ఇవ్వడానికి అక్కడి సిబ్బంది, పోలీసులు నగదు డిమాండ్ చేస్తున్నారు. వీరు ప్రవర్తన చూసి మరింత బాధ కలిగింది. పేదలను కూడా వీరు వదలడం లేదు. అంత దయనీయంగా ఉంది ప్రభుత్వాస్పత్రిలోని మార్చురీ సిబ్బంది, పోలీసులు తీరు.
- రవి, మృతుని స్నేహితుడు