రైల్వే గేటును ఢీకొన్న భారీ క్రేన్
ABN , Publish Date - Feb 04 , 2026 | 11:20 PM
మండలంలోని కురిడి సమీపంలో గల రైల్వే గేటును బుధవారం మధ్యాహ్నం భారీ క్రేన్ ఢీకొంది
ధ్వంసమైన రెండు ద్విచక్ర వాహనాలు
డుంబ్రిగుడ, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి): మండలంలోని కురిడి సమీపంలో గల రైల్వే గేటును బుధవారం మధ్యాహ్నం భారీ క్రేన్ ఢీకొంది. ఈ సంఘటనలో రైల్వే గేటు ధ్వంసం కావడంతో పాటు రెండు ద్విచక్ర వాహనాలు నుజ్జయ్యాయి. దీనికి సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. రోడ్డు విస్తరణలో భాగంగా పనులు చేసేందుకు వస్తున్న భారీ క్రేన్ బ్రేకులు ఫెయిల్ కావడంతో వేసి ఉన్న రైల్వే గేటును ఢీకొంది. అలాగే ఎదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకువెళ్లడంతో అవి నుజ్జయ్యాయి. అయితే ఎవరికీ ఎటువంటి ప్రమాదం కాలేదు. కానీ రైల్వే గేటు ఇరువైపులా ట్రాఫిక్ నిలిచిపోయింది. రైళ్ల రాకపోకలకు రెండు గంటల పాటు అంతరాయం ఏర్పడింది. పోలీసులకు సమాచారం అందడంతో వారు వచ్చి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.