రాష్ట్రంలో 3.45 లక్షల మందికి హెచ్‌పీవీ వ్యాక్సిన్
ABN , Publish Date - Feb 26 , 2026 | 04:51 AM
రాష్ట్రంలో 14 సంవత్సరాలు నిండిన సుమారు 3.45 లక్షల మంది బాలికలకు ఉచితంగా హెచ్‌పీవీ (హ్యూమన్ పాపిలోమా వైరస్) వ్యాక్సిన్ ఇవ్వనున్నామని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ వెల్లడించారు.
తొలి విడతగా కేంద్రం నుంచి 1.90 లక్షల డోసులు
అమరావతి, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో 14 సంవత్సరాలు నిండిన సుమారు 3.45 లక్షల మంది బాలికలకు ఉచితంగా హెచ్‌పీవీ (హ్యూమన్ పాపిలోమా వైరస్) వ్యాక్సిన్ ఇవ్వనున్నామని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. గర్భాశయ ముఖద్వార (సర్వైకల్) క్యాన్సర్‌ను నివారించే ఈ వ్యాక్సిన్ పంపిణీ ఏర్పాట్లపై ఆయన ఉన్నతస్థాయి సమీక్ష చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఈనెల 28న ప్రధాని మోదీ రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారని, దీనికి అనుగుణంగా రాష్ట్రంలో జరిగే ప్రారంభ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారని తెలిపారు. రాష్ట్రంలో కోల్డ్ చైన్ సదుపాయం కలిగిన 1,683 ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించి సిబ్బందికి ఇప్పటికే శిక్షణ ఇచ్చామన్నారు. తొలి విడత కింద ఇప్పటికే కేంద్రం నుంచి 1,90,890 డోసుల వ్యాక్సిన్ రాష్ట్రానికి వచ్చిందని తెలిపారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. ‘‘బాలికలకు వ్యాక్సిన్ ఇచ్చే ముందు తల్లిదండ్రుల్లో ఒకరి సమ్మతి తప్పనిసరి. వ్యాక్సిన్ వేశాక సర్టిఫికెట్ ఇస్తారు. సుమారు మూడు నెలల పాటు ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతుంది. 14 ఏళ్లు నిండి 15 ఏళ్లలోపు కలిగిన బాలికలు రాష్ట్రంలో అత్యధికంగా కర్నూలు జిల్లాలో 23,957 మంది ఉన్నారు. తక్కువగా పోలవరం జిల్లాలో 2,777 మంది బాలికలు ఉన్నారు.
వ్యాక్సిన్ ఖరీదు రూ. 3,927
హెచ్‌పీవీ వ్యాక్సిన్ ఖరీదు రూ. 3,927. సింగిల్ డోస్ టీకా కార్యక్రమం 90 దేశాల్లో అమల్లో ఉంది. సర్వైకల్ క్యాన్సర్ 15 నుంచి 44 ఏళ్ల మహిళల్లో అధికంగా కనిపిస్తోంది. ఈ క్యాన్సర్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఏటా 6 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. దేశంలో ఎక్కువగా వెలుగు చూస్తున్న క్యాన్సర్లలో సర్వైకల్ క్యాన్సర్ రెండో స్థానంలో ఉంది’’ అని మంత్రి వివరించారు.