ముడుపులన్నీ ముకుందుడికే!
ABN , Publish Date - Jul 05 , 2026 | 04:12 AM
దేవుడి కోసం ఇచ్చిన సొమ్ము దేవుడికే చేరాలి! ఒక్కరూపాయి కూడా దారి మళ్లొద్దు! ఈ విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం అన్నిరకాల జాగ్రత్తలూ తీసుకుంటోంది.
శ్రీవారి ‘హుండీ’ అత్యంత భద్రం!
అడుగడుగునా పటిష్ఠ నిఘా.. నిశిత పర్యవేక్షణ
నిఘా నీడలో తిరుమల పరకామణిలో లెక్కింపు
విజిలెన్స్, సాంకేతిక పరిజ్ఞానంతో అక్రమాలకు చెక్
నైట్ విజన్, హై రెజల్యూషన్ సీసీ కెమెరాల ఏర్పాటు
మానవ ప్రమేయాన్ని తగ్గించేందుకు యాంత్రీకరణ,
కంప్యూటరీకరణ, డిజిటలైజేషన్, ఏఐతో సంస్కరణలు
‘అయోధ్య’ నేపథ్యంలో వెంకన్న హుండీపైనా చర్చ
‘‘అయోధ్యలో రాముడికి భక్తులు సమర్పించిన విరాళాలు పక్కదారి పట్టడమా! హుండీలో వేసిన కానుకలనే స్వాహా చేసేశారా! ఇంత ఘోరమా!’’... ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే చర్చ! అదే సమయంలో... తిరుమల వెంకన్న పరకామణిపైనా జాతీయ మీడియాలో చర్చ మొదలైంది. అయితే... శ్రీవారి కానుకల విషయంలో ఎలాంటి సందేహాలూ అక్కర్లేదని ఘంటాపథంగా చెప్పవచ్చు. ఇక్కడ భక్తితో ముడుపు కట్టి హుండీలో వేసే ప్రతి రూపాయీ గోవిందుడికే చేరుతుంది. భక్తజన సేవకే ఉపయోగపడుతుంది. తిరుమలలో హుండీ లెక్కింపు... పరకామణిలో తీసుకునే జాగ్రత్తలపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం...
తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించే కానుకల లెక్కింపు దగ్గర నుంచి వివిధ ట్రస్టులకు దాతలు ఇచ్చే విరాళాల స్వీకరణ వరకు టీటీడీ పూర్తి పారదర్శకత పాటిస్తోంది.
2025-26 ఆర్థిక సంవత్సరంలో శ్రీవారి హుండీ ద్వారా రూ.1,738 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ ఏడాది దాదాపు రూ.1,880 కోట్లు వస్తుందని అధికారులు అంచనా.
2025-26లో టీటీడీ ఆధ్వర్యంలోని వివిధ ట్రస్టులకు రూ.130 కోట్లు విరాళాలు అందగా, ఈ ఏడాదిలో రూ.140 కోట్లు వస్తాయని భావిస్తున్నారు.
వివిధ బ్యాంకుల్లో టీటీడీకి ప్రస్తుతం సుమారు రూ.17వేల కోట్ల నగదు డిపాజిట్లతో పాటు 12 వేల కిలోల బంగారం డిపాజిట్లు ఉన్నాయి.
(తిరుపతి టీటీడీ - ఆంధ్రజ్యోతి)
దేవుడి కోసం ఇచ్చిన సొమ్ము దేవుడికే చేరాలి! ఒక్కరూపాయి కూడా దారి మళ్లొద్దు! ఈ విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం అన్నిరకాల జాగ్రత్తలూ తీసుకుంటోంది.
హుండీలో పడిన కానుకలను పరకామణిలో లెక్కించి, ఆ మొత్తాన్ని బ్యాంకుల్లో డిపాజిట్ చేసే వరకూ... ప్రతిదశలో పటిష్ఠమైన వ్యవస్థ ఏర్పాటైంది. అత్యంత అరుదుగా పరకామణి లెక్కింపుల సమయంలో చిన్నచిన్న సంఘటనలు చోటుచేసుకున్న సందర్భాలూ ఉన్నాయి. కానీ... విజిలెన్స్ అధికారుల నిరంతర పర్యవేక్షణ, ప్రత్యేక శ్రద్ధ, సాంకేతిక పరిజ్ఞానం నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు.

పక్కాగా లెక్కింపులు
శ్రీవారి ఆలయం నుంచి నిండిన హుండీలను గుడి నుంచి బయటికి తీసుకొచ్చి... కొండపైనే ఉన్న పరకామణి కార్యాలయానికి చేర్చి... లెక్కింపు తర్వాత బ్యాంకు అధికారులకు అప్పగించే వరకు ప్రతి దశా పక్కాగా జరుగుతుంది. దీనిని టీటీడీ విజిలెన్స్ విభాగం పూర్తిస్థాయిలో పర్యవేక్షిస్తుంది. కరెన్సీ పరకామణి ప్రాంగణంలో విజిలెన్స్ విభాగం ఒక జనరల్ డైరీ, హుండీ మూవ్‌మెంటు రిజిస్టర్ నిర్వహిస్తుంది. లెక్కింపు గదులు, కానుకలను వేరుచేసే ప్రాంతాలు, స్ర్టాంగ్ రూంలు, లోపలికి వచ్చే, బయటకు వెళ్లే పాయింట్లపై సీసీటీవీ పర్యవేక్షణ ఉంటుంది. కరెన్సీ లెక్కింపు, విదేశీ కరెన్సీ వర్గీకరణ, బంగారం, వెండి వస్తువుల నిర్వహణ వంటి అత్యంత విలువైన ప్రక్రియలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. నిర్దేశిత రిజిస్టర్‌లో సీలు నంబర్లు, తేదీ, సమయాన్ని నమోదు చేస్తూ సరైన పద్ధతిలో సీలు వేసేలా చూస్తారు. సిబ్బందికి, పరకామణి సేవలో పాల్గొనే వారికి ప్రత్యేకమైన నిబంధనలు అమలు చేస్తారు.
హైకోర్టు ఆదేశాలతో సంస్కరణలు
2023 ఏప్రిల్ 29న రవికుమార్ అనే వ్యక్తి యూఎస్ డాలర్లు దొంగిలిస్తుండగా విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. దీంతో పారదర్శకమైన, సాంకేతికత విధానాలు అవలంబించాలని టీటీడీకి హైకోర్టు సూచించింది. మానవ ప్రమేయాన్ని తగ్గించేందుకు యాంత్రీకరణ, కంప్యూటరీకరణ, డిజిటలైజేషన్, ఏఐతో సంస్కరణలు తీసుకురావాలని పేర్కొంది. దీనికోసం స్వల్పకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించింది. ప్రస్తుతం ఈ సంస్కరణల అమలు ప్రక్రియ కొనసాగుతోంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరోధించేందుకు, పూర్తి భద్రత, పారదర్శకతను నిర్ధారించేందుకు కరెన్సీ పరకామణి వద్ద పటిష్ఠమైన సాంకేతిక, నిఘా వ్యవస్థలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో నైట్ విజన్, హై రెజల్యూషన్ సీసీ కెమెరాలు, నిరంతర పర్యవేక్షణ, రికార్డింగ్ కోసం ప్రత్యేక సీసీటీవీ కంట్రోల్ రూం, క్రాస్‌చెక్ సదుపాయం కలిగిన ఆధునిక కరెన్సీ లెక్కింపు, ధ్రువీకరణ యంత్రాలు, మెటల్ డిటెక్టర్లను ఏర్పాటు చేశారు.
నాణేల లెక్కింపు కోసం...
శ్రీవారి హుండీలో పెద్దస్థాయిలో నాణేలూ జమ అవుతుంటాయి. వీటిని వేరు చేయడం, లెక్కించడం, నిర్వహించడానికి భారీ కసరత్తే జరుగుతుంది. ఈ నాణేలను కొండమీదే లెక్కించి... జనపనార సంచుల్లో తిరుపతిలో టీటీడీ పరిపాలన కార్యాలయంలో ఉన్న పరకామణి విభాగానికి తరలిస్తారు.
లెక్కించేది ఎవరంటే...
గతంలో పరకామణి లెక్కింపు విధుల్లో టీటీడీ రెగ్యులర్ సిబ్బంది, బ్యాంకు సిబ్బంది, శ్రీవారి సేవకుల ద్వారా నిర్వహించేవారు. అయితే... టీటీడీలో ఉద్యోగుల విరమణ, క్లాస్-4 సిబ్బంది కొత్త నియామకాలు లేనందున సిబ్బంది కొరత ఏర్పడింది. వయస్సు, ఆరోగ్య కారణాలతో హుండీలను ఒకచోటు నుంచి మరో చోటుకు తరలించడం, హుండీని బోర్లించడం, బరువైన నాణేల సంచులు మోయడం వంటి పనులు చేయలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగులపై పని ఒత్తిడి తగ్గించేందుకు వారికి పరకామణి సేవలను తొలగించాలని 2018 జూలైలో టీటీడీ ఎంప్లాయిస్ అసోసియేషన్ జాయింట్ యాక్షన్ కమిటీ ఉన్నతాధికారులను కోరింది. ఈ లెక్కింపును పూర్తిగా బ్యాంకు సిబ్బంది ద్వారా నిర్వహించాలనుకున్నా... యూనియన్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ మాత్రమే ముందుకొచ్చాయి. ఆంధ్రప్రదేశ్ బ్యాంక్ రిటైర్డ్ ఎంప్లాయిస్ ప్రాజెక్ట్స్ ఆఫ్ సెల్ఫ్ ఎంగేజ్‌మెంట్ (ఏబీఆర్‌ఈపీవోఎ్‌సఈ) ద్వారా సంయుక్తంగా హుండీ లెక్కింపునకు అంగీకరించారు. 2024 ఫిబ్రవరి 1 నుంచి ఏబీఆర్‌ఈపీవోఎ్‌సఈ నుంచి 139 మందితోపాటు అవసరాన్ని బట్టి గరిష్ఠంగా 260 మంది శ్రీవారి సేవకులను వినియోగించుకుంటున్నారు. టీటీడీ అధికారులు, విజిలెన్స్ విభాగం పర్యవేక్షణలో వీరు హుండీలోని కానుకలను లెక్కిస్తారు. ఏబీఆర్‌ఈపీవోఎ్‌సఈ సిబ్బందిలో 95 మందికి టీటీడీ, 44 మందికి ఎస్‌బీఐ, యూబీఐ వేతనాలు చెల్లిస్తున్నాయి.