కల్తీ పాలను ఇంట్లోనే గుర్తించండిలా..!
ABN , Publish Date - Mar 11 , 2026 | 05:39 AM
రాజమహేంద్రవరంలో గత నెలలో జరిగిన కల్తీపాల ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. అక్కడ వ్యాపారి సరఫరా చేసిన పాలల్లో విషపూరిత రసాయనాలు కలిశాయని ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికలో నిర్ధారణ అయింది.
పుస్తకాలు, కరపత్రాలతో ఫుడ్ సేఫ్టీ అథారిటీ ప్రచారం
కల్తీని గుర్తిస్తే ఫిర్యాదు చేసేందుకు టోల్‌ఫ్రీ నంబర్లు
1800 425 3857, 08645 297245 విడుదల
అమరావతి, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): రాజమహేంద్రవరంలో గత నెలలో జరిగిన కల్తీపాల ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. అక్కడ వ్యాపారి సరఫరా చేసిన పాలల్లో విషపూరిత రసాయనాలు కలిశాయని ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికలో నిర్ధారణ అయింది. దీంతో అసలు మనం రోజూ వాడుతున్న పాలు, పాలపదార్థాలు సురక్షితమేనా..? అనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పాలు, పాల పదార్ధాల్లో కల్తీని ఇంట్లోనే సులువుగా గుర్తించవచ్చని రాష్ట్ర ఆహార భద్రతా సాధికార సంస్థ మంగళవారం వెల్లడించింది. రాజమహేంద్రవరంలో కల్తీ పాల ఘటన నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాల మేరకు.. పాలు, పాల ఉత్పత్తుల్లో కల్తీని ఎలా గుర్తించాలో తెలియజేస్తూ పుస్తకాలు, కరపత్రాలు ప్రచురించి విద్యా సంస్థలకు పంపిణీ చేయనున్నట్టు ఫుడ్ సేఫ్టీ అథారిటీ డైరెక్టర్, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ డైరెక్టర్ నీలకంఠారెడ్డి వివరించారు. ఎక్కడైనా కల్తీని గుర్తిస్తే టోల్‌ఫ్రీ నంబరు 1800 425 3857, ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ హెడ్ ఆఫీస్ నంబరు 08645 297245కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు.
పాలు, నెయ్యిలో కల్తీని కనిపెట్టే పద్ధతులివే..
ప్లేట్‌ను ఏటవాలుగా ఉంచి పాలచుక్క వదిలితే..స్వచ్ఛమైన పాలు అయితే తెల్లటిధారగా దిగుతుంది.
యూరియా లేదా డిటర్జెంట్ పౌడర్ కలిసిందా లేదా.. తెలుసుకోవాలంటే గ్లాస్‌లో 10 ఎంఎల్ పాలు, 10 ఎంఎల్ నీళ్లు కలిపి బాగా కదిలించాలి. స్వచ్ఛమైన పాలయితే నురగ రాదు. నురగ వస్తే కల్తీ జరిగినట్టే.
చిక్కదనం కోసం పాలలో మొక్కజొన్న లేదా ఇతర పిండి పదార్థాలను కలిపారా లేదా తెలుసుకోవాలంటే.. ఓ గ్లాసులో పాలు తీసుకుని అయోడిన్ ద్రావణాన్ని రెండు, మూడు చుక్కలు కలపాలి. పాలు నీలం రంగులోకి మారితే కల్తీ జరిగినట్టు.
నెయ్యిలో బంగాళాదుంప లేదా చిలగడ దుంప, ఇతర పిండి పదార్థాలు కలిసినట్టు తెలుసుకోవాలంటే.. ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని చిన్నగాజు గిన్నెలో వేసి... రెండు, మూడు చుక్కల అయోడిన్ ఉప్పు కలపాలి. నెయ్యి నీలం రంగులోకి మారితే కల్తీ జరిగినట్లు.
నెయ్యిలో వనస్పతి, పామాయిల్ వంటి నూనెలు కలిశాయో లేదో తెలుసుకోవాలంటే.. ఒక స్పూన్‌లో నెయ్యి తీసుకుని కొంచెం చక్కెర కలిపి వేడి చేయాలి. అది ఎరుపు లేదా పింక్ రంగులోకి మారితే కల్తీ జరిగినట్టే.