High Court: ‘పీపీపీ’పై ఎన్ని వ్యాజ్యాలు వేస్తారు?
ABN , Publish Date - Jan 08 , 2026 | 04:52 AM
ప్రభుత్వ వైద్య కళాశాలలను, ఆసుపత్రులను పబ్లిక్, ప్రైవేట్, భాగస్వామ్య(పీపీపీ) విధానంలో చేపట్టడాన్ని సవాల్ చేస్తూ ఇప్పటికే ప్రజాహిత వ్యాజ్యం(పిల్) దాఖలైందని...
పెండింగ్‌లోని పిల్ వైసీపీ కార్యకర్తదే.. పార్టీ తరఫున మరోపిల్ ఎందుకు?
సీనియర్ న్యాయవాదికి హైకోర్టు నిలదీత
అమరావతి, జనవరి 7(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ వైద్య కళాశాలలను, ఆసుపత్రులను పబ్లిక్, ప్రైవేట్, భాగస్వామ్య(పీపీపీ) విధానంలో చేపట్టడాన్ని సవాల్ చేస్తూ ఇప్పటికే ప్రజాహిత వ్యాజ్యం(పిల్) దాఖలైందని, ఒకే అంశంపై ఎన్ని పిటిషన్లు వేస్తారని వైసీపీ తరఫున కోర్టుకు హాజరైన సీనియర్ న్యాయవాదిని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. ఈ వ్యవహారంపై గతంలో ఓ పిల్ దాఖలైందని, అది వేసింది వైసీపీ కార్యకర్తేనని తాము కచ్చితంగా చెప్పగలమని వ్యాఖ్యానించింది. ఆ పిల్ పెండింగ్‌లో ఉండగా పార్టీ తరఫున మరో పిల్ వేయాల్సిన అవసరం ఏముందని నిలదీసింది. ప్రతి రెండు నెలలకు ఒకసారి కొత్త పిల్ దాఖలు చేసుకుంటూ పోతే.. కౌంటర్ దాఖలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి సమయం ఇవ్వాల్సి ఉంటుందని తెలిపింది. ఫలితంగా విచారణ మరింత జాప్యం అవుతుందని, కేసు పరిష్కారం కాకుండా మీరే నాశనం చేసుకుంటున్నారని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఇప్పటికే దాఖలైన పిల్‌లో ప్రతివాదిగా చేరి వాదనలు వినిపించాలని పిటిషనర్(వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి)కు సూచించింది. ఈ సందర్భంగా అప్పిరెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘‘గతంలో దాఖలు చేసిన పిల్‌తో మాకు సంబంధం లేదు. ప్రస్తుత వ్యాజ్యంలో కొత్త అంశాలను ప్రస్తావించాం. పీపీపీ విధానంలో వైద్య కళాశాలలను నిర్మించడం.. ఉచిత వైద్యం అందుతుందన్న ప్రజల న్యాయబద్ధమైన హక్కును హరించడమే. వైద్య కళాశాలల్లో ఫీజుల పెంపు, తద్వారా ప్రజలపై పడే భారాన్ని ప్రశ్నించాం. ఇప్పటికే పెండింగ్ ఉన్న పిల్‌తో ప్రస్తుత వ్యాజ్యాన్ని జత చేయండి.’’ అని పదేపదే అభ్యర్థించారు. దీంతో ధర్మాసనం కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది. ప్రస్తుత పిటిషన్‌ను పెండింగ్ పిల్‌తో జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, జస్టిస్ చల్లా గుణరంజన్‌తో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది.