ఇంకెన్నాళ్లీ బాధ!
ABN , Publish Date - Mar 26 , 2026 | 12:33 AM
నిషేధిత భూముల జాబితా కత్తి రైతుల మెడపై ఏళ్ల తరబడి వేలాడుతోంది. స్వాతంత్ర్యానికి పూర్వమే సంక్రమించిన భూములను తమ అవసరాలకు వినియోగించుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 35 వేల ఎకరాల భూముల విముక్తి కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.
- కోడూరు, నాగాయలంక మండలాల్లో నిషేధిత జాబితాలో 35 వేల ఎకరాలు
- స్వాతంత్ర్యానికి పూర్వం సంక్రమించిన భూములు
- స్వాతంత్ర్యానంతరం పట్టాలు ఇచ్చినట్టు ప్రొసీడింగ్స్ ఆధారాలు
- 2016లో నిషేధిత భూముల జాబితాలోకి..
- విముక్తి కోసం ఎదురుచూస్తున్న రైతులు
నిషేధిత భూముల జాబితా కత్తి రైతుల మెడపై ఏళ్ల తరబడి వేలాడుతోంది. స్వాతంత్ర్యానికి పూర్వమే సంక్రమించిన భూములను తమ అవసరాలకు వినియోగించుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 35 వేల ఎకరాల భూముల విముక్తి కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.
(ఆంద్రజ్యోతి, కోడూరు):
ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 35 వేల ఎకరాల భూములను నిషేధిత భూముల జాబితాలో చేర్చారు. వాటి విముక్తి కోసం రైతులు ఏళ్లతరబడి ఎదురుచూస్తున్నారు. కృష్ణాజిల్లా కోడూరు, నాగాయలంక మండలాల రైతులకు చెందిన 35 వేల ఎకరాల భూములు 22ఎ(బి) (ఎడబ్ల్యూడి)లో ఉన్నాయి. స్వాతంత్ర్యానంతరం 1953లో ఇండియన్ సివిల్ సర్వీసెస్ అధికారులు రైతులకు భూములు ఇచ్చినట్టుగా కృష్ణా కలెక్టరేట్‌లో ప్రొసీడింగ్స్ ఉన్నాయి. కాబట్టి ఈ భూములు నిషేధిత జాబితా నుంచి తొలగించటానికి అర్హత కలిగినవి. వాస్తవానికి స్వాతంత్ర్యానికి పూర్వం ప్రభుత్వం ఇచ్చిన భూములను సాగు చేసుకుంటున్న రైతులకు మే 5, 2016న 196 జీవో ద్వారా కోడూరు, నాగాయలంక మండలాల్లోని సుమారు 35 వేల ఎకరాల భూములను, వాటిని సాగు చేస్తున్న రైతులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నిషేధిత జాబితాలో చేర్చటం జరిగింది. స్వాతంత్ర్యానికి పూర్వమే ఈ భూములు పూర్తి హక్కుభుక్తంతో అనుభవిస్తున్నారు. ప్రభుత్వానికి చలానా కట్టి, స్టాంపు డ్యూటీ చెల్లించి, రిజిస్ర్టేషన్ చేయించుకుని, ప్రభుత్వం ద్వారా పాస్ పుస్తకాలు కూడా పొంది, ప్రభుత్వానికి నీటి తీరువా వగైరా చెల్లిస్తున్న భూములను నిషేధిత జాబితాలో చేర్చడంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే హక్కులు కల్పించి.. తిరిగి మళ్లీ ప్రభుత్వమే ఆ హక్కులను కాలరాసేలా చేయడంతో రైతులు దిక్కుతోచనిస్థితిలో పడ్డారు. స్వాతంత్య్రం రాక ముందు 1932లో రెవెన్యూ శాఖ ఆర్‌ఎస్‌ఆర్‌లో ఈ భూములు నమోదయ్యాయి. ఈ మధ్య కాలంలో ఆర్‌ఎస్‌ఆర్ రికార్డుల్లో అనేక చేర్పులు, మార్పులు జరిగాయి. క్రయ విక్రయాలు జరిపారు. వీటన్నింటిని పరిశీలించకుండా రైతుల భూములను నిషేధిత జాబితాలో చేర్చారు.
నోటీస్ ఇవ్వకుండా 22ఏలో చేర్చారు!
భూ రికార్డుల కంప్యూటరీకరణ 2016లో మొదలైంది. రెవెన్యూ రికార్డుల్లో రైతుల భూముల వివరాలు సవరణ చెయ్యాలంటే, రైతులకు ముందుగా నోటీసు ఇచ్చి వారి దగ్గర ఉన్న భూమి పత్రాలను పరిశీలించి సవరణ చెయ్యాలి. కానీ రైతులకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఆర్‌ఎస్‌ఆర్‌లో రైతుల పేర్లు తొలగించారు. దీంతో గందరగోళం తలెత్తింది. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా రక్షణ కల్పించేందుకు 22ఎ సెక్షన్‌ను రూపొందిచారు. కానీ దానిని దుర్వినియోగం చేసి రైతుల పట్టా భూములను అక్రమంగా నిషేధిత భూముల జాబితాలో చేర్చారని రైతులు ఆరోపిస్తున్నారు. దశాబ్దకాలంగా 196 జీవోని ప్రభుత్వం రద్దు చేస్తుందని రైతులు ఎదురుచూస్తున్నారు. కాలక్రమేణా అడంగల్, ఆర్‌ఎస్‌ఆర్ రికార్డుల్లో కొంతం మంది రైతుల పేర్లను అనుభవదారులుగా చేర్చి నీటి తీరువా కట్టించుకున్నారు. ప్రస్త్తుతం వీటిని కూడా నిలుపుదల చేసి తమ హక్కులను సంపూర్ణంగా హరించారని రైతులు ఆవేదన చెందుతున్నారు.
భూముల క్రయ విక్రయాలకు బ్రేక్
నిషేధిత చెరలో ఉండటంతో తమ భూములను రైతులు అవసరాల కోసం విక్రయించలేక, బ్యాంకర్ల దగ్గర రుణాలు పొందలేకపోతున్నారు. ఆడ పిల్లలకు పసుపు కుంకుమ కింద ఇచ్చిన భూమిపై వారికి హక్కులు కల్పించలేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నపుడు మాత్రమే నాయకులకు రైతుల సమస్యలు కనిపిస్తున్నాయని, అధికారంలోకి వచ్చాక తమ భూముల సమస్యలు విస్మరిస్తున్నారని వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం సానుకూలంగా స్పందించి 22ఎ నిషేధిత జాబితా నుంచి రైతుల భూములకు విముక్తి కల్పించాలని కోరుతున్నారు.