Share News

Bhimavaram: హోటల్‌ రూం..3 రోజులకు రూ.లక్ష!

ABN , Publish Date - Jan 10 , 2026 | 05:20 AM

సంక్రాంతి సంబరాలకు పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం పెట్టింది పేరు. ఇక్కడ నిర్వహించే కోడి పందేలకు విపరీతమైన క్రేజ్‌ ఉంది.

Bhimavaram: హోటల్‌ రూం..3 రోజులకు రూ.లక్ష!

  • భీమవరంలో కోడి పందేల ఎఫెక్ట్‌

  • సాధారణ హోటళ్లు, లాడ్జీల్లో రూ.30వేల నుంచి 60వేలు.. అన్నీ ఫుల్‌!

  • మూడు నెలల ముందునుంచే బుకింగ్‌లు ప్రారంభం

  • కల్యాణ మండపాలు, విడిదిళ్లకు సైతం భారీ డిమాండ్‌

  • పొరుగు రాష్ట్రాల నుంచి పెద్దఎత్తున రానున్న అతిథులు

  • గదుల అద్దెలు పెంచేయడంతో పర్యాటకులకు చుక్కలు

(భీమవరం-ఆంధ్రజ్యోతి)

సంక్రాంతి సంబరాలకు పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం పెట్టింది పేరు. ఇక్కడ నిర్వహించే కోడి పందేలకు విపరీతమైన క్రేజ్‌ ఉంది. వీటిని ప్రత్యక్షంగా తిలకించడానికి, పందేల్లో పాల్గొనడానికి ఏపీతో పాటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక నుంచి పెద్దసంఖ్యలో తరలివస్తుంటారు. పండుగ సమీపిస్తుండటంతో ఇప్పటికే గోదావరి జిల్లాల్లో బరులు సిద్ధమయ్యాయి. పందేల్లో పాల్గొనేందుకు రావాల్సిందిగా పెద్ద ఎత్తున అతిథులకు ఆహ్వానాలు వెళ్లాయి. ఈసారి గతానికి మించి సంక్రాంతి జోష్‌ కనిపిస్తోంది. హైటెక్‌ సొగసులతో బరులను తీర్చిదిద్దుతున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వసతులన్నీ ఫుల్‌ అయ్యాయి. సంక్రాంతి సందర్భంగా ఐదు రోజుల పాటు లాడ్జీలు, హోటల్‌ గదులన్నీ ముందస్తుగా బుక్‌ చేసుకున్నారు. భీమవరం, ఏలూరు, తాడేపల్లిగూడెం, తణుకు, పాలకొల్లు, నరసాపురం, ఆకివీడుల్లో దాదాపు 150 హోటళ్లు ఉన్నాయి.


ప్రస్తుతం వీటిలో ఒక్క రూమ్‌ కూడా ఖాళీ లేదు. ఇతర ప్రాంతాల నుంచి పందేలను తిలకించేందుకు వచ్చేవారంతా జిల్లాలోని తమ సన్నిహితులు, రాజకీయ నాయకులను సంప్రదిస్తున్నారు. ఇక ప్రైవేటు ఇళ్లను 3 రోజులకు అద్దెకు తీసుకుంటున్నారు. పెళ్లిళ్లు, శుభకార్యాలు పుట్టినరోజు వేడుకలు నిర్వహించుకునే విడిదిళ్లకు, కల్యాణ మండపాలకు సైతం గిరాకీ ఏర్పడింది. గదులకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని యజమానులు మూడు నుంచి నాలుగు రెట్ల వరకు అద్దె అదనంగా వసూలు చేస్తున్నారు. కొన్ని హోటళ్లలో గదులను, గెస్ట్‌హౌ్‌సలను ఎవరికీ ఇవ్వవద్దని కొందరు రాజకీయ నాయకులు ఇప్పటికే ఆదేశాలు జారీచేసి వాటిని రిజర్వ్‌ చేశారు. అలాగే హోటళ్లు, లాడ్జీల్లో ఒక రోజు ప్రాతిపదికన రూమ్‌లు ఇవ్వడం లేదు. మూడు రోజుల ప్యాకేజీతో కేటాయిస్తున్నారు. భీమవరం, ఏలూరు, తణుకు ప్రాంతాల్లో హోటల్‌ స్థాయిని బట్టి ఒక్క గదికి రూ.30వేల నుంచి రూ.60వేల వరకు వసూలు చేస్తున్నారు. భీమవరంలోని రెండు ప్రముఖ హోటళ్లలో ఒక గదికి 3రోజులకు రూ.లక్ష చొప్పున 60 గదులు రిజర్వు చేశారు. సాధారణ రోజుల్లో లాడ్జీ, హోటల్‌ స్థాయిని బట్టి రోజుకు రూ.వెయ్యి నుంచి రూ5 వేల వరకు ఉంటుంది. అయితే ఈసారి గతేడాది కంటే అధికంగా ధరలను పెంచేశారు. వసతి భారంగా మారండంతో గోదావరి అందాలను తిలకించేందుకు ప్రణాళికలు వేసుకున్న సామాన్య పర్యాటకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


రూ.కోటికి పైనే పందేలు

కోడి పందేల్లో రూ.కోట్ల వర్షం కురిపించేందుకు బరుల నిర్వాహకులు ఇప్పటికే పందెగాళ్లతో సంప్రదింపులు జరిపారు. కొన్నిచోట్ల గతేడాది పెద్ద మొత్తంలో పందెం గెలిచినవారితో తమ బరికే రావాలని ఒప్పందాలు చేసుకున్నారు. నిరుడు రూ.కోటికి పైగా పందెం గెలుచుకున్న తాడేపల్లిగూడెంలో రూ.2.5 కోట్లకు ఒక పందెం సిద్ధమైంది. దీనిపై నిర్వాహకులు పెద్దఎత్తున ప్రచారం మొదలు పెట్టారు. ఇక పెద్ద బరులు నిర్వహిస్తున్న సీసలి, నారాయణపురం, గొల్లవానితిప్ప, చినఅమిరం ప్రాంతాల్లో రూ.కోటి పందేలకు ఒప్పందాలు కుదిరాయి. ఇరువైపులా సిండికేట్‌ అయి రూ.కోటి పందేనికి కాలు దువ్వుతున్నారు.

Updated Date - Jan 10 , 2026 | 05:22 AM