ఆశలు ఆవిరి!
ABN , Publish Date - Sep 09 , 2026 | 01:15 AM
ఖరీఫ్ ఆశలు నీరుగారాయి. రాబోవు రబీ అయినా గట్టెక్కిస్తుందా అంటే నమ్మకం లేదు.
అన్నదాతలను ముంచేసిన ఎల్‌నినో
మొక్క దశలోనే ఎండిపోయిన పంట
వర్షాభావంతో రబీకి గండమే
దిక్కుతోచని స్థితిలో రైతన్నలు
కోడుమూరు రూరల్, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): ఖరీఫ్ ఆశలు నీరుగారాయి. రాబోవు రబీ అయినా గట్టెక్కిస్తుందా అంటే నమ్మకం లేదు. ఎల్‌నినో దెబ్బకు వాతావరణంలో నెలకొన్న అనిశ్చితి వలన రైతులకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. ఖరీఫ్‌లో పంట సాగుకు పెట్టిన పెట్టుబడి మట్టిలో కలిసింది. ఎల్‌నినో దెబ్బతో జల్లుల రూపంలో తప్ప భారీ వర్షాలు పడలేదు. దీనికి తోడు వేసవిని తలపించేలా ఎండల తీవ్రత. దీంతో ఎల్‌నినో దెబ్బకు ఖరీఫ్ పంటలు ఊఫ్‌మన్నాయి. కోడుమూరు మండలంలో అధికభాగం రైతులు వర్షాధారంగా పంటలు సాగు చేస్తారు. కొంతవరకు ఎల్లెల్సీ, జీడీపీ, హంద్రీనీవా పరిధిలో లబ్ది పొందుతున్నారు. ఏటా ఖరీఫ్‌లో నీటివనరులు, వర్షాధారం కింద దాదాపు 15 వేల హెక్టార్ల మేర పత్తి, కంది, సజ్జ, ఉల్లి, వేరుశనగ, పొగాకు వంటి వివిధ రకాలు పంటలు వేస్తారు. ఇందులో పత్తి పంటది ఆగ్రభాగం. ప్యాలకుర్తి, కొత్తూరు, గోరంట్ల, అమడగుంట్ల, అనుగొండ, లద్దగిరి, కృష్ణాపురం, వర్కూరు తదితర గ్రామాల్లో వేల ఎకరాల్లో పత్తి సాగవుతోంది.
ఫ అనుకూలించని వానలు:
ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో ఆశించిన మేర వర్షాలు లేవు. ఖరీఫ్ ఆరంభంలో కొంత వరకు వర్షాలు పడడంతో కొన్ని గ్రామాల్లో పంటలు సాగు చేశారు. అందులోనూ సాగు విస్తీర్ణం పాతిక శాతం మించలేదు. గడిచిన మూడు మాసాల్లో వర్షాలు అనుకూలించలేదు. జూన, జూలై, ఆగస్టు మాసాల్లోనూ లోటు వర్షపాతం నమోదైంది. దీంతో పంటలు సాగు చేసిన రైతులు, విత్తు కోసం ఎదురు చూస్తున్న రైతులకు నిరాశే మిగిలింది.
ఫ ఎండిన పంటలు... ఖాళీ పొలాలు:
తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా సాగు చేసిన పంటలు ఎదగలేదు. మరోవైపు విత్తు లేని పొలాలు దర్శనమిస్తున్నాయి. గోరంట్ల, వెంకటగిరి, కోడుమూరు, ప్యాలకుర్తి వంటి గ్రామాల్లో సుమారు 3 వేల ఎకరాలకు పైగా వర్షాధారం కింద ఉల్లి సాగు చేస్తారు. అయితే నెల రోజుల క్రితం కురిసిన జల్లులకు నాటు వేసిన పొలాలన్నీ తీవ్ర ఉష్ణోగ్రతలకు ఎండిపోయాయి. విత్తనాలు, ఉల్లి నారు పెంపకం, నాటు ఖర్చులు ఎకరాకు రూ.30 వేలు ఖర్చు పెట్టారు. ఈ లెక్కన రూ.9 కోట్లు నష్టం వాటిల్లింది. పత్తి, ఇతరత్రా పంటలు సాగు చేసిన రైతులకూ నష్టం తప్పలేదు. వర్షం లేకపోవడంతో పెంచుకున్న పొగాకు నారు బెడ్లకు పరిమితమైంది. ఇకపై వర్షాలు అనుకూలిస్తే రబీ పంట కింద పప్పుశనగ, జొన్న, ధనియాలు వంటి పంటలు సాగు చేసుకుంటామని పలు గ్రామాల రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఫ 8 ఎకరాల్లో ఉల్లి ఎండిపోయింది
- గిడ్డయ్య, గోరంట్ల గ్రామం
వర్షాధారం కింద ఎనిమిది ఎకరాలు కౌలు తీసుకుని ఉల్లినాటు వేశాను. అయితే నాటు వేసిన అనంతరం వర్షాలు లేక ఎండిపోయింది. మరి కొంత పొలం విత్తు పడలేదు. రూ. 2 లక్షలకు పైగా నష్టం వాటిల్లింది. ఎల్‌నినో దెబ్బతో వానలు లేక ఖరీఫ్ అనుకూలించలేదు. వర్షాలు అనుకూలిస్తే రబీలో పంటలు సాగు చేసుకుంటాను.
ఫ పత్తి ఎదగలేదు
- రమేష్, అమడగుంట్ల గ్రామం
వర్షాధారం కింద 9 ఎకరాల్లో పత్తి సాగు చేశాను. అయితే వానల్లేక పైరు ఎదగలేదు. విత్తనాలు, మందులు, గెడం కలిపి ఎకరాకు మొత్తం రూ. 30 వేలు ఖర్చు అయ్యింది. పెట్టుబడి వస్తే గగనమే. రబీపైనే ఆశలు. దేవుడు కరుణించాలి.