Share News

‘ముడా’పై ఆశలు!

ABN , Publish Date - Jan 07 , 2026 | 12:37 AM

మచిలీపట్నం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ముడా) చైర్మన్‌ పదవి కోసం పోటీ తీవ్రమైంది. మచిలీపట్నానికి చెందిన వారికి ఈ పదవిని ఇస్తారా లేక గతంలో మాదిరిగానే జిల్లాలోని వేరే ప్రాంతానికి చెందిన నాయకుడికి కేటాయిస్తారా అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. గత నాలుగైదు నెలలుగా ఖాళీగా ఉన్న ఈ పదవిని దక్కించుకునేందుకు కూటమి నాయకులు తెరవెనుక మంత్రాంగం నడిపారు. అయితే కూటమి పొత్తులో భాగంగా ఈ పదవిని మళ్లీ బీజేపీకి కేటాయిస్తారనే ప్రచారం ఇటీవల కాలంలో ఊపందుకుంది. ఈ నేపథ్యంలో టీడీపీలోని కొందరు తమకు ఈ పదవి దక్కదని తెలుసుకుని, తమ సామాజిక వర్గానికి చెందిన బీజేపీ నాయకుడికి కేటాయించాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. దీంతో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.

‘ముడా’పై ఆశలు!

- చైర్మన్‌ పదవి కోసం పోటాపోటీగా కూటమి నేతల ప్రయత్నాలు

- మళ్లీ బీజేపీకే కేటాయిస్తారని విస్తృతంగా ప్రచారం

- 2 రోజుల్లో సీఎం చంద్రబాబు వద్దకు బీజేపీ నేతలు సిఫార్సు చేసిన పేరు

- తమ సామాజిక వర్గం వారికి పదవి తెచ్చుకునేందుకు తెరవెనుక కొందరు పైరవీలు

- నిష్పక్షపాతంగానే ఎంపిక ఉంటుందంటున్న బీజేపీ అగ్ర నాయకులు

- జిల్లాలో చర్చనీయాంశంగా మచిలీపట్నం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ చైర్మన్‌ పదవి

మచిలీపట్నం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ముడా) చైర్మన్‌ పదవి కోసం పోటీ తీవ్రమైంది. మచిలీపట్నానికి చెందిన వారికి ఈ పదవిని ఇస్తారా లేక గతంలో మాదిరిగానే జిల్లాలోని వేరే ప్రాంతానికి చెందిన నాయకుడికి కేటాయిస్తారా అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. గత నాలుగైదు నెలలుగా ఖాళీగా ఉన్న ఈ పదవిని దక్కించుకునేందుకు కూటమి నాయకులు తెరవెనుక మంత్రాంగం నడిపారు. అయితే కూటమి పొత్తులో భాగంగా ఈ పదవిని మళ్లీ బీజేపీకి కేటాయిస్తారనే ప్రచారం ఇటీవల కాలంలో ఊపందుకుంది. ఈ నేపథ్యంలో టీడీపీలోని కొందరు తమకు ఈ పదవి దక్కదని తెలుసుకుని, తమ సామాజిక వర్గానికి చెందిన బీజేపీ నాయకుడికి కేటాయించాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. దీంతో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం:

కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గుడివాడకు చెందిన బీజేపీ నాయకుడు మట్టా ప్రసాద్‌ను ముడా చైర్మన్‌గా నియమించింది. 2024 నవంబరు 20వ తేదీన ఆయన బాధ్యతలు స్వీకరించారు. 9 నెలల పాటు ఈ పదవిలో కొనసాగిన ఆయన తన పదకి రాజీనామా చేశారు. గత ఏడాది సెప్టెంబరు 9వ తేదీన ప్రభుత్వం ఈ రాజీనామాను ఆమోదించింది. మట్టా ప్రసాద్‌కు బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా పదవి రావడంతో పాటు వివిధ రాజకీయ పరమైన కారణాలతో ముడా చైర్మన్‌ పదవిని ఆయన వదులుకున్నారనే ప్రచారం అప్పట్లో జరిగింది.

నాలుగైదు నెలలుగా ప్రయత్నాలు

ముడా చైర్మన్‌ పదవి ఖాళీ కావడంతో మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన కూటమి నాయకులు ఈ పదవిని పొందేందుకు గత నాలుగైదు నెలలుగా తెరవెనుక మంత్రాంగం నడుపుతూనే ఉన్నారు. కూటమి పొత్తులో భాగంగా ముడా చైర్మన్‌ పదవిని మళ్లీ బీజేపీకే కేటాయిస్తారని బీజేపీ నాయకులు విస్త్రతంగా ప్రచారం చేస్తున్నారు. ముడా చైర్మన్‌ పదవిని ఎవరికి కేటాయించాలో పేరు సిఫార్సు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు బీజేపీ రాష్ట్ర నాయకులకు సూచించారని, రెండు రోజుల్లో ముడా చైర్మన్‌ పదవి కోసం పేరును సిపార్సు చేస్తారని బీజేపీలోని కీలక నాయకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ పదవిని దక్కించుకునేందుకు కొందరు తమ వంతు ప్రయత్నాలు వేగవంతం చేస్తున్నారు. అయితే మచిలీపట్నానికి చెందిన వారికి ఈ పదవిని ఇస్తారా లేక గతంలో మాదిరిగానే జిల్లాలోని వేరే ప్రాంతానికి చెందిన బీజీపీ నాయకులకు కేటాయిస్తారా అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. మాజీ ప్రధాని వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో మచిలీపట్నంలో జరిగిన వాజ్‌పేయి విగ్రహావిష్కరణకు మంత్రి నారా లోకేశ్‌ను తీసుకువచ్చారు. ఈ సమయంలోనే ముడా చైర్మన్‌ పదవిని బీజేపీకి కేటాయించాలనే అంశం చర్చకు వచ్చినట్లు సమాచారం. దీంతో ముడా చైర్మన్‌ పదవి బీజేపీ నాయకులలో ఎవరికి దక్కుతుందనే అంశంపై రోజురోజుకు ఉత్కంఠ పెరుగుతోంది.

బీజేపీ అగ్రనాయకుల చుట్టూ ప్రదక్షిణలు

గతంలో గుడివాడకు చెందిన మట్టా ప్రసాద్‌కు ఈ పదవిని ఇచ్చారు. దీనిపై మచిలీపట్నానికి చెందిన కూటమి నాయకులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈసారైనా తమ నియోజకవర్గానికి చెందిన సీనియర్‌ బీజేపీ నాయకులలో ఒకరికి ఈ పదవిని ఇవ్వాలనే డిమాండ్‌ను కూటమి నాయకులు తెరపైకి తెచ్చారు. టీడీపీ చెందిన ఒక కార్యకర్త తాను టీడీపీని వీడి బీజేపీలో చేరతానని, తనకు ముడా చైర్మన్‌ పదవిని ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర నాయకుల చుట్టూ తిరిగాడని తెలిసింది. ఇతని పనితీరు, వ్యవహారశైలి తెలుసుకున్న బీజేపీ అగ్ర నాయకత్వం ఈ ప్రతిపాదనను తిరస్కరించినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో ఈ కార్యకర్త తమ సామాజిక వర్గానికి చెందిన బీజేపీ నాయకుడికి ఈ పదవిని ఇవ్వాలని కోరుతూ బీజేపీ నాయకుల వద్దకు తన మనుషులను పంపుతున్నట్టు తెలిసింది. ఈ విషయాన్ని గ్రహించిన బీజేపీ అగ్రనాయకులు ఈ వ్యూహం వెనుక అంతరార్థాన్ని గ్రహించి ఆచి, తూచి వ్యవహరిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా, బీజేపీకి చెందిన నియోజకవర్గస్థాయి నాయకుడు ఒకరు గుట్టుచప్పుడు కాకుండా తనకు ముడా చైర్మన్‌ పదవిని ఇవ్వాలని తనవంతుగా ప్రయత్నాలు చేసుకుంటున్నారని తెలిసింది. మచిలీపట్నానికి చెందిన మరో బీజేపీ నాయకుడు ఈ సారి ముడా చైర్మన్‌ పదవిని బీసీ సామాజిక వర్గానికి కేటాయించాలని కోరుతూ తనవంతుగా ప్రయత్నాలు చేసుకుంటున్నాడని సమాచారం. ఈ క్రమంలో ముడా చైర్మన్‌ పదవి బీజేపీకే దక్కుతుందని, ఎవరెన్ని ప్రయత్నిలు చేసినా, ఈ పదవిని అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తికే కేటాయించడం జరుగుతుందని బీజేపీ అగ్రనాయకులు స్పష్టం చేసినట్టు తెలిసింది.

Updated Date - Jan 07 , 2026 | 12:37 AM