Share News

ఆలయ భూములపై ఆశ!

ABN , Publish Date - Mar 30 , 2026 | 12:25 AM

దేవదాయ భూములను లీజులకు తీసుకోవడం.. ఆ తర్వాత వాటిని కబ్జాకు ప్రయత్నించడం రివాజుగా మారింది. దేవాలయ భూముల అన్యాక్రాంతం జాబితాలో తాజాగా వీరవల్లిలోని శ్రీకొండేశ్వరస్వామి దేవస్థానం భూములు కూడా చేరాయి. జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌ - 16) వెంబడి ఉండే అత్యంత ఖరీదైన 8.50 ఎకరాల భూములను సాగు కోసం కొందరు లీజుకు తీసుకున్నారు. లీజుకు తీసుకున్న వ్యక్తుల పేరుతో అవి వారి భూములుగా ‘వెబ్‌ల్యాండ్‌ అడంగల్‌’లో పేర్లు మారిపోయాయి. ఈ విషయం విశ్రాంత రైల్వే ఉద్యోగి ఫిర్యాదుతో వెలుగు చూసింది. ప్రస్తుతం రెవెన్యూ రికార్డులను సరిచేసినప్పటికీ.. కోర్టు వివాదాలు మాత్రం నడుస్తూనే ఉన్నాయి.

ఆలయ భూములపై ఆశ!

- వీరవల్లి శ్రీకొండేశ్వరస్వామి దేవస్థానం భూములపై కొనసాగుతున్న వివాదం

- లీజుకు తీసుకొని వెబ్‌ల్యాండ్‌ అడంగల్‌లో తమ పేర్లు మార్పించుకున్నారు!

- ఈ బాగోతంపై ఫిర్యాదు రావటంతో.. రెవెన్యూ అధికారుల విచారణ

- భూములు శ్రీకొండేశ్వరస్వామివేనని నిర్ధారణ

- వెబ్‌ల్యాండ్‌లో పేర్లు నమోదైన వారికి నోటీసులు

- అవి మా భూములు కావని.. లీజుకు తీసుకున్నామని వివరణ

- వీరిలో కొందరు.. మళ్లీ ఈ భూములు కొన్నామంటూ కోర్టుకు..

దేవదాయ భూములను లీజులకు తీసుకోవడం.. ఆ తర్వాత వాటిని కబ్జాకు ప్రయత్నించడం రివాజుగా మారింది. దేవాలయ భూముల అన్యాక్రాంతం జాబితాలో తాజాగా వీరవల్లిలోని శ్రీకొండేశ్వరస్వామి దేవస్థానం భూములు కూడా చేరాయి. జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌ - 16) వెంబడి ఉండే అత్యంత ఖరీదైన 8.50 ఎకరాల భూములను సాగు కోసం కొందరు లీజుకు తీసుకున్నారు. లీజుకు తీసుకున్న వ్యక్తుల పేరుతో అవి వారి భూములుగా ‘వెబ్‌ల్యాండ్‌ అడంగల్‌’లో పేర్లు మారిపోయాయి. ఈ విషయం విశ్రాంత రైల్వే ఉద్యోగి ఫిర్యాదుతో వెలుగు చూసింది. ప్రస్తుతం రెవెన్యూ రికార్డులను సరిచేసినప్పటికీ.. కోర్టు వివాదాలు మాత్రం నడుస్తూనే ఉన్నాయి.

(ఆంధ్రజ్యోతి, విజయవాడ):

వీరవల్లిలోని శ్రీకొండేశ్వరస్వామి దేవస్థానానికి జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌-16) వెంబడి 8.50 ఎకరాల భూములు ఉన్నాయి. ఆలయ నిర్వహణ నిమిత్తం ఆదాయం పొందేందుకు ఈ భూములను లీజుకు ఇచ్చారు. సుదీర్ఘకాలం నుంచి ఈ భూములను లీజులకు తీసుకుంటున్న వారు.. అద్దెలు సక్రమంగా చెల్లిస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉంది. అయితే అకస్మాత్తుగా వెబ్‌ల్యాండ్‌ అడంగల్‌లో శ్రీకొండేశ్వరస్వామి భూములు కాస్తా లీజుదారుల పేరుతో మారిపోయాయి. రెవెన్యూ మదర్‌ రికార్డులతో పాటు, ఎఫ్‌ఎల్‌ఆర్‌ వంటి ప్రామాణిక రికార్డులలో శ్రీకొండేశ్వరస్వామి దేవస్థానం పేరుతోనే భూములు ఉన్నాయని చూపిస్తున్నా.. వెబ్‌ల్యాండ్‌ అడంగల్‌లో పేర్లు మారిపోయాయి. ఇది జరిగి పదేళ్లు పైనే అవుతున్నట్టు సమాచారం. ఈ విషయం దేవదాయశాఖ అధికారులకు కూడా తెలియదు.

విశ్రాంత ఉద్యోగి ఫిర్యాదుతో..

విశ్రాంత రైల్వే ఉద్యోగి లంక రాధాకృష్ణమూర్తి అనే వ్యక్తి అప్పట్లో ఉమ్మడి కృష్ణాజిల్లాలో అంతర్భాగంగా ఉన్న నూజివీడు సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో దీనిపై ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై తక్షణం రిపోర్టు ఇవ్వాల్సిందిగా బాపులపాడు తహసీల్దార్‌ కార్యాలయాన్ని సబ్‌కలెక్టర్‌ ఆదేశించారు. దీనిపై అప్పటి బాపులపాడు తహసీల్దార్‌ సబ్‌కలెక్టర్‌ కార్యాలయానికి సమగ్ర నివేదికను పంపించారు. సర్వే నెంబర్‌ 373లో 5.38 ఎకరాలు, సర్వే నెంబర్‌ 375-2లో 3.12 ఎకరాలు వెరసి 8.50 ఎకరాలు శ్రీకొండేశ్వరస్వామి దేవస్థానానికి చెందినవిగా నిర్ధారించారు. ఎఫ్‌ఎల్‌ఆర్‌, ఇతర రికార్డులలో ఈ భూములు దేవస్థానానినికి సంబంధించినవిగానే ఉన్నాయని నివేదికలో పొందుపరిచారు.

వెబ్‌ల్యాండ్‌ అడంగల్‌లో లీజుదారుల పేరుతోనే..

శ్రీకొండేశ్వరస్వామి దేవస్థానానికి చెందిన భూములు వెబ్‌ల్యాండ్‌ అడంగల్‌లో లీజుదారుల పేర్లు నమోదయ్యాయని రెవెన్యూ అధికారులు ధ్రువీకరించారు. రెవెన్యూ సర్వే నెంబర్‌ 373 (రెగ్యులర్‌ ఖాతా నెంబర్‌ 679) లో 1.70 ఎకరాలు, సర్వే నెంబర్‌ 373 (నోషనల్‌ ఖాతా నెంబర్‌ 100857)లో 3.68 ఎకరాలు గుండపనేని ఉమావరప్రసాద్‌ పేరుతో, సర్వే నెంబర్‌ 375 - 2 (రెగ్యులర్‌ నెంబర్‌ ఖాతా 677)లో 1.39 ఎకరాలు గుండపనేని వెంకయ్య చౌదరి పేరుతో, సర్వే నెంబర్‌ 375 - 2 (రెగ్యులర్‌ ఖాతా నెంబర్‌ 679)లో 1.10 ఎకరాలు గుండపనేని ఉమా వర ప్రసాద్‌ పేరుతో, సర్వే నెంబర్‌ 375-2 (నోషనల్‌ ఖాతా నెంబర్‌ 100576)లో 0.63 ఎకరాలు కర్రి కనకయ్య పేరుతో వెబ్‌ల్యాండ్‌ అడంగల్‌లో నమోదయ్యాయని తెలిపారు. వీరికి పట్టాదారు పాస్‌బుక్‌లు కూడా జారీ అయ్యాయన్న విషయాన్ని పేర్కొన్నారు.

లీజుదారులకు నోటీసులు జారీ

దీంతో సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం నుంచి గుండపనేని ఉమావరప్రసాద్‌, గుండపనేని వెంకయ్యచౌదరి, కర్రి కనకయ్యలకు పలుమార్లు నోటీసులు జారీ అయ్యాయి. ఈ నోటీసులు అందుకున్న వారిలో గుండపనేని ఉమావరప్రసాద్‌, కర్రి కనయ్య మాత్రం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయానికి అఫిడవిట్‌తో కూడిన వివరణను పంపారు. తమ వివరణలో నోటీసులో పేర్కొన్న సర్వే నెంబర్ల భూములు తమవి కావని.. తాము కేవలం వేలం పాట ద్వారా కౌలుకు మాత్రమే తీసుకున్నామని పేర్కొనటం జరిగింది. రికార్డులలో తమ పేర్లు ఎలా నమోదు అయ్యాయో తెలియదని, తమ పేర్లు ఉంటే వాటిని మార్చుకోవటానికి ఎలాంటి అభ్యంతరం లేదని లిఖిత పూర్వకంగా తెలియజేశారు. సబ్‌ కలెక్టరేట్‌ కార్యాలయం ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు అప్పట్లోనే వెబ్‌ల్యాండ్‌ అడంగల్‌ నుంచి వారి పేర్లను తొలగించి తిరిగి శ్రీకొండేశ్వరస్వామి దేవాలయంగా మార్చటం జరిగింది.

భూములు కొన్నామంటూ సరికొత్త వాదనలు!

ఆక్రమణదారులలో కొందరు మళ్లీ ఈ భూములు తమవేనని, తాము ప్రైవేటు వ్యక్తుల దగ్గర కొనుగోలు చేసినట్టుగా ఒక డాక్యుమెంట్‌ను తెరమీదకు తీసుకువచ్చారని సమాచారం. దీని ఆధారంగానే కోర్టును ఆశ్రయించినట్టు తెలుస్తోంది.

ఖరీదైన భూములు కావడంతోనే..

ఎన్‌హెచ్‌- 16 వెంబడి ఉన్న ఈ భూములు అత్యంత ఖరీదైనవి. రూ. కోట్లు పలుకుతున్నాయి. వీరవల్లిలో ఎకరం మార్కెట్‌ ధర రూ.2 కోట్లుగా ఉంది. ఈ లెక్కన చూస్తే మొత్తం 8.50 ఎకరాలు రూ.16 కోట్ల ధర పలుకుతోంది. ఇంత ధర పలికే భూములపై కన్నేసి.. వాటిని చేజిక్కించుకునేందుకే వెబ్‌ల్యాండ్‌ అడంగల్‌లో పేర్లు మార్పించారన్న ఆరోపణలు వస్తున్నాయి.

Updated Date - Mar 30 , 2026 | 12:25 AM